స్పందన ఊహించలేదు

సాహితీస్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నిర్వహించిన 'కవితా కార్యశాల' విజయవంతమైనప్పుడే, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా 'కథా కార్యశాల' నిర్వహించాలనే అభిప్రాయం దాదాపు కమిటీ సభ్యులంతా వెలిబుచ్చారు. నగరకమిటీ నెలనెలా 'జనకవనం' నిర్వహిస్తూనే, కార్యశాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందిస్తూ రావడం జరిగింది. ఆగస్టు నెలలో రెండు దఫాలుగా కమిటీ సమావేశమై, సెప్టెంబర్‌ 29న కథా కార్యశాల నిర్వహించాలని, అందుకు ముఖ్య అతిథిగా ఎవరు, ముఖ్యమైన అంశాలు, వాటికి ప్రధాన వక్తలెవరనే అంశాల్ని నిర్ణయించడం జరిగింది. అంతే, ఆ క్షణం నుండీ సభ్యులంతా తమకు కేటాయించిన పనుల్లో నిమగ్నమైపోయారు.
మేమూహించిన దానికంటే అధికంగా, కథారచయితల నుండి, సాహితీ అభిమానుల్నుండి, పాఠకుల్నుండీ మరీ ముఖ్యంగా సెంట్రల్‌యూనివర్శిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల్నుండి లభించిన స్పందన మా కష్టమంతా మరిచిపోయేలా చేసింది. అంతే కాకుండా ఇలాంటి మరిన్ని కార్యక్రమాల్ని మరింత విజయవంతంగా నిర్వహించగలమనే ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రవాణాసౌకర్యాలు సరిగాలేకున్నాగానీ స్త్రీలు సైతం ఇతర జిల్లాల నుంచి ఎంతో వ్యయప్రయాసలకోర్చి రావడమే కాకుండా, దాదాపు రాత్రి 8 గంటలు కావస్తున్నా కార్యశాల ముగిసేదాకా ఉండడం మాకెంతో ఆనందాన్నిచ్చింది.- ఎస్‌ఎస్‌బి గేరా
ఆలోచింపజేసింది
సాహితీ స్రవంతి కథా కార్యశాల అనుభవజ్ఞులైన సీనియర్‌ కథా రచయితల్ని సైతం ఆకట్టుకొని ఆలోచింపజేసేలా సాగింది. ముఖ్యంగా లెనిన్‌ ధనిశెట్టి, ఓల్గా అభిప్రాయాలు కార్యశాలకు హాజరైన  ఆకట్టుకున్నాయి. 'అలాగే 100 సినిమాలకు రచన చేయడం కన్నా ఒక కథ రాయడం కష్టం' అన్న జనార్ధన్‌ మహర్షి అభిప్రాయం నూటికి నూరుశాతం కరెక్టు. కాబోయే కథకులు కథ(ల)ను చదవడం, కథ(ల)ను పరిశీలించడం, ఏం రాయాలి? ఎలా రాయాలి, సాధన చేయడం ఎలా చేయాలి...? వంటి చాలా విలువైన అభిప్రాయాలు చెప్పారు. స్వీయకథకుల అభిప్రాయాలు.. మొత్తం కార్యక్రమానికే హైలైెట్‌;   
అభినందనలు
 హైదరాబాద్‌లో సాహితీస్రవంతి నగర కమిటీ ఆధ్వర్యంలో 'కథా కార్యశాల' నిర్వహించడం అభినందనీయం. 'తెలుగు జాతి' ఒక ప్రత్యేక పరిస్థితులలో ఉన్న ఈ తరుణంలో రాష్ట్రం మొత్తంగా 200 మంది రచయితలను సాహితీ అభిమానులను సమీకరించడం, రాత్రి 8,00 గం|| వరకూ.. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం మన ''సాహితీస్రవంతి''కి   తెలుగు సాహితీలోకంలో ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది.
కథకుల స్వీయకథ విశ్లేషణ కార్యక్రమం యొక్క మొత్తం లక్ష్యాన్ని నెరవేర్చిందనుకుంటున్నాను. రహమతుల్లా, వేంపల్లి షరీఫ్‌, కుప్పిలిపద్మ, శిరంశెట్టి కాంతారావు, అచ్యుత రామయ్య,  ఉమామహేశ్వర్‌ మొదలగు మిత్రుల స్వీయకథా విశ్లేషణ ఒక పాఠంలా భావించవచ్చు. మంచి కథా రచయితలుగా ఎదిగిన వారి స్వీయ అనుభావాలు తమ తమ జీవితాల నుండి ప్రారంభమై సామాజిక జీవితంలోకి ప్రవహించినట్లుగా ఉన్నాయి. అంటే ముందుగా స్వీయజీవిత చిత్రణతో కథారచన ప్రారంభమైతే బావుంటుందని వారి అనుభవం నుంచే కాకుండా, చాలా మంది జీవితాల నుండి కూడా అలాగే ప్రారంభమైందని కథకుల జీవిత చరిత్రలు చదివితే తెలుస్తుంది. సాహిత్య కారులుగా ఎదగటానికి ప్రత్యేక శిక్షణలంటూ ఉండవు, ఇలాంటి కార్యశాలలు, అనుభవాలు, చరిత్ర అధ్యయనం ద్వారా పుస్తకాల అధ్యయనం  ద్వారా మాత్రమే సాధ్యం.  కవి, రచయిత, విమర్శకుడు కథకుడు,ఏ ప్రక్రియలోనైన రాణించేందుకు ఇవి ఉపయోగ పడతాయని నా అభిప్రాయం.    - రౌతు రవి    
కథా సాహిత్యంలో శాస్త్రీయ ప్రయోగం
సాహితీస్రవంతి ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన కథాకార్యశాల కధాసాహిత్యంలో లోతైన విషయాలను చర్చించింది. కథల్లోని అనేక కోణాలను విశ్లేషించింది. వస్తువు, శిల్పం, శైలి వివరించడంతో కథలు రాయాలను కొనేవారికి కాకుండా, కథా సాహిత్యంలో ఇదివరకే ఉన్నవారికీ ఉపయోగపడిందనడంలో ఆశ్చర్యమేమి లేదు. కథలు సమకాలీన సంగతులు, సమస్యలు ఇతివృత్తంగా చేసుకొని రాయడమే కాకుండా, మానవీయ విలువల్ని పెంపొందించాల్సిన అవసరాన్ని కథాకార్యశాల కధకులకు గుర్తుచేసిందనిపించింది. ప్రసిద్ధ రచయితల కథలను పరిచయం చేయడం, చర్చించడం మరువలేని అనుభూతి, కథకు కావలసిన వస్తువును ఎంపిక చేసుకోవడం మొదలు ఆద్యంతం కొనసాగించాల్సిన తీరు చెప్పడం వల్ల కథల్లోను అన్ని విషయాలను స్పృశించినట్లపించింది. కథాసాహిత్యంలో రాష్ట్రంలో ఎవ్వరూ చేయని, శాస్త్రీయ ప్రయోగం చేసి విజయవంతం చేశారనడంలో సందేహం లేదు.  - కెంగారమోహన్‌
    Iam Maheswara Rao. Iam  very interest about writing stories but I dont know how to write, I am fresher for writing stories no experience on that but I got ONE YEAR experience in a SINGLE DAY... that credit goes to KATHA  KARYASALA and thanks to SAHITI SRAVANTI  (ఇ-మెయిల్‌ ద్వారా)- [email protected]
మంచి కార్యక్రమం
కథా కార్యశాల చక్కగా సాగింది. కథాప్రస్థానంపై ఓల్గా గారి ప్రసంగం ఆలోచనాత్మకం. నిర్మాణంపై ఖదీర్‌బాబు సూచనలు తప్పక ఉపకరిస్తాయి.
కవిత్వంపై కూడా తగిన వారితో పాఠశాల నిర్వహిస్తే బాగుంటుంది.
కథారచనపై మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి నిర్వహించిన సాహితీస్రవంతి సభ్యులకు అభినందనలు.- మంత్రి కృష్ణమోహన్‌
 ప్రతీ జిల్లాలో నిర్వహించాలి
సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన కథకుల వర్క్‌షాప్‌ ఆహ్లాదకరంగా జరిగింది. ఔత్సాహిక కథకులకోసం నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌ పూర్తిస్థాయిలో సఫలమైందని చెప్పలేం. ముఖ్యంగా ఔత్సాహిక కథకుల పాత్ర ఇందులో ఏమీలేదు.
అది అలావుంచితే ఔత్సాహిక కథకులకు కథలు ఎలా వ్రాయాలి? వస్తువు ఎలా స్వీకరించాలి? అందులోని మెలకువలు గురించి తెలియజెప్పాలి. వారి సందేహాలకు ప్రముఖ కథకులతో సమాధానాలు చెప్పించాలి. అటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదు.
కేవలం పాతకాలం కథకుల గురించేగాక అసలు తెలుగులో పఠనాసక్తి కలిగించిన చందమామ, బాలమిత్ర వంటి పిల్లల కథల గురించి, కొవ్వలి నవలల గురించి గూడా కాబోయే కథకులకు తెలియజెప్పాలి.
కథల గురించి చెప్పేటప్పుడు గురజాడ, శ్రీపాద, రావిశాస్త్రి వంటి లబ్దప్రతిష్టుల గురించి మాత్రమేగాక ఇప్పటితరం కథకుల గురించి, వస్తున్న కథా సంకలనాలు, పత్రికలలో ఎటువంటి కథలు ప్రచురిస్తున్నారు. ఇటువంటి వాటి మీద చర్చలు జరపాలి.
ఇకముందు నిర్వహించబోయే కథా కార్యశాలలో ఔత్సాహిక కథకులను గుర్తించి, వారిని గూడా కార్యక్రమాలలో భాగస్వాములను చేసి ప్రోత్సహించాలి. అందువలన ఎంతో ఉపయోగం వుంటుంది. ముందు ముందు కథా కార్యశాల ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసి ముందుకు సాగాలని ఆకాంక్ష.  - సి.హెచ్‌.శివరామప్రసాద్‌, (వాణిశ్రీ)
మంచి ఆలోచన
 కథాకార్యశాల చర్చావేదిక రచయితలకు ప్రయోజనకరంగా వుంది. ఇది మంచి ఆలోచన! మీ ఆహ్వానాన్ని అందుకొని యువరచయితలతోపాటు వయోవృద్దులు కూడా ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా సుందరయ్య విజ్ఞానకేంద్రానికి వచ్చి కధా కార్యశాల చర్చావేదికలో పాల్గొని ఎనిమిదిగంటలపాటు ప్రసంగాలు ఆద్యంతం శ్రద్ధగా ఆలకించారు. ప్రశ్నలు అడిగి సందేహాలు తీర్చుకున్నారు. నిర్వాహకులు ఆశించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి సభని విజయవంతంచేశారు. ఇది మంచి భవిష్యత్తుకు సూచన.
ఇలాగే తెలుగునాడులోని అన్ని  పట్టణాలలో కూడా ఇలాంటి చర్చావేదికలు సాహితీస్రవంతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తే అభ్యుదయ, హేతువాద, సామాజిక విజ్ఞానయుతమైన రచనల స్థాయి, ప్రమాణాలు విస్తృతం అవుతాయి. మూఢ నమ్మకాలవైపు యువత మొగ్గుచూపకుండా కొంతైనా తగ్గించవచ్చు. - పారుపల్లి వెంకటేశ్వరరావు
 గుండెనిండా సంతృప్తి
...కథలు రాద్దామని అభిప్రాయం ఎంతోకాలం నుంచి ఉన్నా కధలేం రాస్తాములే! ఇప్పటికే రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా! మనం కొత్తగా ఊడబొడిచేదేముంది? ఉద్ధరించే దేముంది? అన్న నిర్లిప్తత (నిర్లిప్తత అనే కన్నా రాయడం ఆరంభించినా విజయవంతంగా పూర్తిచేయగలమా అన్న భావన అనేయచ్చు) తో ఉద్దేశ్యానికి రెడ్‌సిగ్నల్‌ పడింది. కానీ ఉన్నట్లుండి రోజువారీ పేపర్ల తిరగవేతలో 'సాహితీ స్రవంతి' కధా కార్యశాల' పిలుపుకు ఆకర్షితున్నై సుందరయ్య విజ్ఞానకేంద్రానికి  పరుగులు తీసేలా చేసింది. వాస్తవానికి నేనోచోట అలా అటూ, ఇటూ వెళ్ళకుండా అన్ని గంటలు (ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటలు... అంటే దాదాపు పది గంటలపాటు) ఒకేచోట ఉండడం మొదటిసారి. అయితే అన్ని గంటల వినియోగం 'సద్వినియోగమే'నని మాత్రం ఘంటాపధంగా కాకున్నా గుండెనిండా సంతృప్తిచెందిన స్వరంతో చెప్పగలను.  - వి.బి. శంకర్‌
ఫేస్‌బుక్‌ కామెంట్స్‌
కథా కార్యశాల విశేషాలను అరిపిరాల సత్యప్రసాద్‌ ఫేస్‌బుక్‌లో రాశారు. వాటిని ఫాలో అవుతూ పలువురు తమ స్పందనలను పోస్ట్‌ చేశారు. కథా కార్యశాలకు హాజరైన  కొందరు ఈ ఫేస్‌బుక్‌ చర్చల్లో సందడి చేశారు. స్వీయ కథా విశ్లేషణ చేసిన రచయితల కథలు టీ జంక్షన్‌, పర్దా, వాటర్‌ వంటి కథలను కూడా పోస్టింగ్‌ చేసి చర్చించారు. వాటిలో మచ్చుకు కొన్ని...  
అనుభవాల పేటికలు
సాహితీస్రవంతి కథా కార్యశాల, చాల చక్కటి కార్యక్రమం. ముఖ్యంగా రచయితగా ఎదగాలి అన్న మా లాంటి వారికి ఈ కార్యక్రమం  ఎంతో దోహదపడింది.
ఓల్గా, ఖదీర్‌బాబు, లెనిన్‌, తెలకపల్లి రవి, కుప్పిలిపద్మ, సాహిత్యప్రకాష్‌, ఉమమహేశ్వరరావు, యాళ్ల అచ్యుతరామయ్య, వీరు కాకుండా మరో ఇద్దరు గెస్ట్‌గా గుడి(నవల) దేవాలయం (సినిమా) రచయిత అయిన జనార్థన్‌ మహర్షి వీరందరిని ఒకేసారి కలవడం నిజంగా మర్చిపోలేని అనుభూతి.  ఈ కార్యశాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మరెన్నో పరిచయాలు, ప్రసిద్ధ, వర్ధమాన రచయితలతో ముఖాముఖిలు, వారి అనుభవాల పేటికలను తెరిచారు. అందులోంచి ఎవరికి నచ్చినవి వారిని తీసుకొమ్మని చెప్పారు.   - మణి వడ్లమాని       
అద్భుతం
నిజంగా నిన్నటి కార్యక్రమం అత్యద్భుతం.. అరిపిరాల సత్యప్రసాద్‌గారు. మీరు నాకు తెలియదు కాబట్టి మిస్‌ అయ్యాను. షరీఫ్‌గారిని కలిసాము. చాలా ఆనందం కలిగింది. మిత్రులు సుజల గంటి  గారు, మణి వడ్లమాని గారు చాలా మంచి కంపెనీ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నగరంలో విరివిగా జరిగితే చాలా బావుంటుంది అన్న ఫీలింగ్‌ కలిగింది. నిర్వాహకులు ఎంతో బాగా జరిపించారు. ఉదయం వెళ్ళగానే టీ ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆ తర్వాత కార్యక్రమం జరుగుతూ ఉండగానే బిస్కట్లు, టీ ఇచ్చారు. రెండు గంటలకి చక్కని విందు భోజనం మళ్ళీ సాయంత్రం స్నాక్స్‌, టీ... అసలు కార్యక్రమమే ఓ చక్కని విందు అయితే మధ్య మధ్యలో ఈ విందులు కూడా. అన్నిటికీ మించి నా స్నేహితురాలు సుజాత తిమ్మన కు తలమీద గాయం తగిలితే వారు తీసుకున్న శ్రద్ధకు ఇవే నా నమోవాకాలు... వెంటనే దగ్గరుండి డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్ళి కట్టు కట్టించి, ఇంజక్షన్‌ చేయించి తీసుకు వచ్చారు... అంతేకాక ఎంతమందో సాహితీమిత్రులు అనుక్షణం సుజాతను పరామర్శిస్తూనే ఉన్నారు. సభాముఖంగా కూడా ఆమెను, ఆమె శ్రద్ధను ప్రశంసించారు. అందరికీ ఎన్నెన్నో ధన్యవాదాలు..... - నందూరి సుందరి నాగమణి
 ఆనందించా....
కార్యశాల వారికి ఫోన్‌ చేశా... ఏమండి.. కొంచెం లేట్‌ అయినా రావచ్చా అని.. దానికేం... రండి అన్నారు. చక...చక... తయారు అయిపోయా ఉదయం 11.30 ని|| కల్లా  వచ్చేశాను... అప్పుడే ఓల్గాగారి... ప్రసంగం ప్రారంభమయ్యింది.... కూర్చున్నా... విన్నా.. మధ్యలో టీ.. ఇచ్చారు. బిస్కెట్లు పెట్టారు. తిని త్రాగి అందర్నీ గమనిస్తూ.. కూర్చున్నా... కాసేపు బావుందే అనిపించింది. కాసేపు ఆఁ! కరెక్ట్‌ ప్రొగ్రాంకే వచ్చాము అనిపించింది. ఇంతలో చిన్న కునుకు పట్టింది. లేచేసరికి.. భోజన విరామం అన్నారు. ఆ తరువాత మళ్ళీ మూడో అంతస్తుకి మారమన్నారు. అందరి మాటలు విన్నా... ఏం చెయ్యాల్లో... ఏం చెయ్యకూడదో... వాళ్ళ.... వాళ్ళ అనుభవాల్ని విన్నా స్వీయకథల విశ్లేషణలు సాగుతుండగా.. మెల్లిగా ఇంటిదారి పట్టా.. మొత్తానికి ఓ కార్యక్రమం.. చూశా, విన్నా.. ఆనందించా.. ఆవేశం చెందా.. విసుగుచెందా, అవునా.. అలాగా అనుకొన్నా....- చంద్రమౌళి కళ్యాణ చక్రవర్తి
విలువైన సందేశం
సాహితి స్రవంతి, హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ''కథా కార్యశాల'' మాకు ఉపయోగకరంగా ఉంది. మేం కూడా కథ రాయగలం అనిపించింది. మాలో అటువంటి నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించినందుకు కృతజ్ఞతలు.  - యడవల్లి శైలజ    
శిక్షణ చాలా గొప్పది
వ్రాయాలి, వ్రాయాలి అని తపించిపోయే ఔత్సాహిక కథారచయితలకు మీరిచ్చిన శిక్షణ అపూర్వం, అత్యద్భుతం, సముద్రంలో కొట్టుకుపోతున్నవాడికి ఒక నావ దొరికినట్లు, భావనా సముద్రంలో కొట్టుమిట్టాడుతూ, ఎలా మొదలు పెట్టాలి?  ఎలా నడిపించాలి, ఎలా ముగించాలో తెలియక అల్లాడుతున్న భావి రచయితలకు మీరిచ్చిన శిక్షణ చాలా గొప్పది.
- శ్రీపాది రామచంద్రయ్య
 ఆశగా వచ్చాను
ఎంతోమంది కథకుల నుంచి కథారచనపట్ల వారికున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని వినవచ్చని ఎంతో ఆశగా నేను వచ్చాను. రచయితలు తమ కథలను ఎలా రాస్తున్నారో, దానికి కావలసిన ముడి సరుకును ఎలా సేకరిస్తున్నారో, తాము ఎంచుకున్న ఇతివృత్తంపై ఎలాంటి పరిశ్రమ చేసి దాన్ని మరింత అభివృద్ధి చేస్తుంటారో తదితర అంశాలను విందామని  వచ్చాను. అయితే సమయాభావం వల్ల నిర్వాహకులు ఈ అంశానికి అంత ప్రాముఖ్యం ఇవ్వలేదనిపించింది. ఇక ఖదీర్‌బాబుగారు చెప్పిన విషయాలు బాగా ఉన్నాయి. అలాగే తమ సొంత కథల గురించి చివరిలో కొద్దిమంది రచయితలు చెప్పిన కథవెనుక కథలు బాగా ఉన్నాయి. మున్ముందు ఇలాంటి కార్యశాలను నిర్వహించినప్పుడు మరింత ఎక్కువ మంది కథకులతో తాము రాసిన ఒకట్రెండు మంచి కథలను ఎంపిక చేయించి, వారెలా రాశారో కూలంకషంగా చెప్పిస్తే బాగుంటుంది. రాష్ట్రమంతా ప్రత్యేకవాదం, సమైక్యవాదం మధ్య గొడవగా ఉన్నప్పటికీ దాదాపు అన్ని ప్రాంతాల నుంచి కథకులు ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొనడం సంతోషాన్ని కలిగించింది. తెలుగు భాషను సాహిత్యాన్ని ప్రేమించేవారికి ఇదెంతో ఆనందం కలిగించింది.  -  కె. రఘు
హృదయానికి హత్తుకుంది
స్వీయకధా విశ్లేషణా రచయితలు తమ ఆలోచనలను మలిచి రూపుదిద్ది ఊపిరిలూదిన కథలను వివరిస్తూ కన్నీటిపర్యంతమైన ఆ సెషన్‌ హృదయానికి హత్తుకుంది. నిష్ణాతులైన రచయితలు, ఒక దండులా చేరిన వర్ధమాన రచయితలకు తర్ఫీదులిచ్చి, కలమూ కాగితము చేతిలో పెట్టి పదండి రాయండి అక్షర ఆయుధాలను సంధించండి అంటు చైతన్యపరిచిన కథాకార్యశాల ఒక్కరోజు కాకుండా రెండు మూడు రోజులు తరచూ సాగాలని నా మనవి.- చక్రపాణి నోముల
రాయిస్తారేమో అనుకున్నాను
ఆద్యంతం - ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించబడిన 'కథా కార్యశాలకు' రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 200 మంది వరకు రావడం అందులో నేనూ ఖమ్మం నుండి రావడం జరిగింది. రాత్రి 8 గం|| వరకు వచ్చిన వారందరూ, ఎంతో ఆసక్తిగా ఆసాంతం అందరు చెప్పిన అంశాలను వినడం ముఖ్యమైనవి నోటుబుక్‌లో వ్రాసుకోవడం జరిగింది. ఇంత గొప్పగా నిర్వహించబడిన 'కథా కార్యశాలకు' సమయం  సరిపోలేదనిపించింది. మాతో ఈ కార్యశాలలో కథలు రాయిస్తారేమో లేదా మేము రాసుకొని వచ్చిన కథలను చదివి అందులోని లోపాలు వస్తువు, శిల్పం, కథా కథనం లాంటివి సరిదిద్ది సరియైన సూచనలు, సలహాలు ఇస్తారని అనుకున్నాను. ఆ విషయంలో నేను కొంత నిరాశకు లోనయ్యాను.- వురిమళ్ల సునంద
కార్యశాలలు మరిన్ని పెట్టాలి
నిజంగా ఇటువంటి కార్యక్రమం ఒక్కరోజులో అయ్యేది కాదు. దీన్ని మరోకరోజు పొడిగించి కొత్తగా కథలు వ్రాయాలనుకునేవారితో కధలు వ్రాయించి వాటిని సభలోనే సరిదిద్ది ఇంకా ఎన్నో మెలకువలను నేర్పిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంతే కాదు ఇటువంటి కార్యశాలలు మరిన్ని పెట్టాలని కొత్త రచయితలకు ఊపిరిపోయాలని మిమ్ములను ప్రార్ధిస్తున్నాను.  - నూనెల శ్రీనివాసరావు
కథా రచనకు పురిగొల్పింది          
కథా కార్యశాలకు వచ్చాక కథానిక పట్ల అవగాహన కలిగింది. ఉత్తమ కథా రచయితగా ఎదగాలంటే పాఠకుని  హృదయాన్ని అర్థం చేసుకోవాలనే విషయాన్ని 'కథా కార్యశాల'లో ప్రసంగించిన కథా రచయితల అనుభవాల ఆధారంగా తెలుసుకున్నాను. కవిత్వం మాత్రమే రాసే నన్ను ఈ కార్యశాల కథా రచనకు పురిగొల్పింది. కథకునిగా మార్చింది. సాహితీ ప్రస్థానం మాసపత్రికగానే కాకుండా ఇలాంటి సాహితీ సదస్సులను మరిన్ని నిర్వహించి మాలాంటి యువతీ యువకులకు శిక్షణా సంస్థగా మారాలని కోరుతూ, 'కథా కార్యశాల' నిర్వాహకులకు ధన్యవాదములు తెలుపుతున్నాను.- సల్ల విజయ కుమార్‌
ప్రేరణ కలిగింది
కథా కార్యశాల కార్యక్రమం మమ్మల్నెంతోగానో ఆకట్టుకొంది. ఒక విధంగా చెప్పాలంటే నా జీవితాశయంలో ఇదీ ఒక భాగమయ్యేలా చేసింది. ఈ కార్యక్రమంలో నేను 'కథ ఎలా రాయాలి'?  అనే అంశం గల   బ్రోచర్‌ చదివాను. అందులోని ఆరుద్రగారి కొన్ని సూచనలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. ఈ కార్యక్రమ ప్రేరణతో నేను ఒక కథానిక రాశాను. నేను రాసిన ఈ మొట్టమొదటి కథానికకు ప్రేరణ అందించిన ఈ కార్యక్రమ నిర్వాహకులకు నా నమస్కారాలు. చిన్న అంశంతో కూడా కథను ఎలా మలుపులు తిప్పవచ్చు అన్న విషయాలు నేను తెలుసుకొన్నాను. ఇటువంటి కథా కార్యశాలలు మరెన్నో నిర్వహించాల్సిన అవసరం ఉంది.- ఎం. సురేందర్‌  
కథకు ఉద్యమాలే ఊపిరి కావాలని చాటిన సభ
సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ సభ జరుగుతున్న హాలులోకి అడుగుపెడుతూనే ఆశ్చర్యానికి లోనయ్యాను. ఎందుకంటే హైదరాబాద్‌లో వతనుగా మూడు నాలుగు చోట్లకు మినహా సాహిత్య సభలు జరిగే మరే ఏ ఇతర చోట్లకూ అంతమంది జనం రావడం చాలా అరుదు. 'కోకిలం' సాహితీ సాంస్కృతిక సంస్థ ఆర్గనైజర్లలో ఒకడిగా నాకు సాహిత్యసభ ఎలా ఉంటుందో బాగా తెలుసు. 40 మందికి మించి జనం ఉండకపోవచ్చని అనుకొన్న నాకు ఆ సభలో ఆ రోజు ఆదిలోనే చాలా మంది రచయితలతో సహా 200 మందిదాకా జనం కనపడి ఆశ్చర్యపోయాను. సరే... మంచి సభ మిస్సవకుండా వచ్చామని సంతోషించాను. ముఖ్యంగా కథా వస్తువు, శిల్పం, సామాజిక ఉద్యమాల కోణం గురించి విస్తృతంగా  వక్తలు తమ ప్రసంగాల్లో సమాధాన పూర్వకంగా ప్రస్తావనలు చేస్తూ చర్చ సాగించారు.  తెలకపల్లి రవి 'ఉద్యమాలు లేకుండా మానవ నాగరికతలో అభివృద్ధి లేనేలేద'ని కుండబద్ధలు కొట్టినట్టు ప్రకటన చేసి చర్చకు సామాజిక కోణాన్ని స్పష్టపరిచారు. సభకు చాలా మంది వర్ధమాన, వర్తమాన, ప్రముఖ కథారచయితలు హాజరై నిండుదనం చేకూర్చారు. మొత్తానికి సాహితీస్రవంతి వారి ఆనాటి కథా కార్యశాల చాలా కాలం గుర్తుండేలా దిగ్విజయంగా, ప్రయోజనకరంగా సాగింది.  - పురాణం శ్రీనివాస శాస్త్రి
రకరకాల అనుభవాల్నిస్తూ, ఎప్పట్నుంచో రాయాలనున్నా, పెన్ను పెట్టలేకపోవడానికి అడ్డంకులైన పరిస్థితుల్ని విశ్లేషించుకునేందుకు తోడ్పడింది. కథలు రాయడానికి టెక్నిక్‌లను సూచించే ఆరుద్ర చిన్న పొత్తం అందించడం ముదావహం.- శ్రీనివాసరావు     
మీరు నిర్వహించిన కథా కార్యశాలకు హాజరయ్యాను. ప్రమాణ పత్రం తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేశాను. ఈ రోజు సాయంకాలం మీ వద్ద నుండి ఫోన్‌ వచ్చింది. చెప్పొద్దూ, చాలా సంతోషమైంది. నేర్చుకున్న విషయాలు మరువనీయకుండా మా చేత కథలు రాయించడానికి మీరు ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తోంది.
- మోహిత
 నాకు నేనుగా హాజరయిన సభ
నా పాతికేండ్ల వయస్సులో నాకుగా నేను అనుకుని హాజరైన సాహితీ సభ ఇదే మొదటిది. నేను మా నాన్నతో చాలా సమావేశాలకు హాజరయ్యాను. అవన్నీ మా నాన్న నన్ను తీసుకెళ్ళినవి. కాని ఇదే నేను మొదటగా ఇష్టంతో ఒక్కడిగా స్వంతంగా పోయిన తెలుగు సాహిత్య సమావేశము. నా బిటెక్‌, ఎంబిఎ క్లాస్‌మేట్స్‌లలో ఎవరికీ ఈ మాత్రం అన్నా తెలుగు సాహిత్యంతో సంబంధం లేదు. ముఖ్యంగా ఇంగ్లీషు మీడియం పిల్లలం, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ పిల్లలం తెలుగు సాహిత్యం జోలికి అస్సలే పోలేదు. పోలేని చదువుల ఒత్తిడి మాది. మా తల్లిదండ్రులు కూడా ఆ ప్రపంచాన్ని మాకస్సలికే పరిచయం చేయరు. మా భవిష్యత్తు, కెరీర్‌ దృష్ట్యా చెయ్యలేరు కూడా. తెలుగు కథ తెలుగు సాహ్యితము, తెలుగు భాష, తెలుగు సంస్కృతి లాంటి ఎన్నో తెలుగు జాతి గురించిన విషయాలు పరిచయం చేసారు. -  మేరాజ్‌
ఫలప్రదం కథా కార్యశాల
వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారికి ముందుగా ఆరుద్ర గారి 'కాబోయే కథకులకు  పనికొచ్చే చిట్కాలు' పుస్తకం, చివరన సర్టిఫికెట్ల ప్రధానం జరిగింది. దాదాపుగా 10 గం|| ల పాటు కొనసాగిన కథా కార్యశాల ఎన్నో మెలకువల్ని నేర్పింది. ఎందరెందరితోనూ పరిచయ భాగ్యాన్ని కలగజేసింది.  ఏ ఉద్దేశ్యంతో అయితే కార్యక్రమం నిర్వహించారో అది వందకు వంథాతం నెరవేరిందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ కథా కార్యశాలలో నా కథా సంపుటి ''నయనం ఆలపించి'' అవిష్కరించేందుకు అవకాశం కల్పించిన సాహితీ స్రవంతి వారికి నా ధన్యవాదాలు.- సాహిత్య ప్రకాశ్‌
ఎంతో ఉపయోగం
కథా  కార్యశాల నాకెంతో ఉపయోగపడింది... కథా వస్తువు ఎలా ఎన్నుకోవాలి, ఏ విధంగా రచన సాగాలో, ఎటువంటి కథలు వ్రాస్తే పాఠకులకు దగ్గర కాగలుగుతారో వంటి విషయాలను తెలుసుకోగలిగాను.-ఎస్‌. విజయలక్ష్మి
మంచి ఉత్తేజాన్నిచ్చింది
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు, పరిశోధకులకు, యువ రచయితలకు కథారచన పట్ల అభిరుచిని పెంపొందించవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్నింటిని సాహితీస్రవంతి వారు నిర్వహించాలని కోరుతున్నాను.  -పి. గోపినాథ్‌ రాధోడ్‌
ఒక పాఠక అనుభవం
 
పత్రికలలో 'కథ కార్యశాల' ప్రకటన చూసిన వెంటనే ఒక ఉత్సాహానికి లోనయ్యాను. మొదటి నుండి కథలు అంటే ఇష్టం. కథలు రాయడం మరీ ఇష్టం. అందుకే ఆసక్తి కలిగింది. సాధారణంగా 'సుందరయ్య విజ్ఞానకేంద్రం' పరిసరాల్లో ఒక స్ఫూర్తివంతమైన గాలి వీస్తుంది. అక్కడికి అనేక రకాలయిన పుస్తకప్రియులు సాహితీప్రియులు, పాఠకులు చేరుకుంటారు. అక్కడ భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. అదొక కూడలి. ఎలాంటి ఆలోచనలు లేకుండా ఖాళీ హృదయంతో రాత్రి డ్యూటీ ముగించుకొని, కథ కార్యశాలలో అడుగుపెట్టాను. ఓల్గా ప్రారంభ ఉపన్యాసం నుండి వేంపల్లి షరీఫ్‌ కథ నేపథ్యం కథ పఠనం వరకు అందరి ఉపన్యాసాలు చాలా శ్రద్ధగా విని బయలుదేరాను. రోజు మొత్తం ఉదయం నుండి రాత్రి వరకు పాఠకులు, రచయితలు అందరు చాలా ఓపికతో ఉండడం అసలు నిండు రోజు నిర్వహించిన కథలకోసం కదలకుండా కూర్చునే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా నన్ను లెనిన్‌ ధనశెట్టి ఉపన్యాసం కుదిపివేసింది. చాలా ఉపయోగకరంగా ఉంది. కధాశిల్పం గురించి చాలా విస్తృతంగా వివరించారు.
ఉపన్యాసం ఉత్సాహం ఇచ్చింది
కథ కార్యశాల వ్యక్తిగతంగా నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రతివారు కథకులే. కథలు రాయగలరు, కథలు చెప్పగలరు అనే ఒక స్పృహను కలిగించింది. అనేక భావాలు భావజాలాలు ఉన్నప్పటికి కథలు అంటే ఆసక్తి ఉండి రాయాలి అనుకునేవారికి తొలి పాఠశాలగా, శిక్షణశాలగా ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇలాంటి కార్యశాలలు అనేకం జరగాలి. ఒక స్ఫూర్తిని రగిలించాలి అనిపించింది. కొంత జ్ఞానాన్ని పొందాను అనే అనుభవంతో వెళ్ళిపోయాను మిత్రుడు ఇంద్రవెల్లి రమేష్‌తో కలిసి. -మోతుకూరు శ్రీనివాస్‌