సరళీకరణ విధానాల ఫలితమే ధరల పెరుగుదల

ప్రభుత్వం అమలు చేస్తున్న సరళీకరణ విధానాల ఫలితమే నేడు ప్రజలపై ధరల భారాలు రోజురోజుకూ పడుతున్నాయని టెన్‌ టివి ఎమ్‌డి వేణుగోపాల్‌ విమర్శించారు. సెప్టెంబరు 11న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సాహితీ స్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో జనకవనం నిర్వహించారు.  అనంతరం అధిక ధరలు అనే అంశంపై సదస్సులో ఆయన మాట్లాడారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేదని, లాభాల కోసం వెంపర్లాటలో వినియోగదారులపై విపరీతమైన భారాలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళిక సంఘం గ్రామీణ ప్రాంతంలో రూ.27, పట్టణ ప్రాంతంలో రూ. 30 ఖర్చు పెట్టగలిగితే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు కాదని చెప్పడం ఘోరమైన విషయమన్నారు.  వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఓపెన్‌ మార్కెట్‌లో ముతక బియ్యం 30-35 రూపాయలు పలుకుతోందన్నారు. రేటు నిర్ధారించడంలోనే ప్రభుత్వం విఫలమైందన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో అంతర్జాతీయంగా ధరలు పెరగాయని చెప్పి ఇక్కడ కూడా పెంచుతున్నారని, అక్కడ తగ్గినప్పుడు తిరిగి ధరలు దించడంలో శ్రద్ధ చూపడంలేదని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మూలంగా 1991 నాటి సంక్షోభం కంటే మించి సంక్షోభాన్ని రాబోయే రోజుల్లో ఉంటుందనడంలో సందేహం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి  కిషోర్‌ అధ్యక్షత వహించారు. జనకవనం కార్యక్రమ నిర్వాహకురాలుగా శాంతిశ్రీ వ్యవహరించగా రాష్ట్ర కార్యదర్శి వొర ప్రసాద్‌, జి. యాదగిరిరావు, సాహిత్య ప్రకాశ్‌, పొత్తూరి సుబ్బారావు, రాజ్యలక్ష్మి, మోపిదేవి రాధాకృష్ణ, వెంకటి, కృష్ణమోహన్‌, నరహరి, నరేష్‌ మౌనశ్రీ మల్లిక్‌, కె. రాధాకృష్ణ, గజవెల్లి థరధరామయ్య, పి.ఎన్‌. మూర్తి, పెద్దూరి వెంకటదాసు, సూతారపు వెంకట్‌, వి.ఎస్‌.వి. ప్రసాద్‌, మహేష్‌ దుర్గే, తదితరులు పొల్గొన్నారు.  తంగిరాల చక్రవర్తి వందన సమర్పణ చేశారు.