అలిఖత జ్ఞాపకం

కవి: 
ఆంగ్లమూలం : ElainaV.Emans అనువాదం : గోరుగంతుల రాజశేఖర్‌
సెల్ : 
9000461295

ప్రతీ ఒక్కరికీ వారి వారి
మధుర స్మృతుల చిట్టా వుండే వుంటుంది.
నా జ్ఞాపకం మీ దానితో కలవకపోవచ్చు
మీ జ్ఞాపకం నా దానితో కలవనూవచ్చు
లేలేత భానుని కిరణాలునది ఒంపుల్ని ముద్దాడడం
అనుభూతికి పరాకాషై ్ఠ
నా మనుసులో తిష్ఠవేసిన ఓ జ్ఞాపకం
మెరిసే పూలగుత్తులు
విరబూసిన అందాలను
తనివి తీరా ఆస్వాదించడం
బహుశా, మీ హృదయాంతరాళంలో
సేదతీరుతున్న చిన్ని జ్ఞాపకం కావచ్చును.
కమ్మని సంగీతంలా
నిత్యం ప్రవహించే నీహార కాంతి
నా జ్ఞాపకాల కిరీటంలో
పొదువుకున్న వజ్రమే !!
రత్నాల్లా వైభవంగా వెలుగులీనిన
అపురూప క్షణాలు
మీ అనుభవాల కాసారంలోను
విచ్చుకొనే వుంటాయి.
అరుదైన ప్రభాత సంధ్యలు, నిశీథి చంద్రికలు
నాకు సొంతమై నన్ను నడిపించాయి.
కనుకొలుకుల్లో స్వప్నాలై
తాండవ నృత్యం చేశాయి
మరపురాని దూరతీరాల్ని
మీరూ నిత్యం ప్రేమిస్తూనే వుంటారు
ప్రకృతి పుట్టిళ్ళైన అరణ్యాలు, పర్వతాలు
నా మదిలో పచ్చని జ్ఞాపకాలే !
నేను వాటిని ఆరాధించని రోజే లేదు.
మీ మదిలో చెరగని ముద్రవేసిన
ఎలకోయిల కూజితాలు, పిట్టల కువకువలు
నాకు తెలియకపోవచ్చు
అయినా ఆశ్చర్యంగా
మీ చిట్టా, నా చిట్టాలానే వుంది
ఆ అంతులేని అగాధంలోకి
నేను దూకుతున్నపుడల్లా
అమ్మ చేతి స్పర్శలా సాంత్వన ప్రసాదించి
హృదయ ప్రక్షాళన చేస్తూనే వుంది
అందుకే, ఈ కట్టుబడి జీవితాల్లో
ఆ అలిఖిత జ్ఞాపకాలను
మనఃఫలకంపై పునర్ముద్రించుకుంటే
రేపటి ఎదురీతకి కొండంత అండే మరి !