కొత్త రచయితలకు కథనశాల దిక్సూచి

కథా రచయితలేగాక కథలు చదివే మామూలు పాఠకులు కూడా తప్పక చదవాల్సిన పుస్తకం కథనశాల ''ప్రస్థానం ప్రత్యేక సంచిక'' అని ప్రజా సాహితి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు అన్నారు. దీనిలో పేరెన్నికగన్న రచయితలు కొడవటిగంటి, పాలగుమ్మి, శ్రీపాద వంటి రచయితల రచనలను పునర్ముద్రించి సాహిత్య అభిమానులకు మేలు చేశారన్నారు. సాహితీ స్రవంతి కృష్ణాజిల్లా శాఖ ఆధ్వర్యాన సంచిక ఆవిష్కరణ ..... గాంధీనగర్‌లోని  ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. సంచికను ముందుగా దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు దేవినేని మధుసూదనరావు ఆవిష్కరించారు. తొలి ప్రతిని శ్రీశ్రీ ప్రింటర్స్‌ అధినేత విశ్వేశ్వరరావు స్వీకరించారు. అనంతరం సంచికను పరిచయం చేస్తు కొత్తపల్లి రవిబాబు మాట్లాడారు. కథనశాలకు తొలుత నిర్వాహకులు అనుకున్న దానికన్నా అధిక స్పందన వచ్చిందన్నారు. లబ్ధి ప్రతిష్టులైన రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని వర్ధమాన రచయితలకు, కొత్త రచయితలకు మంచి సూచనలు చేశారన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌. వెంకట్రావు మాట్లాడుతూ ''కథ అత్యంత ప్రాచీన సాహిత్య ప్రక్రియ, మానవుడు ఊహించడం ప్రారంభించినప్పుడే అది పుట్టింది. అయితే గత కొన్నేళ్లుగా ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి, విధ్వంసం జంటగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కధ అనేది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది''అన్నారు. పదేళ్లుగా సాహితీరంగంలో ప్రస్థానం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. గతంలో వివిధ సాహిత్య అంశాల మీద కార్యశాల (వర్క్‌షాప్‌) నిర్వహించిన సాహితీ స్రవంతి ఈసారి జనకథనం తెలియజెప్పడానికి కథనశాలను హైదరాబాద్‌ శాఖ నిర్వహించిందన్నారు. దీని ఆధారంగానే 'ప్రస్థానం ప్రత్యేక సంచిక'ను వెలువరించామన్నారు. రచయితలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అంతర్జాలంలోనూ, యు ట్యూబ్‌లోను కూడా కథలు అందుబాటులో ఉంచి మంచి కథలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. సంచిక మరో పరిచయకర్త అయిన ఆంధ్రజ్యోతి ఉప సంపాదకులు వడ్లమూడి పద్మ మాట్లాడుతూ కథనశాలలో పాల్గొనలేకపోయిన వారు 'ప్రస్థానం ప్రత్యేక సంచిక' ద్వారా ఆ లోటును పూడ్చుకోవచ్చన్నారు. కొత్తగా కథలు రాసేవారికి ఇది ఒక గైడ్‌గా, దిక్సూచిగా ఉంటుందన్నారు. ముఖ్యంగా ఔత్సాహికులైన కథకులకు చేయి తిరిగిన రచయితలు ఇచ్చిన సూచనలు, సలహాలు అమూల్యమైనవని అన్నారు. ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు ఆత్మీయ సందేశం ఇచ్చారు. సాహితీ స్రవంతి అధ్యకక్షులు రావెళ్ల శ్రీనివాస్‌ వందన సమర్పణ చేశారు.