సవాళ్ళకు ఎదురొడ్డి నిలిచిన జాషువా



    సామాజిక సవాళ్ళను ఎదిరించి నిలబడిన వ్యక్తి జాషువా అని సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యకక్షులు తెలకపల్లి రవి అన్నారు. సాహితీస్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో జూలై 24న సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాలులో జాషువా వర్థంతి సభ జరిగింది. ఈ సందర్భంగా డా.ద్వా.నా. శాస్త్రి రచించిన 'జాషువా గుండెచప్పుళ్ళు' పుస్తకాన్ని తెలకపల్లి రవి ఆవిష్కరించారు. ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ జాషువా సామాజిక భాష్యమే కాకుండా కులమతాలు గీసిన గీతలకు కట్టుబడకుండా ఆ హైందవ ధర్మాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అన్నారు.ఈ సమయంలో జాషువా అనేక అవమానాలను ఎదుర్కొన్నాడని, అయినా ఆయన పయనం ఆపలేదని అన్నారు. జాషువా కవిత్వాన్ని రెండు రకాలుగా చూసేవారున్నారని తెలిపారు. చర్చలు ఎలా జరిగినా జాషువా కవిత్వం వెనకున్న అసలు విషయాన్ని చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. ద్వా.నా. శాస్త్రి మాట్లాడుతూ జాషువా ఉత్తమ కవిత్వాన్ని రాశాడని అన్నారు. బాధల నుంచే కవిత్వం పుట్టుకొచ్చిందనీ, అదే 'గబ్బిలం' కావ్యంగా వెలువడిందని అన్నారు. ఆర్ధ్ర హృదయం ఉండాలని, మానవత్వం ప్రధానమని పదేపదే చెప్పిన జాషువా కవిత్వం నేటి సమాజానికి మరింత అవసరమని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాహితీస్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ ఉపాధ్యకక్షులు, కవి గేరా మాట్లాడుతూ జాషువా శక్తివంతమైన కవిత్వాన్ని రాశారని అన్నారు. జాషువా కవిత్వాన్ని నేటి కవులు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అనంతరం సాహితీస్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ సభ్యులు వెంకటి ఆధ్వర్యంలో జనకవనం జరిగింది. పలువురు కవులు, కవయిత్రులు తమ కవితలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహిత్యవేత్త మోతుకూరి నరహరి, శాంతిశ్రీ, జి. నరేష్‌, నాగశిరీష, పొత్తూరి సుబ్బారావు, కేతవరపు రాజ్యశ్రీ, వి.యస్‌.వి. ప్రసాద్‌, కె.ఎక్స్‌. రాజు, పి.ఎన్‌. మూర్తి, జి. నరసింహమూర్తి, వొరప్రసాద్‌, సాహిత్యప్రకాశ్‌, కె.వి. శాస్త్రి, మౌనశ్రీ మల్లిక్‌, పెద్దూరి వెంకటదాసు, ఒబ్బిని సన్యాసిరావు, చిక్కా రామదాస్‌, ఎ. మోహనకృష్ణ, టి. సైదులు తదితరులు పాల్గొన్నారు. సాహితీస్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ కోశాధికారి వి.వి.ఆర్‌. శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం పలకగా నగర సంయుక్త కార్యదర్శి తంగిరాల చక్రవర్తి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.