కుతూహలాన్ని పెంచిన కార్యశాల

- వల్లభాపురం జనార్దన
 హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రలో 29 సెప్టెంబర్‌ 2013న జరిగిన ''కథా కార్యశాల'' ఔత్సాహిక యువ రచయిత్రులు - యువ రచయితల్లో కథలు రాయగలమనే నమ్మకాన్ని పెంచితే, చేయి తిరిగిన ప్రముఖ రచయితలకు తమ రచనా ప్రయాణంలో మరిచిపోలేని మధురానుభూతిని పంచింది.
నేను కవిని - చాలాకాలం నుండి కవిత్వం రాస్తున్నాను. కథ కూడా రాయాలని అప్పుడప్పుడూ కుతూహలం పుట్టేది. నాలో కథ రాయాలనే కుతూహలం రేగినప్పుడల్లా నాలోని విమర్శకుడు నీవు కథ రాయలేవు. ఆ సత్తా నీకు లేదని మొట్టికాయలు వేసేవాడు. అందువల్ల కథ రాయటాన్ని ఎప్పటికప్పుడు తరువాతి కథ వెండితెరపై చూడండన్నట్లుగా కథారచనా ప్రయత్నానికి కామాలు పెడుతూ ఉండేవాణ్ణి. కథా రచయితను కావాలనే కలను పండించుకోవాలనే పట్టుదల పెరిగి నాలోని విమర్శకుని నోరు మూయించాలనే తపనతో కథా రచనకు శ్రీకారం చుట్టి మూడు నాలుగు కథలు ఆగస్టులో రాశాను. కథల పోటీకి పంపాను. నా ''బహుమతి'' కథకు 2013 నోముల కథా పురస్కారం వచ్చింది. నేను రాసిన కథకు పురస్కారం వచ్చింది కదా ఇంకేం. నేను ప్రముఖ రచయితల జాబితాలో చేరిపోయానని పొంగిపోయి చంకలు గుద్దుకోలేదు. ఎందుకంటే రచనలో నా బలమూ - బలహీనత కూడా నాకు తెలుసు. కథా రచన గురించి నేర్చుకోవాల్సిన విషయాలు అధ్యయనం చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయనే స్పృహ నాకుంది. ఆ దిశగా నేను ప్రయాణం చేయాలనుకుంటున్న సమయంలో ''కాగల కార్యం గంధర్వులు చేశారనే'' నానుడిగా నాకో అవకాశం అంది వచ్చింది. అది సాహితీస్రవంతి ''కథా కార్యశాల'' రూపంలో హిమాలయ శిఖరాన్నెక్కబోతున్నానన్నంత ఆనందంతో కథా కార్యశాలలో పాల్గొన్నాను.
''కథా కార్యశాల'' ప్రారంభ సభాధ్యకక్షులు వొరప్రసాద్‌ పలుకులు కథా రచనావర్షంలో తడవాలనుకున్న నా మనస్సును తొలకరి చినుకుల్లా తాకాయి. సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యకక్షులు - ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి ప్రారంభోపన్యాసం బట్ట తడుపు చినుకుల్లా కాకుండా నా మనసు పొలంలో అదునుకు పదును వానగా కురిసింది.
కథా కార్యశాలలో ప్రముఖ రచయిత్రి ఓల్గా - లెనిన్‌ ధనిశెట్టి, మహమ్మద్‌ ఖదీర్‌బాబు, చంథ్రేఖర్‌ ఆజాద్‌, తెలకపల్లి రవి మొదలగువారు తెలుగు కథాప్రస్థానం - కథా వస్తువు- కథా నిర్మాణం బాలసాహిత్యం రచనకు మెళకువలు - కథా విమర్శ అను అంశాలను బోధించారు. తరువాత కుప్పిలి పద్మ, యాళ్ళ అచ్యుతరామయ్య, రహమతుల్లా, వేంపల్లి షరీఫ్‌, శిరంశెట్టి కాంతారావు, జి. ఉమామహేశ్వర్‌లు కథ రాయడంలో తాము పడిన పురిటినొప్పులను కథ రాసిన తర్వాత పొందిన అనుభూతిని విశ్లేషణాత్మకంగా వివరించారు.
ఉదయం గం||10.30 ని|| లనుండి రాత్రి 8 గం|| దాకా సాగిన కార్యశాల ప్రతి అడుగూ ఉత్తేజాన్ని నింపింది. ప్రముఖ రచయిత్రి ఓల్గా, తెలకపల్లి రవి, లెనిన్‌ ధనిశెట్టి, మహమ్మద్‌ ఖదీర్‌బాబు, చంథ్రేఖర్‌ ఆజాద్‌ల ప్రసంగాలు నాలో నిద్రపోతున్న సృజనాత్మకత అనే బల్బుకు విద్యుత్తువాహం అందించి వెలుగులు చిమ్మడానికి కారణమైన మీటలాగా వ్యవహరించాయి.
తొలి కథకులు బండారు అచ్చమాంబ, గురజాడల నుండి ఆయా కాలాల్లో కథ తిరిగిన మలుపులు ఎదిగిన రూపం  తెలుసుకోవడంతోపాటు ఓ కథా రచయితగా ఇప్పటి పరిస్థితులకు ఎలా స్పందించాలి? ఏం చేయాలి? అన్న అవగాహనను పంచుకొనడంతో పాటు కథా రచనకు కీలకమైన వస్తువు యొక్క ప్రాముఖ్యతను గ్రహించాను. అంతే కాదు. ఉద్యమాలతో మమేకం కాకపోతే ఉబుసుపోక కథలే వస్తాయని సమాజానికి దిశానిర్దేశం చేసే కథలు రావన్నది తెలుసుకున్నాను. చదువరి చదవడానికి ఇబ్బందిపడే విధంగా ఉండకుండా ఆకట్టుకొని చదివించగల వాఖ్యానిర్మాణం అలవరచుకుంటేనే మంచి కథకుడు అవుతాడని కథ ఎలా రాయకూడదో? ఏం రాయకూడదో? రాస్తే ఎలా రాయాలి? అన్న ప్రాథమిక నిర్మాణ సూత్రాలతో పాటు నిరంతర పరిశీలన రచయితకు ఉండాలన్నది నేర్చుకున్నాను.
తెలకపల్లి రవి చెప్పిన విమర్శ అంశాల నుండి కథా రచయిత విలువలకు కట్టుబడి ఉండాలని, సమాజానికి చేటు చేసే వికృత పరిణామాలను ఖండించే తెగువ ఉండాలని, కథను కొత్త పంథాలో చెప్పే ప్రయత్నం చేస్తేనే మంచి కథా రచయిత కాగలదన్న పాఠం నేర్చుకున్నాను.
కుప్పిలి పద్మ, శిరంశెట్టి కాంతారావు, వేంపల్లి షరీఫ్‌ రహమతుల్లా, యాళ్ళ అచ్యుత రామయ్య, జి. ఉమామహేశ్వర్‌ రావుల స్వీయకథా విశ్లేషణలో ఒక కథను రాసే ముందు రచయిత ఎంత ప్రసవవేదన పడితే అంత మంచి కథ వస్తుందన్న విషయం తెలుసుకోవడంతోపాటు వారి అనుభూతుల్లో పాలుపంచుకున్నాను.
మొత్తంగా చూస్తే ''కథా కార్యశాల'' యువ రచయిత్రుల, యువ రచయితలకు కథా రచనా ప్రపంచంలో నడువగల మనోస్థైర్యాన్నీ మెళకువలను అందించడంతోపాటు చేయి తిరిగిన రచయితల్లో కూడా తమ అనుభూతులను పునశ్చరణ చేసుకొని ఇతోధిక పట్టుదలతో కథలను రాయడానికి రీఛార్జ్‌ బ్యాటరీగా పనిచేసిందని అనుకుంటున్నాను. కథా కార్యశాల ప్రయోజనం నెరవేరిందని నిర్వాహకులు మౌనం వహించకుండా విరివిగా కార్యశాలలు నడిపితే కథా సాహిత్యం కొత్త పుంతలు తొక్కే వీలుందని కూడా అనుకుంటున్నాను. అంతే కాదు ఈ కథా కార్యశాల నాలో కథా రచనను ఆపకుండా కొనసాగించాలనే అభిలాషను కలిగించిందనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.  
కథాసూత్రాలు
ఒకే సంఘటన చుట్టూ కథ అల్లుకుపోయి భావంలో భిన్నత్వం రాకుండా ఒక ఐక్యతతో వుండే రచన 'చిన్నకథ'.- కళ్యాణసుందరీ జగన్నాధ్‌
ఒక అవస్థని గానీ, ఒక అనుభవాన్ని గానీ ఒక వైచిత్య్రాన్ని గానీ ఒక మనస్తత్వాన్ని గానీ చిత్రింది కథ.- హితశ్రీ
వాస్తవిక కథా శిల్పమంటే వస్తువుకు విధేయమైన శిల్పం. వస్తువును పాఠకుడి దగ్గరికి చేరవేసే సాధనంగా మాత్రమే పనిచేసే శిల్పం. పాఠకుడు జీవితాన్ని అవగాహన చేసుకోడానికి చేసే ప్రయాణంలో దివిటీగా ఉపయోగపడే శిల్పం. జీవితావగాహనా మహా ప్రయాణంలో కాలికి ముళ్ళ తీగల్లాగా అడ్డుపడని శిల్పం. జీవితంలోని కార్యకారణ సంబంధాలను విప్పిచెప్పే శిల్పం. తాను ఉంటూనే తనను తాను అదృశ్యంగా ఉంచుకునే శిల్పం. వస్తువు ఉనికిని అదృశ్యం చేసే శిల్పం కాదు. ఇది తెలుగు రచయితలకు బాగా ఒంట బట్టిన శిల్పం.-రాచపాళెం చంథ్రేఖర రెడ్డి