అవసరాలు, అవకాశాలూ

   వొరప్రసాద్‌
   సాహితీస్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కథా కార్యశాల ఊహించని స్థాయిలో విజయవంతమైంది. వివిధ సాహిత్య ప్రక్రియలలో మార్గదర్శకత్వం కోసం ఔత్సాహికులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఈ కథా కార్యశాల రుజువు చేసింది. గత సంవత్సరం వచన కవితా ప్రక్రియ పట్ల అవగాహన పెంపొందించడానికి ఇదే సాహితీస్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కవిత్వశాలలో కూడా ఈ విధమైన స్పందనే చూశాం. వంద రూపాయలు చెల్లించి ఈ శిక్షణా కార్యక్రమాలలో ఔత్సాహికులు పాల్గొంటున్నారంటే తెలుగు సాహిత్యం వికాసం కోసం కృషి చేసే వారందరికీ సంతోషం కలుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు దీర్ఘకాలికంగా నిర్వహించాల్సిన అవసరాన్ని కూడా తెలియజేస్తుంది.
రచన చేయాలన్న అభిలాష కలిగి ఉండటం భాష అభివృద్ధికి దోహదం చేస్తుంది. తెలుగు భాష వికాసానికి పాటుపడుతున్న వారంతా ఇటువంటి వారికి మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు ఇటువంటి శిక్షణలు లేకపోవచ్చు. స్వయంకృషితో తొలి నవలలు, తొలి కావ్యాలు, తొలి కథలు, తొలి నాటకాలు రాసి ఉండవచ్చు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ముందు తరాల రచయితలు అనేక రచనలు చేసి కొత్తగా రాసేవారి కోసం బాటలు పరిచారు. ఆ బాటలను అధ్యయనం చేసి అవగాహన కల్పించుకుంటే రచనలు చేయవచ్చు. గత రచనల సృష్టితో కొన్ని ప్రమాణాలు ఏర్పడ్డాయి. ఆ ప్రమాణాల గురించిన అవగాహన కొత్తగా రాసేవారికి ఉండాలి. మన రాష్ట్రంలోని తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు, వివిధ విశ్వవిద్యాలయాలు ఆ ప్రయత్నం కొంతమేరకు చేస్తున్నాయి. కాని సంఖ్యరీత్యా పరిమితమే. కేవలం విశ్వవిద్యాలయ విద్యార్థులకే కాకుండా ఆసక్తి గల ఇతరులకు కూడా ఇటువంటి శిక్షణా తరగతులు ఏర్పాటు అవసరం ఈ రోజు కనపడుతుంది. ఆ దిశగా విశ్వవిద్యాలయాలు ప్రయత్నం చేయాలి.
అలాగే వివిధ సాహితీసంస్థలు కూడా ఇటువంటి కృషిచేయాలి. చాలా తక్కువ సంఖ్యలో కొన్ని సంస్థలు ఇటువంటి ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ ఆ కృషి సరిపోదు. ప్రస్తుతం సాహితీస్రవంతి తన శక్తిమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి సాహిత్యశాలలు, కథాశాలలు, వచన కవిత్వశాలలు నిర్వహించింది. నిర్వహిస్తున్నది.
ఇటువంటి కథాకార్యశాలలు, సాహిత్యశాలలు, కవిత్వశాలలను మరింత ప్రయోజనకరంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రత్యేక కృషి చేయాలి. అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కంప్యూటరైజేషన్‌ను ఉపయోగించుకుని ఈ శిక్షణా కార్యక్రమాల్ని రూపొందించాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్దయెత్తున ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. ఈ కృషిలో రాష్ట్రంలో ఉన్న క్రియాశీల సాహితీసంస్థలకు భాగస్వామ్యం కల్పించాలి.
తెలుగు భాష వికాసానికి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఇతోధికంగా దోహదం చేస్తాయి. భాషా వికాసానికి కృషిచేయడమంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కూడా చాలా ప్రధానం. సాహిత్యం అంతిమంగా సామాజిక సంస్కారాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. అది దృష్టిలో పెట్టుకున్ని ఇటువంటి శిక్షణలకు సామాజిక చైతన్యం అంతిమ లక్ష్యంగా ఉండాలి.
ఇటీవల కథానిక ప్రక్రియకు ఆకర్షణ పెరిగింది. రాసిన వాటిని ప్రచురించే అవకాశాలు కూడా పెరిగాయి.  ఇంటర్నెట్‌ విస్తరించడం కొత్త అవకాశాలకు నాంది పలికింది. ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ నెట్‌వర్క్‌లలో, సొంత బ్లాగ్‌లలో, వెబ్‌సైట్‌లలో విస్తృతంగా తమ భావాలను అక్షరీకరించే వారి సంఖ్య ఊహించని రీతిలో రోజురోజుకూ పెరుగుతున్నది. ఇంటర్నెట్‌లో తెలుగువ్యాప్తి విస్మయపరిచే విధంగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు తెలుగు భాష, సాహిత్యం మరింతగా వికసిస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఈ ఇంటర్నెట్‌ సౌలభ్యం తెలుగు భాషకు కొత్తపదాలను అందించే అవకాశం ఉంది.  ఈ క్రమంలో భాషపట్ల అవగాహన పెంచేలా ప్రభుత్వం ఒక యంత్రాంగం ఏర్పాటు చేయాలి. ఇంటర్నెట్‌లో ఉపయోగించే భాషను జాగ్రత్తగా ఎంపికచేసుకునేలా మార్గదర్శకత్వం వహించాలి. అందుకోసం తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇటువంటి చర్యలు మాత్రమే తెలుగు సాహిత్యం సుసంపన్నం కావడానికి దోహదం చేస్తాయి.