మల్లెమాల వేణుగోపాల రెడ్డి సాహిత్యం- విశ్లేషణ

      డా|| ఆర్‌. రాజేశ్వరమ్మ
         9347961489 
            ఆధునిక కాలంలో సాహిత్యంలో అనేక ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం ఆధునిక రచయితలకు పాఠకుడు సామాన్య మానవుడు కావడమే. పాఠకుడు మారేకొద్ది ప్రక్రియలు
 రూపుదిద్దుకొంటూ వచ్చాయి. అలా రూపుదిద్దుకున్న ప్రక్రియలలో కథానిక, నవల, కవిత్వం, నాటకం, వ్యాసం మొదలైనవి ఉన్నాయి. కల్పనా సాహిత్యంలోని కథలు, నవలలు, కవిత్వం, నాటికలు మరికొన్ని విమర్శనా వ్యాసాలు తనదైన శైలిలో వెలువరించిన వారిలో మల్లెమాల కూడా ఒకరు.
ప్రాచీనకాలంలో సాహిత్యమంతా ఒకే ప్రక్రియలో సాగింది. కానీ ఆధునిక కాలంలో సాహిత్యంలో అనేక ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం ఆధునిక రచయితలకు పాఠకుడు సామాన్య మానవుడు కావడమే. పాఠకుడు మారేకొద్ది ప్రక్రియలు రూపుదిద్దుకొంటూ వచ్చాయి. అలా రూపుదిద్దుకున్న ప్రక్రియలలో కథానిక, నవల, కవిత్వం, నాటకం, వ్యాసం మొదలైనవి ఉన్నాయి. కల్పనా సాహిత్యంలోని కథలు, నవలలు, కవిత్వం, నాటికలు మరికొన్ని విమర్శనా వ్యాసాలు తనదైన శైలిలో వెలువరించిన వారిలో మల్లెమాల కూడా ఒకరు.
మల్లెమాల జన్మస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకా అలిమిలి గ్రామం. 1937 ఆగస్టు 4న రంగమ్మ రామస్వామిరెడ్డి దంపతులకు జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. అలిమిలి, గూడూరులలో ప్రాథమిక, కళాశాల విద్య కొనసాగింది. గుంటూరు, విశాఖలలో వైద్య విద్యను పూర్తిచేశారు. ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా కడపలో స్థిరపడ్డారు. ఒకవైపు వైద్యవృత్తిని కొనసాగిస్తూనే ప్రవృత్తిరీత్యా తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, మనందరికీ సుపరిచుతులైన మల్లెమాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవల్సిన అవసరం లేదు. 
మల్లెమాల ఇప్పటివరకు ఉ(దా)త్త పురుషుడు, స్ఫూర్తి, విరిసిన మల్లెలు, అనురాగ స్పర్శ ఎక్స్‌ప్లాయిటేషన్‌) వంటి ఐదు కథా సంపుటాలను 'ఆవలిగట్టు' నవలను, వేణుగానం కవితా సంపుటిని, చింతన అనే వ్యాసావళిని వెలువరించారు. వీటిలో ప్రధానంగా కల్పనా సాహిత్యానికి సంబంధించిన మొదటి ప్రక్రియ కథానిక. ఈయన వందకు పైగా కథలను రాశారు. ఈ కథల్లోని ఇతివృత్త వైవిధ్యాన్ని బట్టి ఈ కథలను ప్రధానంగా ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు అవి...
1.వైద్యవృత్తికి సంబంధించినవి. 2. వృత్తులకు సంబంధించినవి. 3. గ్లోబలైజేషన్‌ ప్రభావం వల్ల మానవ సంబంధాలలో ప్రతిఫలించిన మార్పులను సూచించేవి. 4. సమాజంలో వ్యక్తుల మధ్యగల లౌకిక సంబంధాలను తెలిపేవి. 5. సమకాలీన సమాజంలో నిత్యం జరుగుతున్న, చూస్తున్న సమస్యలకు స్పందించినవి. 
మొదటి రకానికి సంబంధించిన వాటిలో కారుణ్య మరణం, గ్రహణం వీడింది, నియోగ వినియోగం, మరణమృదంగం, ఆశని, డాక్టరు రచయిత అయితే, మొదలైన వాటిని పేర్కొనవచ్చు.
క్యాన్సర్‌ బారిన పడిన షర్మిలకు చివరి ట్రీట్‌మెంట్‌ పనిచేయక పోవడంతో ఆమె విజ్ఞప్తి మేరకు ఎలా కారుణ్య మరణాన్ని (Mercy killng) ఇచ్చారో వివరించే కథ కారుణ్య మరణం. నిజానికి ఈ పద్ధతి మనదేశంలో అమలులో లేదు. విదేశాలలో దీన్ని అమలు జరుపుతున్నారు. దీన్ని అమలు జరపడంలోనూ ఉన్న సాధక బాధలు ఏమిటి? ఏ స్థితిలో ఈ కారుణ్య మరణాలను ఇవ్వాల్సి ఉంటుందనేది చక్కగా వివరించాడు. 'గ్రహణం వీడింది' కథలో కాలుజారిన ఆడపిల్ల ధనలక్ష్మికి, ఇద్దరు ఆడపిల్లల తల్లి సుజాతకు అబార్షన్‌ చేయడానికి నిరాకరించిన డా|| వసుంధర తన కూతురికే అబార్షన్‌ చేయాల్సి రావడంతో జీవహింస చట్ట విరుద్ధతలను పక్కన బెట్టి మనసు మార్చుకొని అబార్షన్‌ చేయడానికి పూనుకోవడాన్ని చిత్రించారు. కనీసం డాక్టరు డిగ్రీలేని సంజన్న డాక్టరుగా చెలామణి అయిన తీరును వివరించే కథ 'నియోగ వినియోగం'. ఒక సాధారణ డాక్టరు స్థితి నుండి ఎదిగి, సూపర్‌ స్పెషాలిటీ హిస్పిటల్‌ అధికారిగా, ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యకక్షుడుగా అనేక పదవులను పొంది తనపై వచ్చిన కేసులను ఎలా తుంగలో తొక్కిపెట్టి గొప్ప డాక్టరుగా ఎలా పేరు ప్రసిద్ధులను పొందాడో వివరించే కథ. ఈ ఆధునికోత్తర కాలంలో డాక్టర్లమని చెప్పుకుంటూ ప్రజలను పీడించి, మోసం చేసే డాక్టర్లను ఈ కథలో చూడవచ్చు. 'ఆశని'లో వైద్య విద్యార్థులలో గల పోటీ తత్త్వాన్ని, సంకుచితత్వాన్ని వివరిస్తుంది.
'మరణ మృదంగం' మల్లెమాల కథలన్నింటిలోనూ ప్రత్యేకంగా నిలిచే కథ. ఇందులో మూడు వైవిధ్యమైన సమస్యలను, విభిన్నమైన పాత్రలను ఒకచోటకు చేర్చి పరిష్కారాన్ని చూపించాడు.
ఇతర వృత్తులకు సంబంధించిన కథల్లో మగ్గం మంటలు, జలపుష్పాలు, (వ్యా)కులవృత్తి మొదలైనవి చప్పుకోదగిన కథలు. 'మగ్గం మంటలు' లో చేనేత వృత్తులవారి సాధక బాధకాలు, నేతబట్టలకు గిట్టుబాటులేని పరిస్థితులు, ఇండ్లలోని ఆర్థిక గతుల్ని కళ్ళకు కట్టించడం జరిగింది. చీరల మూటలను వ్యాపారానికి బెంగుళూరుకు తరలించే పనిలో రైలులో అగ్నిప్రమాదం జరిగి, ఆ చీరల మూటలు, ఇంటి యజమాని కాలి బూడిదైపోతాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన తొమ్మిది లక్షల ఎక్స్‌గ్రేషియా కారణంగా కుటుంబం కష్టాల నుండి గట్టెక్కుతుంది. కానీ భార్య యల్లమ్మకు దుర్ఘటనా స్థలంలో గుండె బరువెక్కిన స్మృతులు భర్త ప్రతి కదలిక, కాలం వెక్కిరిస్తున్న భ్రమలో బ్రతుకును వెళ్ళదీస్తున్నా ఆమె ద్వారా మనిషిలోటును డబ్బు తీర్చలేదని, గుండెలో మంటలు మండుతూనే ఉంటాయని, మనిషితో గల అనుబంధాన్ని, మనిషి ప్రాముఖ్యాన్ని వివరించే కథ మగ్గం మంటలు.
అలాగే 'జల పుష్పాలు'లో చేపల పొలుసులు తీయగా వచ్చిన ఆదాయంతో బతుకు బండిని నడుపుతూ కూతుర్ని చదివిస్తున్న, బెస్తకులానికి చెందిన ఒక స్త్రీ స్థితిని గురించి తెలపడం జరిగింది. (వ్యా)కులవృత్తిలో మంగలి పని చెయ్యడాన్ని అవమానంగా భావించి ఆ వృత్తిని నిరాకరించిన యువకుడు తండ్రి మరణానంతరం తాను బి.ఏ.చదివినప్పటికీ బతుకు తెరువు లేక పెద్ద సెలూన్‌ను పెట్టి తిరిగి తన కులవృత్తినే జీవనాధారంగా ఎన్నుకోవడం జరుగుతుంది ఇతివృత్తం.
మూడవ వర్గానికి చెందిన కథల్లో గ్లోబలైజేషన్‌ ప్రభావం వల్ల మానవ సంబంధాలలోను, సమాజంలోను వస్తున్న మార్పులను సూచించడం జరిగింది. ఉదాహరణకు ఔట్‌ సోర్సింగ్‌, పతీపత్నీ పరస్పరం, క్విక్‌ మ్యారేజెస్‌, ఆశల ఆకాశం, కౌన్సిలింగ్‌, కాల ప్రవాహం, డాలరులోకం, ప్రజా హరితం, మొదలైనవి ఈ కోవకు చెందిన కథలు.
ఔట్‌సోర్సింగ్‌లో 'సర్రోగేట్‌ మదర్స్‌' గురించి చిత్రించడం జరిగింది. సర్రోగేట్‌ అనగా ''ఇతరుల కోసం బిడ్డల్ని కనిపెట్టే వనితల్ని, సర్రోగేట్స్‌'' అంటారు. ఇందులో డిగ్రీ వరకు చదివిన సుధీర సర్రోగేట్‌ మదర్‌గా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏవి? వివాహానంతరం కొద్దికాలానికే భర్త విడాకులు తీసుకోవడంతో బిడ్డను సాకడం కోసం ఈ విధానానికి ఒప్పుకున్న తీరును, అక్కడి నియమ నిబంధనలు, వాతావరణాన్ని ప్రతిభావంతంగా చిత్రించడం జరిగింది. 
విధి వంచితులైన అబలలు, భర్తల  పురుషాహంకారానికి బలై తృణీకరింపబడిన వనితలు, పేదరికంలో మగ్గుతూ కుటుంబ పోషణకోసం తప్పనిసరి పరిస్థితులలో అమ్మ కడుపు అమ్మకానికి ఇచ్చే నిర్భాగ్యులందరూ సర్రోగేట్‌ మదర్స్‌గా నమోదవుతున్నారని ఈ కథ ద్వారా మనకు తెలిసే నిజం. 
'పతీపత్ని పరస్పరం'లో గ్లోబలైజేషన్‌ ప్రభావం వల్ల కుటుంబసభ్యుల మధ్య ఉన్న ప్రేమానురాగాలు, ఆప్యాయతానురాగాలు ఎలా వ్యాపారమైపోతున్నాయో, వాటి స్థానంలో స్వార్థం ఎలా చోటు చేసుకుంటూందో, ప్రతిభావంతంగా చెప్పబడింది.
ఈ కథలో హేమాద్రిరావుకు ఆరోగ్యం చెడి కిడ్నీలు పాడవుతాయి. డాక్టరై అమెరికాలో ఉన్న పెద్ద కొడుకుగాని, ఉద్యోగరీత్యా బాగా సంపాదించి బొంబొయిలో స్థిరపడిన ఉన్న చిన్న కొడుకు ఆర్థికంగా గానీ, మాటసాయంగా గానీ సహాయపడక నిర్లిప్తంగా ఉంటారు. దాంతో హేమాద్రి భార్య శారదమ్మ తన బంగారు గాజులమ్మి తన కిడ్నీనే భర్తకు ఇచ్చి,  హైదరాబాదులో ఆపరేషన్‌ చేయించి బతికించుకుంటుంది.  కొడుకులిద్దరూ మంచి హోదా/ స్థితిలో ఉన్నా ఎటువంటి సాయం అందించలేకపోవడానికి కొంత స్వార్థం, మరికొంత ప్రపంచీకరణ ప్రభావమని నిక్కచ్చిగా అర్థం చేసుకోవచ్చు. కొడుకులకు పెళ్ళైన తర్వాత వారి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఒక రకంగా తగ్గుతాయి. తన జీవితంలో సగం జీవితాన్ని భార్య ఆక్రమిస్తుంది. ఏ పనిచేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా  భార్య యోగక్షేమాలు, నష్టాలు పరిగణించి, పనికి పూనుకోవాలి. ఆ పనికి భార్య తన సమ్మతిని ఇవ్వకపోవచ్చు. తన త్యాగం వల్ల రేపు తన జీవితానికి సమస్య లెదురైతే అనుభవించడానికి సిద్ధమై ఉండాలి. కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తాను సాయం చేయడానికి ఆదుకోవడానికి తన భార్య, బిడ్డలు, వయస్సు, జీవితం, ఉద్యోగం విధి నిర్వహణ ఒత్తిడుల కారణంగానే ఇలా ప్రవర్తిస్తున్నారని, దీనికి అనేక కారణాలని చెప్పుకోవచ్చు. అలా 'ఆశల ఆకాశం'లో మనుషుల కంటే హోదా, డబ్బులు ఎంతటి ప్రాముఖ్యాన్ని, సంతరించుకున్నాయో వివరించే కథ.
నాల్గో రకమైన లౌకిక పరమైన సంబంధాలను ప్రతిబింబించే కథలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు వంటి వివిధ ఇతర మతస్తులు ఎంత సఖ్యంగా కలిసి జీవిస్తున్నారో వివరించడం జరిగింది.
'ప్రవృత్తి-మైత్రి'లో దాదాసలీం, మతాతీతంలో రోశిరెడ్డి, అప్రమేయుడులో మగ్దుమ్‌, జీవన దుందుఖిలో (DRUMS) దయాసాగర్‌, రెహ్మన్‌, ఉపేంద్ర, మోహన్‌రెడ్డి శామ్యూల్‌బాబు, అమృత హస్తాలులో మిసెస్‌ పాల్‌, పాపం ఫాతిమాలో ఫాతిమా మొదలగు పాత్రలన్నీ కుల, మత, ప్రాంత వర్గ బేధాల్లేకుండా పరస్పరం ప్రేమలు, అనురాగాలు, ఆత్మీయతలను పంచుకునే వారికి ప్రతీకలుగా చిత్రించబడినవే.
సమకాలీన సమాజంలో మనం నిత్యం చూస్తున్న, వింటున్న, సంఘటనలను ప్రతిబింబించేవి ఐదో విభాగానికి చెందినవి. ఈ కోవలో కాంపేన్సేషన్‌, ఎక్స్‌ఫ్లాయిటేషన్‌, అయిననూ పోయి రావలయును. స్ఫూర్తి, కూలిన గోడలు, సెల్‌హల్‌చల్‌, స్కోరెంత, అర్జంట్‌, గర్భశోకం, మొదలైన కథలు చెప్పుకోదగినవి. ఈ కథల్లో ప్రెసిడెంటు దళితుల చేత కేసును ఎలా విత్‌డ్రా చేయించాడో, ఐఏఎస్‌ అధికారులు వివిధ కేసుల్లో ఇరుక్కుని ఎలా జైలు పాలయ్యారో దొంగ రోగాల నాటకాలను ఆడారో వివరిస్తాయి. కాలక్రమంలో అర్జంటు అనే పదం ఎలా విపరీతపోకడలను పొందిందో, సెల్‌ల వాడకంలో ప్రయోజన నిష్ప్రయోజనాలు ఎలాంటివో, వాస్తు మూఢ నమ్మకాలు సంపాదించిన ప్రాముఖ్యం ఎలాంటివో వంటి ఆధునిక కాలంలో జరిగే మోసాలకు దర్పణం పట్టబడినవి.
కథా నిర్మాణ విశిష్టత : 
ఇతివృత్తపరంగా చూసినపుడు మల్లెమాల కథల్లో వైద్యపరమైన సమస్యలకు, శస్త్రచికిత్సలకు సంబంధించిన కథలున్నాయి. దీంతోపాటు కులవృత్తుల స్థితిగతులను వివరించే కథలు ఉన్నాయి. తన అనుభవంలో ఇతర మతస్థులతో గల అనుబంధాన్ని వివరించే ఇతివృత్తాలు కొన్నైతే ప్రపంచీకరణ ప్రభావాన్ని ప్రతిఫలింపజేసే కథానికలు కొన్ని. సమాజంలో జరుగుతున్న మోసాలను, లంచగొండితనాన్ని తెలిపే అనేక అంశాలను కూడా కథావస్తువులుగా తీసుకోవడం జరిగింది. అంతేగాక రోజురోజుకు క్లిష్టంగా జటిలంగా అయోమయంగా మారిపోతున్న సామాజిక జీవితాన్ని తన కథల్లో వివరించారు.
దృష్టికోణం విషయానికొస్తే రచయిత దృష్టి కోణం మీదనే కథావస్తువు ఆధారపడి ఉంటుంది. ఆ వస్తువు పట్ల రచయిత జవాబుదారితనంతో బాటు అతని భాగస్వామ్యం (involment) కూడా ఉంటుంది. 
''ప్రవృత్తి మైత్రి'లో ఉత్తమ పురుషలో కథ చెప్పబడింది. ఇందులో (నేను) రచయితే న్యాయవాది. మరొకరు దాదా సలీం చికెన్‌ సెంటర్‌ యజమాని. ఇందులో దాదా సలీం పాత్ర ద్వారా మానవత్వాన్ని గురించి, జీవిత పరమార్థాన్ని గురించి, స్థిత ప్రజ్ఞతను గురించి చెప్పించిన మాటలన్నీ రచయిత పలికించినవే. వాక్యాలు రచయిత అంతరంగిక హృదయాన్ని పట్టించేవే. అంతేగాక 'స్పందన, డాక్టరు రచయిత అయితే, విముక్తం, అమృతహస్తాలు, చేయూత, ఋతుక్రమం, మరోప్రేమ కథ, మానవతా కోణం మొదలైన కథలన్నీ ఉత్తమ పురుషలో రాసినవే. ఈ కథలన్నీ వాస్తవికంగా ఉండటమే గాక, రచయిత అనుభవాలై ఉంటాయన్నది స్పష్టం. ఎందుకంటే కథలో జరిగే ప్రతి  సంఘటనకు, రచయితకు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది.
ఇవే గాక మరణమృదంగం, (వ్యా) కులవృత్తి, మతాతీతం, పతీపత్ని పరస్పరం, సగం సచ్చినోడు, కాంపెన్సేషన్‌, ఎక్స్‌ప్లాయిటేషన్‌, స్కోరెంత, అప్రమేయుడు, మొదలగునవి ప్రథమ పురుషలో సాగించిన కథలు, ఇతరుల అనుభవాలను, సంఘటనలను తాను వివరించడం కోసం ప్రథమ పురుషను ఎన్నుకున్నాడు. తాను చెప్పదలచుకున్న సామాజిక అంశాలను కొన్నింటిని ధ్వని గర్భితంగా కూడా చెప్తాడు. ఉదాహరణకు 'అప్రమేయుడు'లో వినాయక చవితిపండుగ గణపతి నిమజ్జన సందర్భంలో జరిగే ఊరేగింపులో చోటుచేసుకున్న విపరీతమైన తాగుడు, అసభ్య శృంగార ప్రదర్శనలు, మొత్తంగా అక్కడి వాతావరణాన్ని స్పష్టం చేస్తాడు. 'మరణమృదంగం'లో మెట్టపొలం రైతు పెంచలయ్య మాటల్లో ''తన కొడుకు ఊర్లో ఉండే  బడికి వెళ్తున్నప్పటికీ ఊరిబడికి టీచర్లు సరిగా రారు. పాఠాలు చెప్పకుండానే జీతాలు తీసుకుంటారు. ఈసారి ఎలక్షన్లలో వారిదే హవా... అరకొర చదువులతో ఎందుకూ కొరగాకుండా పొతుంటే కొడుకును పనికి ఆహారపథకానికి రోజువారి కూలికి పంపుతున్నాను'' అంటూ పల్లెటూర్లలోని బడుల తీరును, అయ్యవార్ల వ్యవహారాల్ని, ఎల్లక్షన్లలో వారి ప్రాముఖ్యాన్ని పల్లెటూరి బడుల్లో చెప్పే చదువు పిల్లలకు ఉపయోగకరంగా లేదనే వాస్తవాన్ని వ్యక్తం చేస్తాడు రచయిత. అలాగే 'క్రాస్‌ రోడ్స్‌'లోను ఎన్నికల ముందురోజు జరిగే మందు, మనీ, మాంసం ఎలా పంచబడతాయో ప్రజలు వేటికి దాసోహమై ఓటేస్తారో ఓటింగ్‌ రోజున పోలింగ్‌ బూత్‌ దగ్గరి వాతావరణాన్ని స్పష్టంగా వివరించడం జరిగింది. ఇవన్నీ రచయిత పరిశీలనలోని సామాజిక అంశాలు, ఇలా సామాజిక అంశాలను ధ్వని గర్భితంగా పాత్రల చేత చెప్పించడం ఎన్నుకున్న వస్తువుకు బలమైన భూమిక అవుతుంది.
పాత్రచిత్రణ విషయానికొస్తే పాత్రలను చాలా సహజంగా ఔచితీవంతంగానే చిత్రించాడని ఈ కథానికల ద్వారా తెలుస్తుంది. 'మరణమృదంగం'లో పెంచలయ్య సులభమరణాన్ని ఎన్నుకొని రాగా డైరెక్టరు ''అసలు నువ్వెందుకు చావాలనుకుంటున్నావు'' అంటాడు. ''బతకలేక... చావాలనుకుంటున్నాను'' అని జవాబిస్తాడు. బ్రతకలేని వారికి చావు పరిష్కారమా? బతికి ఉంటేనే ఏదైనా సాధించగలగుతారు. ప్రభుత్వంవారు మీకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించారు గదా! వాటిని ఆశ్రయించవచ్చు కదా'' అంటాడు ధర్మారావు.
పదిరోజుల తర్వాత పెంచలయ్య కరెంటుషాక్‌తో చనిపోయినట్లు 'వార్త'లో వార్త. ఆత్మహత్యా? ప్రమాదమా? తేల్చవలసిన పని అధికారుల పరమైంది అని తెలిపారు. 
ఇక ఎత్తుగడ విషయానికొస్తే మల్లెమాల మరణమృదంగంలో విభిన్న పార్శ్వాలను ఒకచోట చేర్చి సరిపోల్చి హెచ్చుతగ్గులను చెప్పడం జరిగింది. ఆత్మహత్యలకోసం వచ్చిన ముగ్గురిలో ఒకరు రైతు పెంచలయ్య డా|| ధర్మారావుగారు ఎన్ని సూచనలు సలహాలిచ్చి అతని ఆ కోరికను మార్చడానికి ప్రయత్నించినా, తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజానికి అది పెంచలయ్య వ్యక్తిగతంగా చేసుకున్న ఆత్మహత్య కాదు. ప్రభుత్వం, బ్యాంకులు, వ్యవస్థలు చేసిన హత్యలుగా చెప్పవచ్చు. నిర్ణయం మార్చుకోకపోవడానికి రైతు సమస్య తీవ్రంగా అంత జటిలంగా ఉందని అర్థం చేసుకోవచ్చు.
ఇదే కథలో రెండోవ్యక్తి డి.టి.సి పూర్తి చేసుకున్న నిరుద్యోగిని ఆశావాదిగా నిలబెట్టడం రచయిత చేసిన మంచిపని. మూడోవ్యక్తి బీజాన్‌ బి.ఎయిడ్స్‌ బాధితురాలు. జబ్బు ముదిరి చేయిదాటిపోయి చనిపోయిన వ్యక్తి. ఈ మూడు రకాల సమస్యలను పరిగణనలోకి తీసుకొంటే పైకి చూడ్డానికి కొంత ఫాంటసీ'గా ఉన్నా ఒక వాస్తవికతకు నిదర్శనం ఈ మూడు కథల సమ్మేళనం. ఒక ముస్లిం స్త్రీని ఎంపిక చేసుకోవడం ఒక సామాజిక వాస్తవికతకు నిదర్శనం. అయితే ఈ మూడు ఆత్మహత్యల్ని మూడు కథలుగా కూడా రాసి ఉండవచ్చు.
'కాంపన్సేషన్‌' కథలో ప్రెసిడెంట్‌గారి లారీ బాలమ్మను యాక్సిడెంట్‌ చేయగా తండ్రి తిరిపాలు నెత్తినోరు కొట్టుకొని ''బాలమ్మకు కాలు తీసేస్తే రేపు దాని పరిస్థితి ఏమిటి?.... పెళ్లి కావాల్సిన పిల్ల రబ్బరు కాలు దేనికి పనికి వస్తుంది... ఏలు ఎకరాలు ఏం జేస్తారయ్యా? నా బిడ్డకు కాలు తీసెయ్యకుండా సూడండి బాబు'' అని డాక్టరును బ్రతిమాలినవాడు చివరకు కాలు తీసెయ్యమని వేడుకోవడం అనుచితంగా ఉంది. దీనికంటే ముందు రచయిత ప్రవేశించి సెంటిమెంట్స్‌ను పట్టుకొని వ్రేలాడి బ్రతుకుబాటను దుర్గమం చేసుకోవడం అవివేకం అని చెప్పడం కథ యొక్క అస్తిత్వాన్ని దెబ్బ తీసిందని కచ్చితంగా చెప్పవచ్చు.
శిల్పానికి వర్ణనలు ఎప్పుడు వాడాలన్న విషయానికొస్తే ఉ(దా)త్త పురుషుడులో సుచరిత తీయించుకున్న ఫోటోను వర్ణిస్తూ సుచరిత ''ముగ్ధమోహన స్వరూపం ముందు మేమంతా ఆ ఫోటోలో దిష్టిబొమ్మలం'' అన్నాడు. చక్కని నుదురు, తీర్చిదిద్దిన కనుబొమ్మలు, తేజస్సయిన కండ్లు, మందహాసాన్ని వెదజల్లే పెదవులు, నొక్కుల బుగ్గలూ, సజీవ శిల్ప సౌందర్యాన్ని పుణికిపుచ్చుకున్న మూర్తి సుచరిత అని మరల వర్ణించాల్సిన పనిలేదు. నొక్కుల బుగ్గలను, పెదవులను వర్ణించడం ద్వారా విపరీతార్థానికి దారితీసే అవకాశం కల్పించినట్లయ్యింది. 
ఈ కథల్లో రచయిత విమర్శకుడిగా మారడం అనేది శిల్పంలో మరొక లక్షణం. తెలుగు సాహిత్యంలో కొడవటిగంటి కుటుంబరావు రచయితగా ఉంటూనే తాను ఎన్నుకున్న మధ్య తరగతి కుటుంబాలలోని స్థితిగతుల్ని, పద్ధతులను ఎత్తిచూపుతూ విమర్శించే లక్షణం ఈ కథల్లో చొప్పిస్తాడు. మల్లెమాల కూడా 'అవిముక్తం' కథలో విమర్శకుడిగా కూడా దర్శనమిస్తాడు. కథల పోటీకోసం 'విముక్తం' అనే కథను రాసి, అందులో సునేత్ర చనిపోయినట్లు చిత్రిస్తాడు. దీన్ని ఒక చిన్న కథలపోటీకి పంపించగా దానికి కన్సోలేషన్‌ బహుమతి వస్తుంది. ఆ కథను చదివిన పాఠకురాలు సునేత్ర డైరక్టుగా రచయితను కలిసి కథను రాసేటప్పుడు కథలో వాస్తవికత, సామాజిక స్పృహ, శిల్పం, ఎత్తుగడ, కథకథనం, ముగింపు ఇలా ఎన్నో అంశాలను పరిశీలించి బహుమతి నిర్ణయిస్తారంటారు. మరి మీ కథలో ఏ అంశం బహుమతి అర్హమైనదిగా నిర్ణయింపబడి యుండునని మీరనుకుంటున్నారని నిలదీస్తుంది.
రోజూ నేను చూసే సంఘటనలకు వాస్తవిక రూపకల్పనలే నా కథలు. సూటిగా కథ చెప్పుకపోవడమే నా శిల్పం అన్నాడు. ''నిజానికి మీ కథ న్యూస్‌ రిపోర్టులా ఉంది. అందులో విషయమైన విస్తృత చర్చగాని, సమస్యపట్ల సమగ్రమైన అవగాహనగాని అందులో లేదు. చక్కని ముగింపు కథకు ఇవ్వలేదు. సమస్య సరియైన పరిష్కారం చూపలేదు. నడుస్తున్న చరిత్రపుటలకు ఇంకో అబల పేరును నమోదుచేసి వదిలేశారని'' పలికింది. అది చిన్న కథల పోటీకి వ్రాశాను. నియమ నిబంధనల మేరకు దాన్ని కుదించాల్సి వచ్చింది. అంతకంటే ఎక్కువ చెప్పగలిగే అవకాశం లేదన్నాడు.
దానికి ఆమె ''మీ కథ చిన్నది కావచ్చు. కానీ సమస్య చిన్నది కాదు. అంత పెద్ద తీవ్రమైన సమస్యను మీరు పేజీలకు పరిమితం చెయ్యడం కోసం సమస్యకు, దాని పరిష్కారానికి సమగ్రతనూ, న్యాయాన్ని, చేకూర్చలేకపోయారు. చిన్నకథకు బదులు పెద్దకథే రాసి ఉండవలసింది. కథను పోటీకి పంపడానికి సాంకేతికపరమైన ఇబ్బందులుంటే మామూలు ప్రచురణకే పంపి ఉండవచ్చు. లేదా మీ కథా సంపుటాల్లో మీరే ప్రచురించి ఉండవచ్చు. అంతేగాని కథను కుదించడం కోసం ఆ అమ్మాయికి నిద్రమాత్రలు ఇచ్చి ఆమెను చంపి ముక్తాయింపుగా ఆమెను అబలల లిస్టులో కెక్కించి ఆ జాడ్యానికి సమూల చికిత్సను సమాజానికి వదిలేస్తే మీ సమస్య తీరిపోదు. బాధ్యతగల రచయితగా మీరింకెన్నో సమస్యలను చేపట్టి పరిష్కారం చూపిస్తూ కథలు రాయాలని నా ఆశయం అంది సవినయంగా, సునేత్ర మాటలో రచయిత ఎలా కథను నడపాలో, మల్లెమాల కథల్లో ఏఏ శిల్పపరమైన అంశాలు లోపించాయో కథను ఎలా నడపాలో, ఎలా ముగించాలో ఎట్లాంటి కథలు రాయాలో పరిష్కారమెలా ఉండాలో వివరిస్తుంది. అందువల్ల కొత్తగా కలంపట్టిన రచయితలకు ఈ కథ ఒక పాఠ్యాంశంగా  ఉపయోగపడుతుంది. ఇందులో కథా నిర్మాణంపైన సాగిన చర్చ రచయితను ఒక విమర్శకుడిగా నిలబెడుతుంది.
కథానికలకు వస్తువును ఎన్నుకోవడం ఒక ఎత్తయితే ఎన్నుకున్న దానిని కథగా మలచడం మరోఎత్తు. కథ పరమార్థం మొత్తంగా ప్రతిబింబించేటట్లుగా కథకు పేరు పెట్టడం కథా లక్షణాలలో మరో లక్షణం. 
మల్లెమాలగారు క్రాస్‌రోడ్స్‌, స్కోరెంత, అప్రమేయుడు, కారుణ్యమరణం, అర్జంట్‌, సెల్‌హల్‌చల్‌, మొదలైన పేర్లలోనే కథా సారాంశం అర్ధమైపోతుంది. 'క్రాస్‌రోడ్స్‌'లో సమాజంలోని రాజకీయం గురించి, ఎన్నికలముందు రోజు జరిగే తంతును, వాతావరణాన్ని వివరించి, సరైన నాయకులను ఎన్నుకోవడం మనవిధి అని మనిషిని సమస్యల మధ్య నిలబెట్టాడు. ఏ సమస్యకు ఏ మార్గాన్ని ఎన్నుకోవాలో ప్రజల మీదనే ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. 
'స్కోరెంత' నేటి సమాజంలోను, వైయక్తిక జీవితంలోను క్రికెట్‌కు ఉన్న ప్రాముఖ్యాన్ని వివరిస్తుంది. ఆటగాళ్ళ ప్రతిభతో సంబంధం లేకుండా వ్యాపార వస్తువుగా మారిపోవడాన్ని గురించి, ఇది మానవ జీవితంలోకి వచ్చి మనిషిని వ్యవస్థను ఎలా ఆడిస్తుందో తెలియజేస్తుంది. 'అర్జంట్‌'లో అర్జంట్‌ అనే పదానికి గల అర్ధాన్ని  విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రచయిత మనకందరికీ ఒక చురకను అంటించాడు. 
మల్లెమాలగారి కథల ప్రయోజనాన్ని పరికించినట్లయితే సమాజంలోని సమస్యలను విశ్లేషించి, తన సానుభూతిని, స్పందనను ప్రకటించడం, పాఠకుల ఎదుట సమస్యను చిత్రించాడు. ఆ సమస్యకు స్పందించే తీరు, పరిష్కరించుకునే చైతన్యం పాఠకుడే కల్పించుకోవాలి. కొన్ని కథలు పాఠకునికి ఆనందంతో పాటు హృదయ సంస్కారాన్ని కల్గిస్తాయి. 
ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రారంభమైన 'ఆవలిగట్టు' నవలలో ఒక ఉదాత్తజంట పెళ్ళైన మూడు నెలలకే భర్త గురించి వచ్చిన ఆకాశరామన్న ఉత్తరం వల్ల భార్య అనుమానించి, అపార్థం చేసుకొని అతనికి దూరదూరంగా ఉంటుంది. స్వయంకృషితో తనకు తానుగా పైకి రావాలని  కోరుకొని ముంబాయిలో మోడలింగ్‌ రంగాన్ని ఎంచుకుంటుంది. భర్తతో విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. పెళ్ళైన మూడో సంవత్సరంలో బజారులో తన స్నేహితురాలు చెప్పిన జవాబుతో తన అనుమానం భ్రమేనని తేల్చుకుని విడాకులను తీసుకోవడంలో తన నిర్ణయాన్ని పక్కనబెట్టి భర్తను కలుసుకుని సుఖంగా జీవితం సాగించాలనుకోవడమే ఈ నవల సారాంశం. 
ఇందులో మాధురి పి.జి. చదివిన విద్యార్ధి, స్వేచ్ఛగా జీవించాలని కోరుకోవడంతో పాటు తాను కష్టపడి సంపాదించి, తన కాళ్ళమీద తాను బతకాలని కోరుకుంది. ఆవేశానికి తొందరగా లోనయ్యేది. ధైర్యంతోపాటు అమాయక తనం, నిజాయితీగల సున్నిత మనస్కురాలు. ఇందులో మాధురి భర్త(కిశోర్‌)తో దూరమవడానికి, విడిపోవాలని నిర్ణయించు కోవడానికి కారణం ఆకాశరామన్న ఉత్తరం.
మాధురి తనను తాను నిరూపించుకోవడానికి హైదరాబాద్‌ను వదలి బొంబాయికి వెళ్లడం మొదటి తప్పు. బొంబాయిలో మోడలింగ్‌ రంగాన్ని ఎన్నుకోవడం తనకు తాను సమస్యను వెతుక్కు న్నట్లయింది. 
ఈ నవలలో భర్తనుండి తెగతెంపులు చేసుకోవాలను కున్న మాధురి కోరికకు సమస్యకు భర్తతో కలిసుండాలనే నిర్ణయానికి మధ్య మూడు సంఘటనలు నవల ముగింపును వేగవంతం చేశాయని చెప్పవచ్చు. అవి మొదటిది
బొంబాయిలో అసిస్టెంటు గా ఉన్న ప్రదీప్‌ ఈమెను వెంటబడి విసిగించడం, ఈమె అనుమతి లేకుండానే తనే నిర్ణయాలు తీసుకునే స్థాయికి రావడం, ఆమెను ఇష్టపడుతున్నానని, కలిసి జీవిద్దామని, పెళ్ళి చేసుకుంటానని వేధించడం. 
రెండోది బజారులో కన్పించిన తన మిత్రురాలు మాటల్లో ''అది సునంద పేరుతో వచ్చిన లెటరు కాదు కదా! అది పని గట్టుకొని కుటుంబాలను విడదీసే కుంచిత  మనస్తత్వంగల సునంద పని అని, మునుపు రెండు కుటుంబాలను విడదీసిందని తెలుపుతుంది.
మూడోది కిశోర్‌ ఫామ్‌హౌస్‌లో పనిమనిషి లక్ష్మి జీవితానుభవాలు, భర్తపీడన, తాగుబోతు, తిరుగుబోతు, ధనదాహం అన్నింటినీ ఎలా భరిస్తూ వచ్చిందో, మరల పశ్చాత్తాపం మొదలైనవి వివరించమే కాక ఎంతైనా అతడు నా భర్త. మొగుడు పెళ్ళాల మధ్య పట్టింపు లేమిటమ్మా! అయినా పెద్దోళ్లకైతే పంతాలు పట్టింపులూ చెల్లుతాయి కానీ మాలాంటి పేదోళ్లకు పంతాలేమిటి అమ్మగారు' అనడం మాధురిని ఆలోచింపేజేశాయి.
అందుకే ఈ మూడు సంఘటనలు ద్వారా మాధురి సరిపోల్చుకుని భర్త గుణగణాలను అంచనా వేసి, భర్త ప్రాముఖ్యాన్ని గుర్తించి అతనితో కలిసి జీవించడానికి సిద్ధమైంది. పాత్రలను పరిశీలిస్తే నాయికా నాయకుడు (మాధురి, కిశోర్‌) ఇద్దరూ ఒక (commitment) నిబద్దతగల పాత్రలే. పెళ్లి అయిన మూడునెలలకే ఇరువురి మధ్య మనస్పర్థలు, అనుమానాలు వచ్చి విడివిడిగా దాదాపు మూడు సంవత్సరాలు దూరంగా జీవించినా, తమ జీవితాన్ని ఇతరులతో పంచుకోవడానికి అవకాశం వచ్చినా తృణీకరించడం జరుగుతుంది. 
ప్రదీప్‌ మాధురిని బొంబాయిలోనే గాక హైదరాబాద్‌ వచ్చినా, తన ఇంట్లోకి వచ్చి వెంటబడి వేధించినా, మాటలతోనే అతనిని తన్ని తరిమేసినంత పనిచేసింది. సౌమ్యకు మూడు నెలలుగా కేర్‌టేకర్‌గా పనిచేయడానికి ఒప్పుకోవడంలో మాధురి ప్రేమమూర్తిగా కన్పిస్తుంది. కిశోర్‌ సైతం అసలు నిజం నిలకడమీద తెలుస్తుందనే ఉద్దేశ్యంతో మాధురి శీలాన్ని దెబ్బతీసే నాలుగు ఉత్తరాలు వచ్చినా వాటిని ఏమాత్రం లెక్కచేయక చించి చెత్తబుట్టలో  వేశాడు. కనీసం ఆమెకు మాటమాత్రం చెప్పకుండా చాలా నిబ్బరంగా, స్థిరత్వంతో తన భార్య మాధురినే అన్న భావన కల్గిఉంటాడు.
ఆధునికోత్తర యుగంలో కాలంతో పోటీపడి జీవితాలను యాంత్రికంగా గడుపుతున్న మనకు, ముఖ్యంగా ఈనాటి యువతీయువకులు, భార్యభర్తలు, చిన్న విషయాలకు, పొరపొచ్చాలకే తొందరపడి విడాకులు తీసుకొని, మానవ సంబంధాలను తెగతెంపులు చేసుకోవడానికి తేలిగ్గా మొగ్గు చూపుతున్న వారికి ముఖ్యంగా యువ జంటలకు ఈ నవల, మార్గదర్శక అవుతుంది. ఈ నవలలోని పాత్రలు సైతం ప్రేమకు ఆత్మీయతానురాగాలకు ప్రతిబింబాలని చెప్పవచ్చు. సంసారిక జీవనయాత్రలో చోటు చేసుకున్న పొరపాట్లను, అనుమానాలను భూతద్దంలో పెట్టి చూడకుండా సామరస్యంగా జీవితాన్ని కొనసాగించి, ఆనందంగా గడపాలన్నదే 'ఆవలిగట్టు' నవల సందేశం.
డా|| శ్రీదేవి కాలాతీత వ్యక్తులు నవల రాసి యాభై థాబ్ధాలు గడిచినా నేటికీ అది స్వీకరించదగిన నూతన ఇతివృత్తమే. ఆనాటి సమస్య సార్వకాలికం అయింది. అదేవిధంగా మల్లెమాల ఈ నవలను రాసి దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తున్నా నేటికీ ఇది సమాజ వాస్తవికతకు అద్దంపట్టేదే. ప్రపంచీకరణ ప్రభావం వల్ల స్వేచ్చా జీవితాన్ని కోరుకోవడం, చాలా సులభంగా మరొక వ్యక్తిని తమ జీవితంలోకి ఆహ్వానించడానికి సమాయత్తమవుతున్న తరం మనకు, ఈ నవల నిత్యనూతనంగానే ఉంటుందని చెప్పక తప్పదు.
మల్లెమాల కవిత్వాన్ని పరికించినట్లయితే  మానవతావాదిగా అభ్యుదయవాదిగా సహృదయుడిగా, సమాజంలోని ప్రజల అభ్యున్నతిని నికర్షగా కోరుకున్న వ్యక్తిగా దర్శనమిస్తారు.
ఇతర వృత్తులవారు రచయిత అవడం కంటే డాక్టర్లు రచయితలవడం వ్యవస్థకు అదనపు ప్రయోజనం. డాక్టరు రచయిత అయితే ఎవరికీ చెప్పుకోలేని కొన్ని సమస్యలు, జబ్బులను కేవలం డాక్టర్లకు మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. దీంతో రోగుల సమస్యలనుండి కొత్త కోణాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. సామాజిక లోపాలను వస్తువులుగా తీసుకొని రచన చేయడం వలన ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది. డాక్టరుగా చెప్పిన సూత్రాలు, నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కథలరూపంలో వివరించడం ద్వారా ఆ జబ్బులు, సమస్యలున్నవారే గాకుండా పాఠకులందరూ ఆ సమస్యపట్ల కనీసం అవగాహన కల్గి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయడంలో డాక్టరు చేయలేని సామాజిక ఉన్నతిని డాక్టరైన రచయిత చేయగల్గుతాడు. సైన్సును సాహిత్యం ద్వారా తెలియపరచడం, అభివృద్ధి చేయడం జరుగుతుంది. వ్యక్తులకు ఎన్ని రకాల జబ్బులున్నాయో సమాజానికి సైతం చాలా రకాల జబ్బులున్నాయి. ఈ జబ్బులను బాగు చేయడానికి రచయితలైన డాక్టర్లే బాగుచేస్తారని నా నమ్మకం.
మల్లెమాల గారికి కథలు రాయడం బాగా తెలుసు. రాసే కథల్లో కొంత దృష్టికోణం, శిల్పపరమైన అంశాలపట్ల కొంత దృష్టిని కేంద్రీకరించడంతోపాటు నేడు వస్తున్న కథా సాహిత్యాన్ని మరికొంత అధ్యయనం చేయడం జరిగితే మరికొంత గట్టి సాహిత్యాన్ని వెలువరిస్తారని ఆశిస్తున్నాను. 
(కడప జిల్లా 'నెల నెలా జిల్లా సాహిత్యం' సదస్సు 31-8-2013న యోగివేమన విశ్వవిద్యాలయం, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం కడప సంయుక్తంగా నిర్వహించిన సభలోని ప్రసంగవ్యాసం)