ఊహ - వాస్తవం

  - డా|| దుట్టా శమంతకమణి    
   ''ఇదో ఊహల ప్రపంచం''
   ''అంటే?''
    ''మీ ఆలోచనలకు అక్షర రూపం ఇస్తారు... వాస్తవానికి కాస్త దూరంగా ఉంటారు''.... కథా కార్యశాలకు నాతో వచ్చిన సాకేత్‌ కామెంట్‌ అది.
     పొత్తిళ్లలో తొలిసారిగా నా కళ్ళకు కనిపించిన బిడ్డ రూపమే అగుపించేది ఇన్నాళ్లు. తనదైన ఆలోచనలతో, వ్యక్తిత్వంతో నూనూగు మీసాలతో ఎదుగుతున్న నవయువకుడిగా అనిపించాడు.జన్మనిచ్చింది, ఎంచుకున్న జీవన విధానానికి అనుగుణంగా పెంచుతున్నదీ నేనే. కానీ ఆ కామెంట్‌లో, సమాజ ప్రభావం, ప్రతిదీ వ్యాపార వస్తువుగా మార్చి, వినిమయ సంస్కృతికి ప్రజలను బానిసలను చేస్తున్న మన ప్రస్తుత సమాజం ప్రభావం కూడా భాగమైంది అని నాకు గాఢంగా అన్పించింది.
నాలో గతంలోలేని ఆలోచనల పరంపర. ప్రతి క్షణాన్ని డబ్బు రూపంలోకి మార్చుకుని బ్రతికే చాలామందికి సంగీతం, సాహిత్యం, థియేటర్‌, సమాజసేవంటూ జీవితాన్ని గడిపేవారు, పిచ్చివాళ్లులాగా కాకపోయినా... సంపాదన చేతగాని వాళ్లని ఓ చులకన భావం వుంటుంది. అలాగే... మనిషిగా పుట్టి, బ్రతకడంతోపాటు... జీవించడం తెలిసిన వారికి, అద్భుతంగా గాకపోయినా, అర్థవంతంగా తమ జీవితాలను నడుపుకోవడం తెలుస్తుంది.  రచయితలు, కళాకారులు ఈ కోవలోనివారే.
కథల రచన, ఎంపిక, బహుమతి విధానాల పట్ల, వాదాల కనుగుణంగా అక్షరాలకు అవధులు ఏర్పరచుకుంటున్న రచయితల, రచయిత్రుల పట్ల నాకెన్నో సందేహాలు... పెద్దలెవరైనా పత్రికాముఖంగా చెబుతారా అని చాలా పత్రికల పెద్దలకు గతంలో రాశాను.   స్పందన శూన్యం. నాకు ప్రశ్నలు సంధించడం తెలియలేదు? లేక నా ప్రశ్నలకు జవాబులు లేవా? ఇవి ఇన్నేళ్లూ అంతర్లీనంగా నన్ను పీడించిన సందేహాలు గీబిఖీలి జిలిదీవీశినీ కలిసిందో, లేక సాహితీస్రవంతి వారికి నేటి తరానికి దిశానిర్దేశనం చేయాలనిపించిందో ''కథాకార్యశాల' ప్రకటన కన్పించింది.
సమయం తక్కువ. దూరం ఎక్కువ. బస్సులా... బంద్‌. రైళ్లు.... రెండు నెలల వరకూ ఫుల్‌. జనరల్‌లో అంతంత దూరం ప్రయాణం. అమ్మో ఎలా? భారతీయరైల్వేలో భాగం కాబట్టి... ఎలాగో కష్టపడి రిజర్వేషన్‌ సంపాదించి భాగ్యనగరం చేరాం. నిర్దేశించిన సమయానికి కాస్త అటు ఇటుగా మేము ఆడిటోరియం చేరేసరికి అది ఫుల్‌. ఫీల్‌ గుడ్‌ భావన. అక్షర హాలికులందరిలో మనం కూడా ఒకరం కదా!
  ఎవరి వాదాలు వారివి. ఎవరి పంథా వారిది. ఎంచుకున్న మార్గం వేరైనా చేరే గమ్యం ఒక్కటే. అదే 52 అక్షరాల అమరిక. తెలుగుభాషకు లిపి ఏర్పడిన నాటినుండీ నేటివరకు ఎందరెందరో అక్షరయోధులు సమాజ పరిణామాలు, సాంఘిక దురాచారాలు జాతికి దీపాలవంటి వారి చరిత్రలు, చరిత్ర చీకటిలో       నిశ్శబ్దంగా ఒదిగిన వాస్తవాలు. జీవన పోరాటాలు, జీవిత మాధుర్యాలు, శోకమైనా, శ్లోకమైనా అన్నీ ఆ అక్షరాలలోనే. సందేహాలు, సమాధానాలు, పుంఖాను పుంఖాలుగా కాకపోయినా అనుభవజ్ఞుల స్వానుభావాల నుండీ చాలావరకూ తీరాయి సందేహాలు.
స్వీయకథా విశ్లేషణ... ఆ ఏముంటుందిలే అన్న మనస్సులోని తేలిక భావన తొలగిపోయింది. ఆఖరి సెషన్‌ అన్నింటికన్నా బావుందనిపించింది. కాలాతీతమైనా... కాసిని ముక్కలు చెప్పాలనిపించింది. స్పందన తెలియచేశాము కదా ఇంక రాసేదేముంది అనుకున్న నాకు నా గర్భఫలం చేసిన వ్యాఖ్య... కలవరపరచలేదుగానీ, తరతరాల మధ్య నిరంతరం జరిగే సంఘర్షణ రూపం అనిపించింది. అతిగా కాకపోయినా సాహిత్యాన్ని అప్పుడప్పుడూ చదివే నా కొడుకులాంటి నేటి తరాల ప్రతినిధులకు విజ్ఞానశాస్త్రంతో పాటు మానవ హృదయాల శాస్త్రాల అవసరం ఎంతో ఉందనిపించింది. తోడుగా వచ్చాడుగా అందుకే బహుమతిగా ''వికసిత'' అందించాను. అంత వేగంగా చదువుతాడని ఊహించని నాకు షాక్‌ ఇస్తూ... శ్రద్ధగా చదివి, రెండోరోజు సాయంత్రం... నీలాంటి పేరెంట్స్‌ చెప్పని ఎన్నో విషయాలను ఈ రచయిత చెప్పారు. ఇట్స్‌ గుడ్‌ అన్నాడు. ఓ క్షణం ఆనందం.
వెంటనే మా ప్రపంచం ఊహల ప్రపంచం అన్నావుగా ఇప్పుడేమంటావు అన్నాను? రచయిత కాలానికనుగుణంగా రచన చేశారు. సిద్ధాంతాన్ని, విజ్ఞానాన్ని, ప్రేమను కలిపి చక్కగా చెప్పారు. మా తరానికి కావల్సింది .... ఇలాంటి పుస్తకాలు తప్ప, పుంఖానుపుంఖాలు రాసి సమయాన్ని వృథాచేసే రచనలు కాదు. చేతనయితే నువ్వు కూడా ఆ ప్రయత్నం చేయి అంటూ దుప్పటి ముసుగుతన్నాడు. వాడన్నట్లు నేను రచనలు చేయగలనో, లేదో కాలం నిర్ణయిస్తుంది. కానీ నేటి తరానికి కావల్సిందేమిటో సూటిగా చెప్పాడనిపించింది.
ఇదండీ కథాకార్యశాలకు.... కొడుకుతో వచ్చిన నా అనుభవం.