జాతి జనులకు విజ్ఞానం, వికాసం పంచే పుస్తక ప్రదర్శనలు, మేళాలు... నేటి ప్రపంచీకరణ యుగంలో ఎంతో అవసరం. 1983లో కేవలం పాతిక స్టాళ్లలో ప్రారంభమైన హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ ఈ సంవత్సరం (2013) 380 స్టాళ్లతో నేషనల్ బుక్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో ఎన్‌టిఆర్ గ్రౌండ్స్‌లో (దోమలగూడ) డిసెంబర్ 7 నుంచి 15 దాకా భారీ ఎత్తున జరిగింది.
ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా సాహితీ స్రవంతి హైదరాబాద్ నగర కమిటీ స్టాల్ నుం. 365లో 'అక్షరాంజలి' పేరిట ఓ ఛాయాచిత్ర ప్రదర్శనశాల ఏర్పాటు చేసింది. అమరులైన సాహితీమూర్తుల జనన మరణాలు, రచనల గురించి క్లుప్త సమాచారంతో 300 కి పైగా ఫొటోలు ప్రదర్శించారు. గోర్కీ, పుస్కిన్, టాల్‌స్టాయ్, గోగుల్, బ్రెహ్టా, రస్సెట్, జాన్‌లండన్, జీవన్‌పాల్ సార్త్రే, హోవర్ట్‌ఫాన్డ్ లాంటి అంతర్జాతీయ సాహితీవేత్తలు, ఠాగూర్, ప్రేమ్‌చంద్, సుబ్రహ్మణ్య భారతి, అబ్బాస్, గోవింద్ నిహలానీ, ఫైజ్ అహ్మద్‌ఫైజ్ వంటి జాతీయ సాహితీమూర్తులు; శ్రీశ్రీ, గురజాడ, కందుకూరి, చలం, కాళోజి, దాశరథి, ఆళ్వార్‌స్వామి, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, విద్వాన్ విశ్వం, మల్లాది, పాలగుమ్మి, అచ్చమాంబ, జ్వాలాముఖి, విశ్వనాథ, ఆరుద్ర, ఆత్రేయ, రావూరి భరద్వాజ, వల్లంపాటి, కొడవటిగంటి, రావిశాస్త్రి వంటి తెలుగు తేజోమూర్తుల ఛాయాచిత్రలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. ఈ ప్రదర్శన తిలకించాక ఎంతోమంది భరద్వాజ 'పాకుడురాళ్లు' గురించి అడిగి తెలుసుకొని, ఆ నవల కొనుగోలు చేయడం విశేషం. మాజీ డిఐజి హెచ్‌జె దొర, మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, సినీ రచయిత చంద్రబోసు, జెకె. భారవి, మురారి, ద్వానాశాస్త్రి సుధామ, రఫీ (ఎడిటర్ కళ), కృపేందర్, ఎస్‌వి సత్యనారాయణ, కాత్యాయని లాంటి ప్రముఖులెందరో ఆ స్టాల్‌ను సందర్శించారు.
అలరించిన జనకవనం
బుక్‌ఫెయిర్ వేదికపై డిసెంబర్ 10వ తేదీన దాదాపు 34 మంది కవులతో 'అక్షరం'అంశంపై జనకవనం జరిగింది. సాహితీ స్రవంతి హైదరాబాద్ నగర కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి సుధామ ముఖ్య అతిథిగా హాజరు కాగా, తంగిరాల చక్రవర్తి జన కవనాన్ని నిర్వహించారు. అక్షరం ప్రాధాన్యతనూ, ప్రభావశీలతనూ కవులు అద్భుతంగా ఆవిష్కరించారు. కెంగారి మోహన్, శాంతిశ్రీ, చక్రవర్తి, ఇంద్రవెల్లి రమేష్, కిషోర్, మన్మోహన్, ఎస్ విజయలక్ష్మి, కేతవరపు రాజశ్రీ, పొత్తూరి సుబ్బారావు, ఎస్.వెంకట్, కె.వి. మౌన, శ్రీమల్లిక్, డా. పూసల రజనీ గంగాధర్, శశి, జెన్నీ, అరుణకుమారి, కె.కామేశ్వరరావు, పందెళ్లపల్లి, సాహిత్య ప్రకాష్ తదితరులు కవితాగానం చేశారు. సాహితీ స్రవంతి నిర్వహించిన కథాకార్యశాల ప్రత్యేక అంశాలతో వెలువడ్డ ప్రస్థానం ప్రత్యేక సంచికను బుక్‌ఫెయిర్ వేదికపై ఆవిష్కరించారు. ఈ సభలో అంపశయ్య నవీన్, మునిపల్లిరాజు, తెలకపల్లి రవి, కె.పి. అశోక్ కుమార్, కె. లక్ష్మయ్య, తదితరులు పాల్గొని సంచిక ప్రత్యేకతలను, ఆవశ్యకతను వివరించారు.
రోజు 50, 60 వేల మంది సందర్శకుల తాకిడితో బుక్‌ఫెయిర్ గొప్ప విజయవంతం అయింది. పార్కింగ్, ట్రాన్స్‌పోర్టు సౌకర్యాలు గల ఈ గ్రౌండ్స్‌లోనే ఇకపై పుస్తక మేళాలు జరపాలని పలువురు పెద్దలు నిర్వాహకులకు సూచించారు. గతంలో ఈ ప్రదర్శన నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు విభాగ సంపాదకులు డాక్టర్ పత్తిపాటి మోహన్ పర్యవేక్షణలో ఈ ఏడాది బుక్‌ఫెయిర్ సాగింది. లక్షలాదిమందికి అక్షర లక్షలను పంచి, అలరించింది.- తంగిరాల చక్రవర్తి