కొత్తపల్లవి

కవి: 
చిన్ని నారాయణరావు
సెల్ : 
9440202942

       అవినీతి-
       చ్ఛత్ర చకచ్ఛకిత ఛాయల్లో బిక్కు బిక్కు మంటూ
       బక్కచిక్కి బ్రతుకు జీవుడా అంటూ
       కాలం వెళ్ళదీస్తున్నదీ లోకం
       ప్రతి ప్రక్రియకూ జరిమానాల నజరానాలు
       మామూలే(ళ్ళే) నంటూ నినదిస్తున్నదీ
అధికార అహంకారం
బ్యాంకులకేదో క్యాష్‌ తీసుకెళ్తుంన్నంత అలవోకగా
కరెన్సీ బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నంత అవలీలగా
ప్రతిపని ముంగిటా నిట్టనిలువునా
పైసలు తాకట్టు
ఇదే ఈ మాడ్రన్‌ మనిషి జన్యుకణంలోని గుట్టు
బ్రతుకు కడలి అంచుకు చేరుతున్నా
వ్యక్తి బాధల సుడిగుండాల వలయంలో
విలవిలమంటున్నా
అదిపింఛను కోసమైనా.. టంచనుగా
రూపాయి చెల్లించాల్సిందే
స్వాతంత్య్రం వెక్కి వెక్కి ఏడవాల్సిందే
అదో వ్యసనమై కాటేసిన కారుమేఘం
మనిషితనాన్ని కబళించిన విస్ఫోటనం
అయ్యగారిప్పుడు-
రూపాయినోటుపై ఆశీసునుడైన పదితలల
అక్రమార్కుడి ప్రతిరూపం-            
అదనపు సంపాదనే ఆరోప్రాణంగా
విస్తరించిన కేన్సర్‌ రోగంతో
ఆకాశమంతగా ఎదగాల్సిన మనిషి
బోన్సాయిగా కుచించుకుపోతున్నాడు
చీకటి ముసుగేసుకొని వెలుగు
కిరణాలకోసం పరితపిస్తున్నాడు
ఇప్పుడసలు ఆఫీసుల భాష
నోట్లకట్టల భాష
పైసల్తో పనికి త్రాసు లేసే
ఎమర్జెన్సీ ఘోష
అందుకోండి అయ్యలారా-
నాదో మనవీ సుప్రభాతం
మనిషికిప్పుడు బ్రతుకు పోరాటం
ఇకపై ఇదేదో పవిత్ర కార్యమని చాటి చెప్దాం
ఏ చట్టాలు చెప్పకున్నా మనమే చట్టబద్ధం చేద్దాం
నవీన సిటిజన్‌ చార్జీల సరికొత్త
నివేదికలను ప్రతిపాదిద్దాం
అయితే -
ఉద్యోగుల వేతనాలకు పుల్‌స్టాప్‌ పెడదాం
జీతాల్ని జామ్‌ చేశాద్దాం.. ఖజానాకు జమచేసేద్దాం
రండి... రండి ఇకపై సరికొత్త చట్టాల్ని రూపొందిద్దాం !