కథనశాల కొత్తపుంతలు

- సత్యాజీ
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో - కథనోత్సాహం వెల్లివిరిసింది! సాహితీ స్రవంతి నిర్వహించిన 'కథా కార్యశాల' ఔత్సాహిక రచయితల్లో ఉత్తేజం నింపింది. తెలుగు కథ పుట్టిననాటినుంచి ఇప్పటిదాకా ఎన్నెన్ని మలుపులు తిరిగిందీ. ఎన్నెన్ని శిఖరాలు అధిరోహించిందీ కళ్లకు కట్టింది. శైలిలో, నిర్మాణంలో, ఎత్తుగడలో, వస్తు సేకరణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పింది. ఔత్సాహికులకు కథోత్సాహాన్నీ, కథాప్రియులకు కమనీయ అనుభవాన్నీ ఇచ్చింది. తెలుగు  కథావనంలో కొత్తగా గుబాళిస్తున్న యువకథా కారులకు సరికొత్త ఉత్తేజం ప్రసాదించింది.
ఉత్తేజాన్నిచ్చిన స్పందన
దీనికి కొద్దిరోజుల ముందు సాహితీస్రవంతి హైదరబాద్‌ నగర కమిటీ మిత్రుల మధ్య చర్చ. ఏదొక ప్రయోజనకర సాహిత్య కార్యక్రమం నిర్వహించాలనేది ఆలోచన. అప్పటికే సాహిత్యశాల జరిపిన అనుభవం ఉంది. కవితారచనపై కార్యశాల నిర్వహించిన ఉత్సాహం ఉంది.
'ఈసారి కథారచనపై నిర్వహిస్తే ఎలా వుంటుంది.?'
'బాగుంటుంది.'
'ఎంతమంది వస్తారు?'
'ఓ 40, 50 మంది రావొచ్చు. 30 మంది వచ్చినా సక్సెసే!'
'కార్యశాలలో ఏఏ అంశాలుండాలి?'  - ఫలానా ఫలానా.....
'బోధకులుగా ఎవరెవరిని పిలవాలి?' - ఫలానా ఫలానా.....
కథాకార్యశాల నిర్వహించాలనే నిర్ణయం జరిగింది. ఔత్సాహికులను ఆహ్వానిస్తూ పత్రికల్లో ప్రకటనలు... అందుబాట్లో ఉన్న చిరునామాలకు ఆహ్వానపత్రాలు... అంతా వారం రోజుల్లో వెంటవెంటనే..... ఒకరి నుంచి ఒకరికి సమాచారం బట్వాడా అయింది. ఫేసుబుక్కుల్లో, రచయితల బ్లాగుల్లో.... కథాకార్యశాల అందరికీ ఆహ్వానం పలికింది! అన్ని జిల్లాల నుంచి... ముఖ్యంగా రచయితల నగరం హైదరాబాద్‌ నుంచి ఫ్లోన్లలో పేర్ల నమోదుకు మంచి స్పందన వచ్చింది. 80 మంది కచ్చితంగా వస్తారని కార్యశాలకు ముందురోజు వేసుకున్న అంచనాను.... ఇంకో 40 కలుపుకోవొచ్చని కార్యశాలకు గంట ముందు సవరించు కున్నారు నిర్వాహకులు. నమోదు పూర్తయ్యేసరికి ఆ సంఖ్య 202కి చేరింది. వాహ్‌ా.... ఊహించని స్పందన. అంచనాకు అందని అత్యధిక హాజరుతో కార్యశాల సగం సక్సెస్‌...!!
కిటకిటలాడిన 'కథా'ప్రాంగణం
దాదాపుగా ప్రకటిత సమయానికే ప్రారంభ సభ ఆరంభమైంది! లబ్ధప్రతిష్టులు, ఔత్సాహికులు, కథాభిమానులూ హాలంతా నిండుగా ఆశీనులయ్యారు. ఆలస్యంగా వచ్చినవారు ఖాళీ కుర్చీలు కనబడక ఆశాభంగం చెందారు. ప్రారంభ సభకు అధ్యక్షత వహించారు సాహితీ స్రవంతి కార్యదర్శి వొరప్రసాద్‌. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యకక్షులు, ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి ప్రారంభ ఉపన్యాసం చేశారు. అందరినీ కార్యశాలకు సమాయత్తం చేస్తూ.... ప్రవాహంలా సాగింది ప్రసంగం. రచయితల సామాజిక కర్తవ్యాన్ని గుర్తు చేశారు. తెలుగు కథ ప్రస్థానాన్ని, ప్రయోజనకర పాత్రని వివరించారు. జనజీవితం కేంద్రంగా కథ వుండాలని, పదికాలాల పాటు నిలిచేవి ఇలాంటి కథలేనని సోదాహరణంగా చెప్పారు. అలాంటి కథలకు, కథకులకు ఈ కథాకార్యశాల దోహదకారి అవుతుందని ఆశిస్తూ... తొలి పలుకులు ముగించారు.
తరువాత అంశాలవారీగా కథాకార్యశాల మొదలయ్యింది!
తొలి అంశం: కథాప్రస్థానం. వక్త ప్రముఖ రచయిత్రి ఓల్గా 'ఇప్పటి రచయితలు తెలుగు కథ చరిత్ర తెలుసుకోవాలి. ఏ కాలంలో స్పందించారో, ఏఏ ప్రయోజనాలు సాధించాలో  అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమేం చేయాలో అవగతం అవుతుంది' అని ప్రారంభించారు. బండారు అచ్చమాంబ, గురజాడ మొదలుకొని నేటితరం దాకా ఎవరెలా రాశారో వివరించారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క కథలోంచి పరిచయం చేస్తూ... మాట్లాడారు. తెలుగు కథా పరిణామ క్రమాన్ని కళ్లకు కట్టించారు. 'ఇప్పుడు ప్రపంచీకరణ అంతటా భూతంలా ఆవహిస్తోంది. దాని ప్రభావాలను, పర్యవసానాలను రచయితలు అర్థం చేసుకొని - కథలుగా మలచాలి. అదే ఇప్పటి సామాజిక కర్తవ్యం.' అని ప్రబోధించారు. తరువాత కథకుల ప్రశ్నలకు జవాబులు చెప్పారు. 'కథా వస్తువు' అంశంపై రచయిత లెనిన్‌ ధనిశెట్టి మాట్లాడారు. తనకిది తొలి ప్రసంగం అంటూనే లోతైన విషయాలు చెప్పారు. 'కథకు వస్తువు ఆత్మ వంటిది అని నిఘంటు అర్థాలను ఉటంకించారు. 'ప్రజా మాద్యమాలు, ప్రజాజీవితం సజీవమైన కథా వస్తువులను ప్రసాదిస్తాయి. కాబట్టి - వాటితో మమేకం కావడం అత్యవసర' అని నొక్కి వక్కాణించారు. 'ఇప్పుడు చూస్తుండగానే ఆర్థిక విధానాల్లో, సాంకేతిక సౌలభ్యాల్లో అనేక మార్పులు వచ్చేస్తున్నాయి. మన ఆలోచనలు, అధ్యయనం వాటికన్నా స్పీడుగా సాగాలి. అప్పుడే వాటిలోని కథావస్తువుని పసిగట్టి - ప్రతిభావంతంగా రాయగలం. రచయిత తనకు పరిచయం ఉన్న జీవితం గురించి రాయడం ఉత్తమం. స్టీరియో టైపు కథాంశాలు అసలు వద్దే వద్దు.' అని ఉద్బోధించారు. 'కథానిర్మాణం'పై రచయిత మహ్మద్‌ ఖదీర్‌బాబు వివరించారు. పఠనానికి అసౌకర్యంగా లేనిది మంచి నిర్మాణం... ప్రతి వాక్యానికి కళనద్దడం ద్వారా దానిని సాధించవచ్చు.... అని చెప్పారు. ఏం రాయాలి? ఏం రాయకూడదు? ఏం రాయనవసరం లేదు? అనే మూడు అంశాలపై రచయితకు అవగాహన ఉండాలని సూచించారు. మంచి వస్తువు, మంచి శిల్పం కలిస్తే - మంచి కథ అవుతుందని చెప్పారు. నిరంతరం పరిశీలన ద్వారా మంచి కథలను, మంచి కథానిర్మాణాన్ని సాధించవచ్చునని అన్నారు. ఆ తరువాత... ప్రకటిత షెడ్యూల్లో లేని సినీ రచయిత జనార్ధన మహర్షి 11 నిమిషాల పాటు 'సినిమా రచన'పై ఆసక్తిదాయకంగా మాట్లాడారు. ఒకే కథాంశాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా.... 40 మంది 40 కోణాల్లో రాయవచ్చని ఉదాహరణ సహితంగా చెప్పారు. కథ అల్లడం మనిషికి సహజంగా అబ్బిన విద్య అని అన్నారు.
బాలల కథలు... కథా విశ్లేషణలు
తరువాత భోజన విరామం.... బఫే పద్ధతిలో ఆరగిస్తూ... రచయితల పరస్పర పలకరింపులూ పరిచయాలతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం టెర్రాస్‌ కళకళలాడింది. ఎవరి కంచం వారే కడుక్కునే  సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఒరవడి చాలామందికి కొత్తగా అనిపించింది. 'ఇది చాలా మంచి పద్ధతి' అని ఇద్దరు ముగ్గురు రచయితలు వాఖ్యానించారు. మినీ హాలు కిటకిటలాడడం వల్ల, అదనపు కుర్చీలకు అవకాశం లేకపోవడం వల్ల - తరువాత సెషన్‌ ఎస్వీకేలోనే విశాలంగా ఉన్న మరొక హాల్లోకి మార్చారు. ఈ సెషన్లో 'బాలల సాహ్యితంపై జరిగిన సదస్సుకు హైదరాబాద్‌ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి జి. యాదగిరి రావు ఆహ్వానం పలికారు, శాంతిశ్రీ అధ్యక్షత వహించగా, ప్రముఖ రచయిత పి. చంథ్రేఖర్‌ ఆజాద్‌ మాట్లాడారు. 'ప్రతి పౌరుడు రచయితా బాలసాహిత్యం మీదుగానే ప్రయాణిస్తారు. పెద్ద పెద్ద రచయితలంతా ఒకప్పుడు పిల్లల కథా ప్రేమికులే... పిల్లల కథా రచయితలే...' అంటూ ప్రసంగం ప్రారంభించారు. మనం పిల్లలను నిశితంగా పరిశీలించాలి. వారి మాటలూ చేతలూ గమనించాలి. వారు మనకెన్నో కథావస్తువులను ప్రసాదిస్తారు. వాటిని ఆసక్తికరంగా అల్లితే మంచి కథలు తయారవుతాయి.' అని తన అనుభవాలను వివరించారు. 'కథావిమర్శ'పై సాహితీ విమర్శకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ - మంచి కథకు ఏ ఏ లక్షణాలుండాలో చెప్పారు. విధానాలకు, విలువలకు కట్టుబడడం; వికృతాలను ఖండించటం, విభిన్నంగా చెప్పడం రచనకు ప్రయోజనాన్ని చేకూర్చుతాయని వివరించారు. ఏ రచనకైనా క్లుప్తత, స్పష్టత, ఆప్తత అవసరమని పేర్కొన్నారు. అధ్యయనం, నిరంతరం సాధన ద్వారా మంచి కథకులుగా రాణించవచ్చునని విడమర్చి చెప్పారు. తరువాత కథకులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతూ - సంభాషించారు.
మూడో సెషన్‌గా స్వీయకథా విశ్లేషణ సాయంత్రం 5.30 గంటలకు మొదలైంది. కథకులు స్వయంగా తమ కథానేపథ్యాన్ని, కథా నిర్మాణ క్రమాన్ని, తమను ప్రభావితం చేసిన అంశాలను, కథాసృజనకు తాము చేసిన పరిశ్రమను ఆసక్తిదాయకంగా వివ రించారు. మాట్లాడిన ఆరుగురూ ఆరు రకాల అనుభవాలను హృద్యంగా కళ్లకు కట్టించారు. ఈ సెషన్లో రచయితలు కుప్పిలి పద్మ, (టీ జంక్షన్‌), యాళ్ల అచ్యుతరామయ్య (గుప్పెడు గింజలు), రహమతుల్లా (బా), వేంపల్లి షరీఫ్‌ (పర్ధా), శిరంశెట్టి కాంతారావు (అడవి లోపల), జి.ఉమా మహేశ్వర్‌ (వాటర్‌) మాట్లాడారు. స్వీయకథా విశ్లేషణ కథాకార్యశాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి ఆ విభాగానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఉట్టిపడిన యువజనోత్తేజం
202 మంది రచయితలు హాజరైన ఈ కథాకార్యశాలలో దాదాపు సగం మంది యువతీ యువకులు కావడం చాలా మందిని ఉత్తేజపరిచింది. 'ఇది మంచి పరిణామం. ఇంత మంది యువతీయువకులు కథను ప్రేమించటం సంతోషకరం.' అని  సీనియర్‌ రచయితలు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరంలోని విశ్వవిద్యాలయాలనుంచి, వివిధ జిల్లాల నుంచి యువతీయువకులు ఈ కార్యశాలకు హాజరయ్యారు. చాలామంది పత్రికల్లో వచ్చిన ప్రకటన చూసి, కార్యశాలకు రావడం విశేషం. బస్సులు తిరక్కపోయినా అనేక ఇబ్బందులు పడి, రైల్లో, నిద్ర లేని ప్రయాణం చేసి, విజ్ఞానకేంద్రానికి చేరాడు ప్రకాశం జిల్లా పమిడిపాడుకు చెందిన కిశోర్‌. కథారచనపై ఉన్న ఆసక్తితో మహబూబ్‌నగర్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చారు పాతికేళ్ళ ట్రెయినీ డిఎస్పీ నాగేంద్ర... ఇలా ఇంకా అనేకమంది... ఎంతో ఆసక్తితో హాజరై... కార్యశాల ముగిసేదాకా అమితాసక్తితో మమేకమైపోయారు. కథ గురించి తెలిసిన తృప్తితో, కథాసాగరంలో మునిగితేలిన అనుభూతితో, కథామృతాన్ని మనసారా గోలిన పరవశంతో కార్యశాల నుంచి ఆనందంగా వెళ్లారు.
సందేహం లేదు... ఈ కార్యశాల ఇచ్చిన స్ఫూర్తితో, ధారాపాతంగా లోలోపలికి ప్రవహించిన కథనోత్సాహంతో - వచ్చినవారిలో చాలామంది ఈపాటికే కలం పట్టి ఉంటారు. రేపోమాపో ఆ కథలు తెలుగు లోగిళ్లలోకి చేరతాయి. ఈ కథాకథనాలను మనసారా ఆస్వాదించటానికి మనం సమాయత్తం కావాలిప్పుడు. ఉత్తేజ వాతావరణంలో కార్యశాలను ముగిస్తూ - ఔత్సాహికులు ఎవరైన తమ  స్పందనలు తెలపవచ్చు అని నిర్వాహకులు ఆహ్వానించినప్పుడు - వేదిక మీదికి ఉత్సాహంగా వచ్చాడు కె.వెంకటేశ్వర్లు. ' ఇప్పుడు కథ రాయడమంటే భయం పోయింది' అన్నాడు. ఈ స్పందన ఒక్కటి చాలు కదా, కథాకార్యశాల సూపర్‌ హిట్‌ అని చెప్పటానికి....!