- శాంతిశ్రీ
సాహితీ స్రవంతి హైదరాబాద్ నగర కమిటీ నుండి కవిత్వం వర్క్‌షాప్ నిర్వహించాం. ఊహించిన దానికన్నా ఎక్కువమందే వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండీ కొద్దిమంది హాజరయ్యారు. మాకు చాలా సంతోషం వేసింది. ఆ అనుభవంతో కథల వర్క్‌షాప్ కూడా నిర్వహించాలనుకున్నాం.
ఇది కూడా మేము ఊహించిన దానికన్నా, అందులోనూ రాష్ట్రంలో అననుకూల పరిస్థితులున్నా విజయవంతమైంది. ఒకటి కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా సాహిత్య సువాసనలు కలిగిన వాళ్లంతా ఒక్కటే అని మరోసారి నిరూపించారు. రెండోది సాహితీస్రవంతి చేసే కార్యక్రమాలు ప్రయోజన కరమైనవని రుజువైంది. మూడోది సాహిత్యంలో శిక్షణ కోసం నేటి తరం ఎంతగా ఎదురు చూస్తుందో అర్థమైంది.
ఓల్గా, ఖదీర్‌బాబు, లెనిన్ ధనిశెట్టి కథ గురించి కొంత అవగాహన కలిగించారు. మధ్యాహ్నం జరిగిన బాలసాహిత్యంలో కథలు ఎలా రాయాలి? నాటి నేటి పిల్లల ఆలోచనల్లో వచ్చిన మార్పుల్ని వివరించారు చంథ్రేఖర్ ఆజాద్. నేటి పిల్లల ఆలోచనల్లో లాజిక్‌కు అనుగుణంగా నాటి కథల్ని ఎలా రీమేక్ చేస్తుందీ చెప్పారు.
ఆ తర్వాత జరిగిన సెషన్‌లో ఉదయం సెషన్‌లోని లోటుపాట్లను తెలకపల్లి రవి గారు భర్తీ చేశారు. 8 'వి'లతో ఆయన చెప్పిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అంశం కథా విశ్లేషణ అయినా ఆ ఒక్క 'వి' కే పరిమితం కాకుండా కథకు సంబంధించిన మిగిలిన 7 'వి'లను ఆయన సవివరంగా చెప్పారు. దీనితో ఉదయం సెషన్ తర్వాత ఉన్న సందేహాలు కూడా తీరిపోయాయి. చివరిగా సాయంత్రం జరిగిన కథా విశ్లేషణ కథకు ముగింపు ఎంత ముఖ్యమో వర్క్‌షాపు ముగింపూ సెషన్ 'స్వీయ కథా విశ్లేషణ' కూడా అంత ప్రముఖంగా జరిగింది. ఐదుగురు కవులు తమ తమ కథల విశ్లేషణతో కథకు ఎలాంటి కథా వస్తువుల్ని తీసుకోవాలి? కథ నిర్మాణం ఎలా ఉండాలి? నేపథ్యం ఎలా ఉండాలి? తదితర అంశాలన్నీ ఉదయం నుండి విన్న అన్ని సెషన్‌ల సారాంశం దీనికి ఉదాహరణల్లా ఈ సెషన్ నిలిచింది. ప్రతి ఒక్కరి కథ కదిలించేదిగా, సామాజిక దృష్టి కోణం ఉన్నవన్నది గమనించాల్సిన విశేషం.
యాళ్ల అచ్యుతరామయ్య చెప్పిన కథలో పేదరికానికితో బాల్యం ఏవిధంగా బలవుతుందో ఆయన కంటతడితో అందరిలో గుండె తడి కలిగించారు. కుప్పిలి పద్మ నేటి సమాజంలో స్త్రీ కోణం హృద్యంగా విశ్లేషించారు. బారహమతుల్లా తన తండ్రి గురించి కథ రాయడం ద్వారా ఆయన్ని ఎలా జ్ఞాపకం చేసుకుందీ వివరించారు. వేంపల్లి షరీఫ్ తనదైన దృష్టికోణంలో నిత్యజీవితంలో వాళ్ల నాయనమ్మ ఎదుర్కొన్న సాంప్రదాయ సంక్లిష్టతల్ని తన కథలో పేర్కొన్న తీరు వివరించారు. ఆ తర్వాత కథ ప్రచురించక ముందు వాళ్ల నాయనమ్మ చనిపోవడాన్ని తను బాధపడుతూ చెప్పిన తీరు ప్రతి ఒక్కర్నీ కదలించింది. ఒక్కోసారి మన కుటుంబ నేపథ్యంలోంచి కథా వస్తువు తీసుకుంటే ఎదురయ్యే ఇబ్బందుల్నీ ఈ విశ్లేషణలో షరీఫ్ వివరించారు. ఉమామహేశ్వరరావు 'నీటి' గురించిన సామాజిక కోణాన్ని చక్కగా విశ్లేషించారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు... పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక థకు చేరేటప్పటికీ తన పతనాన్ని తాను తవ్వుకుంటుందన్న మార్క్స్ విశ్లేషణకు వాస్తవ రూపం ఈ కథలో మనకు ప్రతిఫలిస్తుంది.
ఒక మహిళ మెట్లపై నుండి పడి, తలకు దెబ్బ తగిలితే నిర్వాహకులు చూపిన శ్రద్దకు ఫేస్‌బుక్‌లో స్పందనను పెట్టారు. ఆమె కూడా చివరి వరకూ ఉండటం, వర్క్‌షాపు ప్రాధాన్యతను స్పష్టం చేసినట్టైంది. ఒక గర్భిణి కూడా నిండు నెలలతో వర్క్‌షాపు మొదటి నుండి అయిపోయే వరకు అంతే శ్రద్ధతో వినడం చూస్తే వర్క్‌షాపు విశిష్టతను వేరే చెప్పాల్సిన పనిలేదు.బోధించిన వారికీ, వినడానికి వచ్చిన వారందరికీ సాహితీస్రవంతి నగర కమిటీ తరఫున పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి వర్క్‌షాపులు మరిన్ని చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించిన మీ అందరికీ వందనాలు.