సహజనాయిక

కవి: 
వురిమళ్ల సునంద
సెల్ : 
9441815722

రెప్పల వాకిట్లో వాలిన నిద్రపిట్టను
చిటికెలతో అదిలించినా
చన్నీటితో విదిలించినా
కదలనని మొరాయిస్తుంటే...
అలసిన మనసు - పులిసిన మేను
సమ్మెకు మద్ధతు ప్రకటిస్తుంటే....అపరాహ్ణవేళ అరగంట
అవకాశ మిస్తానని వాగ్ధానంతో...
లోగిట్లోని నిద్రపిట్టను
రెప్పలెత్తి రెక్కపట్టి
బయటికి పంపుతున్నప్పుడు
కోడికూతను విసుక్కుంటూ
ఎజెండా ఏమిటో చెప్పమనే
అవయవాల అసహనానికి సమాధానంగా
వంటింట్లోకి...
సింక్‌లోని గెన్నెలు ఆరున్నొక్క రాగాలాపన
తలంటుపోసి తళ తళ లాడించమని
విడిచిన బట్టల వీరంగం
సంస్కారవంతమైన సబ్బుతో
సహజరూపు తెప్పించమని
కట్టుకున్న శ్రీవారి కదన కథాకళి
కాఫీ టిఫెన్లిచ్చి
కార్యాలయానికి పంపమని
అత్తగారి పూజకోసం
అరమోడ్పులతో
మందారాల పలకరింపు
వాకిట్లోకి దూసుకొచ్చిన
వార్తాపత్రిక హెచ్చరిక
వాలు కుర్చీలోని
మామగారికి వినయంగా
అందించమని
సరిహద్దు సైనికుల్లా పిల్లల సతాయింపు
తమ విషయం పట్టించుకోమని
దాగుడు మూతల కాలం ఆటలో
పిల్లికి దొరక్కుండా ఎలుక పరుగు
విరామ మెరుగని పరుగుల దేహం
ప్రమాద సూచికలు ఎగరేస్తున్నా
పట్టించకోని అమ్మతనం
పాత్రల్లో పోసిన జలంలా ఒదిగిపోతూ
కన్నీళ్ళను ఒలకనీయక
ప్రసార మాధ్యమాల ఆర్భాటం -
మహిళా దినోత్సవ కిరణాలు సోకి
అంతరంగంలోని ఆరు ప్రాణాల భావాలు
ఒక్కసారిగా అలజడికి లోనై
ఆకాశంలో సగం నీవంటూ
అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటే
ఏదో ఆశ మిణుకు మిణుకు మంటూ
అంతరం లేని సమాజం కోసం
ఆశగా ఎదురు చూస్తూ
అనామికను కాదు
సమాజంలో 'సహజ నాయిక' ను
నేనే అని గుర్తు చేస్తూ....