కవిగా నిలవాలనుకున్నావా? కథ రాయి !

- జంధ్యాల రఘుబాబు
 ''కవిగా నిలవాలనుకున్నావా అయితే కథ రాయి''
ఇది సాహితీస్రవంతి నిర్వహించిన కథా కార్యశాల హాజరయ్యాక నాలో కలిగిన అనుభూతి, ప్రేరణ, అభిప్రాయం.
ఎంతటి కవిగానీ, ఒకరోజు హాయిగా ఒక అంశంపై నిష్ణాతులు మాట్లాడుతూ ఉంటే లోకాన్నంతా మరచిపోయి, అదీ లోకం కోసమేనండీ, వింటూ కూచోవడం చక్కని అనుభూతి. భోజనాలు కూడా ఏర్పాటు ఉంది కాబట్టి దిగులే లేదు.వందల్లో కవితలు, ఇతరత్రా వ్యంగ్య రచనలు, పదుల్లో కథలు, పిల్లల కథలు, ఓ రెండు అనువాదాలు. ఇలాంటి పరిస్థితుల్లో ''కథలు రాస్తేనే కాని కవిగా మనుగడ సాగించటం కష్టం'' అనిపించింది. ఇది నా గొడవ.
కొన్ని ఉపన్యాసాలు బాగున్నాయి. కొన్ని బాగాలేవు అని కొందరనుకోవచ్చు. ఏవైనా అన్నీ కథపైనే కదా! ఇద్దరు కవులు కలిస్తేనే మాటలు, వాదులాటలూ సహజం. అలాంటిది ఒకేసారి వేదికపై అందరు ఉంటే ఇక పరిస్థితేమిటి? జనార్థన మహర్షిగారు, తెలకపల్లి రవిగారు చెప్పిన అంశాలు కథా కార్యశాలకు మంచి రూపునిచ్చాయి, సరిచేశాయి.
''యువత బాగా చెడిపోతుంది, వారిని ఎవరైనా రక్షిస్తే బాగుంటుంది'' అని మిత్రులు, బంధువులు ఏదో ఒక సందర్భంలో మనతో అంటూనే ఉంటారు. ఆ యువతను వెనకేసుకొస్తే ''నీకు  పరిస్థితి పూర్తిగా తెలియదు'' అని కూడా అనవచ్చు. ఇటువంటి వారందరికీ సమాధానం ఈ 'కథా కార్యశాల' దానికి హాజరయిన యువత అందరికీ ప్రేరణ. తమ వద్దకే వచ్చి చెప్పమని సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థుల కోరిక. ఇంతకంటే ఆ ''ముందు యుగం దూతల'' గురించి ఏం చెప్పాలి. ''ఓ బంధుమిత్రుల్లారా, ఇకనైనా యువతపై మీ అభిప్రాయం మార్చుకోండి'' అని చెప్పాలనుంది.
కార్యశాల కాబట్టి వచ్చిన వారితో ఏదైనా క్లాస్‌వర్క్‌లాంటిది చేయించి ఉంటే బాగుణ్ణు అని కొందరన్నారు, లోపల అనుకున్నారు. కానీ ఉపాధ్యాయులుగా అక్కడికొచ్చిన వారి అనుభవాలు విద్యార్థుల అనుభూతి చూసిన తరువాత రేపు సమాజం లోకి వెళ్ళి వారు కచ్చితంగా రాస్తారు. అదే వారి హోంవర్క్‌, క్లాస్‌ వర్క్‌ అనిపించింది. నవలపైనో, నాటకం పైనో కార్యశాల నిర్వహించి వారితో అక్కడికక్కడే ఓ నవల, ఓ నాటకం రాయించగలమా? అన్నారెవరో. వచ్చినవారు తిరిగి తమ ఇళ్ళకుపోయి ఈ కార్యశాల ఇచ్చిన స్ఫూర్తితో రచనలు చేస్తారు. కచ్చితంగా.
'స్వీయ కథల విశ్లేషణ' వినిపించిన ఆరుగురు రచయితలూ తాము ఆ కథ ఎందుకు రాసిందీ, ఎలా రాసిందీ, చెబుతున్నప్పుడు కొందరి స్వరాలు గద్గదంగా మారటం జీవితాంతమూ గుర్తుండిపోయే అనుభవం. నిజంగా కథ రాస్తే ఇలా ఉండాలి. అనిపించింది. ఆ ఆరుగురికీ పేరుపేరునా అభినందనలు. ఏదో సంఖ్య కోసం పుంఖానుపుంఖాలుగా రాయటం అవసరం లేదని కూడా ఆ 'స్వీయ కథా విశ్లేషణ' తెలియజేసింది. ఈ కథా కార్యశాలపై అభిప్రాయం రాస్తూ, అది నిర్వహించిన హైదరాబాదు నగర కమిటీకి అభినందనలు తెలపకుంటే ఏం బాగుంటుంది చెప్పండి! వారికి ప్రత్యేకంగా శుభాభి నందనలు.