శాంతిరజనీకాంత్ స్మారక కథా పురస్కారం 2013వ సంవత్సరానికి వేంపల్లి షరీఫ్ 'జుమ్మా', మల్లిపురం జగదీశ్ 'శిలకోల' కథా సంకలనాలకు లభించాయి. పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమం హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో నవంబర్ 15న జరిగింది. కార్యక్రమానికి డా|| నందమూరి లక్ష్మీపార్వతి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రపంచ కథానికాసాహిత్యంలో తెలుగుకథ అత్యంత ప్రాచీనమైనదని, గుణాఢ్యుని 'బృహత్కథ'కు ఆ గౌరవం దక్కుతుందని అన్నారు. ప్రాచీన సాహిత్యం ప్రాచీన సమాజాన్ని అంచనావేస్తే ఆధునిక కథాసాహిత్యం ఆధునిక సమాజాన్ని అంచనావేస్తోందని, అందుకు 'జుమ్మా' 'శిలకోల' కథా సంకలనాలే నిదర్శనం అన్నారు.
విమలాశాంతి సాహిత్య సాంఘిక సేవాసంస్థ కార్యదర్శి, డా|| అంకే శ్రీనివాస్ మాట్లాడుతూ వచన కవిత, కథ ప్రక్రియల పట్ల వున్న అభిమానం వల్ల ఒక సాహితీవేత్తగా వాటిని గౌరవించాలనుకొన్న శాంతినారాయణ ఆలోచన నుండి ఈ పురస్కారం రూపుదిద్దుకొంది అన్నారు. అనంతరం విమలాశాంతి సాహిత్య సాంఘిక సేవాసంస్థ అధ్యకక్షులు, పురస్కార ప్రధాత డా|| శాంతినారాయణ ప్రసంగిస్తూ 'జుమ్మా' ' శిలకోల' సంకలనాలకు పురస్కారం ప్రధానం చేయడం తమకు కల్గిన అదృష్టమన్నారు. 2006 నుండి పురస్కారం ప్రధానం చేస్తున్నామని, ఆ వరుసలో ప్రస్తుత కార్యక్రమం ఎనిమిదవదని తెలిపారు. .
ముఖ్య అతిథి జస్టిస్ చంద్రకుమార్, శాంతి నారాయణ శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారాన్ని ప్రధానం చేశారు. సాహిత్యం హృదయవైశాల్యం పొందడానికి, మానవసంస్కారం పెంపొందించుకోవడానికి ఉపకరిస్తుందని చంద్రకుమార్‌గారు వాఖ్యానించారు.కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పొల్గొన్న ప్రసిద్ధ నాటకకర్త డి. విజయభాస్కర్ మాట్లాడుతూ 'జుమ్మా' 'శిలకోల' కథా సంకలనాలు రెండు భిన్న సమాజాల అస్థిత్వాన్ని గురించి హృదయభాషణం చేశాయని అన్నారు.
పుస్తకాల్ని వి.ఆర్. రాసాని పరిచయం చేశారు. నిసర్గ మనోహరంగా జీవిస్తున్న గిరిజనుల్లో ప్రస్తుతం అస్తిత్వ సమస్య తీవ్రంగా వుందని, వెలుగు ప్రసరించని కొండలోయల్లోకి కథా వెలుగుని ప్రసరించిన కథా సంకలనం. 'శిలకోలా' కాగా, మన పొరుగు సమాజంలోని అనుభూతులకు, సంఘర్షణలకు ఆకృతినిస్తే 'జుమ్మా' సంకలనం అవుతుందన్నారు.ప్రాంతాలు వేరయినా, దేశాలు వేరయినా మనిషి పడే బాధ ఒక్కటేనని గంటేడ గౌరునాయుడు అన్నారు.జి.ఆర్. మహర్షి, బి. ప్రసాదమూర్తి కధకుల్ని అభినందించారు. షరీప్, జగదీశ్ స్పందన ప్రసంగాలు చేశారు.ఈ కార్యక్రమాన్ని విమలా శాంతి సాహిత్య సేవాసంస్థ (అనంతపురం) సమైక్యభారతి (హదరాబాద్) సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి.- డా. అంకే శ్రీనివాస్
రచయితలకు ఆహ్వానం
కడప కవిత విద్యాసాంస్కృతిక సేవాసంస్థ సాహితీ పురస్కారాల కొరకు కవిత్వం. నవల, కథ, ప్రక్రియలలో రచయితల నుండి రచనలు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యకక్షులు అలపర్తి పిచ్చయ్య చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. గురజాడ కథాపురస్కారం రూ.5000, కందుకూరి నవలా పురస్కారం రూ.5000, శ్రీశ్రీ కవితా పురస్కారము రూ. 5000, డా|| కవిత స్మారక పురస్కారము కవిత రూ. 3500, డా|| కవిత స్మారక పురస్కారము కథకు రూ.3500 లు అందించనున్నట్లు తెలిపారు. రచయితలు తమ పూర్తిపేరు చిరునామా సెల్‌నెంబరు వివరాలతో 2003-2013 మధ్యకాలంలో ముద్రించబడిన పుస్తకాలు పంపవలసిందిగా కోరారు. మూడు పుస్తకాలను శ్రీమతి బోయపాటి దుర్గాకుమారి, కార్యదర్శి, ఆర్తి సంస్థలు 42-169, ఎన్‌జివో కాలనీ, కడప -516002, వైయస్‌ఆర్ జిల్లా చిరునామాకు పంపాలి. పుస్తకాల పంపవలసిన ఆఖరు తేది 31-01-2014. ఇతర వివరాలకు 9177013845 నెంబరు ద్వారా సంప్రదించవచ్చును.
హైదరాబాద్‌లోని గోల్డెన్ థ్రెసోల్డ్‌లో డిసెంబర్ 15 న జరిగిన కవిసంగమం పొయెట్రీ ఫెస్టివల్‌లో కవిసంగమం కవుల/కవయిత్రులు కవితల పరిచయ సంకలన ఆవిష్కరణ దృశ్యం. చిత్రంలో పెద్దిరామారావు, కవియాకూబ్, గుజరాతీ కవి శీతయశ్చేంద్ర, కె. శివారెడ్డి, కె. శ్రీనివాస్, అరుణ్‌సాగర్ తదితరులు
యడవెల్లి సైదులు రచించిన 'క్యాంపస్ నానీలు' గ్రంధాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఆచార్య ఎన్.గోపి అవిష్కరిస్తున్న దృశ్యం చిత్రంలో ఆచార్య మసన చెన్నప్ప, కవిసైదులు, కృతి స్వీకర్తలు కవి తల్లిదండ్రులు యడవెల్లి లచ్చయ్య, ఎల్లమ్య, డా|| సూర్యాధనంజయ, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఉన్నారు.
నవంబర్ 21న హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ద్వానాశాస్త్రి కవితాసంపుటి 'మనిషిలోకి ప్రవహించాలి' ఆవిష్కరిస్తున్న కె. శివారెడ్డి. చిత్రంలో గుడిపాటి, ద్వానాశాస్త్రి, జింబో, డా|| పోతుకూచి, కళా దీక్షితులు, డా|| తెన్నేటి సుధాదేవిలను చూడవచ్చు
విజయవాడ రామకోటి ప్రాంగణంలో ఎక్స్‌రే సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ కవి ఎస్. ఆర్ పృథ్వి 26వ రచన ''ఆధునిక తెలుగు కవిత్వంలో తండ్రి - ఒక పరిశీలన'' విమర్శ గ్రంధాన్ని డిసెంబర్ 14న నందిగామ శాసన సభ్యులు తంగిరాల ప్రభాకరరావు గారు ఆవిష్కరిస్తున్న దృశ్యం. ఎక్స్‌రే అధ్యకక్షులు కొల్లూరి, ప్రముఖ కవి, విమర్శకులు డా|| అద్దేపల్లి రామమోహనావు, గ్రంధ రచయిత ఎస్.ఆర్. పృధ్వీ, ప్రముఖ న్యాయవాది గొట్టిపాటి మురళీ మోహనరావు, ప్రముఖ రచయిత జూలూరి గోపాలకృష్ణమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ ఘంటా వినయకుమార్, విమర్శకులు ఎ.బి.ఆనంద్, వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు, హజరత్తయ్య గుప్త, తదితరులు పాల్గొన్నారు.
వైయస్‌ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో ముద్దనూరు రోడ్డు సాయిబాబా దేవాలయం ధ్యానమందిరంలో సింహపురి సాహితీ సమాఖ్య పర్యవేక్షణలో నవంబర్ 9న జరిగిన కవి సమ్మెళనం. చిత్రంలో కేంద్రసాహిత్య సలహామండలి సభ్యులు రాచపాళెం చంథ్రేఖర్ రెడ్డి, సింహపురి సాహితీ సమాఖ్య కార్యదర్శి గుర్రాల రమణయ్య సింహపురి సాహితీ సమాఖ్య అధ్యకక్షులు గణపం రాజగోపాల్‌రెడ్డి, పూల చలపతి, ప్రసంగిస్తున్న యద్దల లలిత,
కథల పోటీ విజేతలు
విడదల నీహారిక ఫౌండేషన్ - సాహితీకిరణం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 2014 సంక్రాంతి కథల పోటీలో విజేతలు. ప్రథమ బహుమతి - రూ|| 2000/- అద్దెఇల్లు , - బి. కళాగోపాల్, నిజామాబాద్, ద్వితీయ బహుమతి రూ|| 1500/- ఏమనుజుడైననేమి ఎవ్వడైననేమి, యం.వి.ఆర్. సత్యనారాయణ మూర్తి, పెనుగొండ, తృతీయ బహుమతి రూ|| 1000/- అమ్మగా ఇప్పుడు, వడలి రాధాకృష్ణ, చీరాల, ప్రోత్సాహాక బహుమతులు రూ|| 500/-, 1. మమతల మాటున నీడలు; ఉరిమళ్ళ సునంద, ఖమ్మం, 2. అందరివాడవయ; పోలా ప్రగడ జనార్దనరావు, హైదరాబాద్, 3. పల్లెకు పోదాం; తాటికోల పద్మావతి, గుంటూరు.ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా సుధామ వ్యవహరించినట్లు నిర్వాహకులు తెలిపారు.