ప్రపంచీకరణ యుగంలో ఇల్లే మార్కెట్‌గా మారిందని, స్త్రీ వ్యాపార, విలాస వస్తువుగా మార్చబడిందని ప్రముఖ రచయిత్రి శిలాలోలిత విమర్శించారు. సాహితీస్రవంతి హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని షోయబుల్లా హాలులో నవంబరు 30న గురజాడ సంస్మరణ సభలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా నాటి పుత్తడిబొమ్మ పూర్ణమ్మ నుంచి నేటి నిర్భయ, అభయలపై సాగుతున్న దాష్టీకంపై జనకవనం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురజాడ స్త్రీల బాధలను పూర్ణమ్మ రూపంలో చూపెట్టారని, కానీ నేటికీ నిర్భయలు, అభయలు కనిపిస్తూనే ఉన్నారని, స్త్రీలపై జరుగుతున్న దాడులు, దాష్టీకాల్లో ఏమీ తేడాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీ సమస్యను ఎక్కడ స్పృశించినా రక్తమోడుతున్న గాయాలే అగుపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇల్లు మార్కెట్‌గా మారిపోయాకా కట్నం కామన్ స్టేటస్ సింబల్‌గా మారిపోయిందని విమర్శించారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారాయన్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరగాలని, పెంపకంలోనే మార్పు రావాలని అన్నారు. ఇంట్లో నీచమైన పనులన్నీ ఆడపిల్లలతో చేయించడం సహజమైపోయిందన్నారు. రోజువారి వ్యవహారాల్లో మనల్ని మనం సంస్కరించుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. ముఖ్యంగా సినిమా సంస్కృతి మానవ జీవితంలో విషమ పాత్ర పోషిస్తోందన్నారు. కొట్టినా తిట్టినా స్త్రీ పడుండాలన్న మెస్సేజ్‌ను సినిమాల ద్వారా యువతకు ఎక్కిస్తున్నారని, దీని ప్రభావం ఫలితంగానే ఎక్కువ నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని చెప్పారు. మృగాల దాడికి గురైన అభయలు దాడిగా చూడాలి తప్ప, దాంతో అవమాన భారంతో బతకడమే దండగ, కుచించుకుపోయి, ముడుచుకుపోయి ఉండడం తగదన్నారు. ధైర్యంగా బతకడం నేర్చుకోవాలని, విద్యా విధానంలో కూడా మార్పు రావాలని సూచించారు. ప్రభుత్వాలు కూడా స్త్రీని ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని విమర్శించారు. సాహితీస్రవంతి నగర కమిటీ సంయుక్త కార్యదర్శి తంగిరాల చక్రవర్తి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సాహితీస్రవంతి నగర కమిటీ సభ్యురాలు శాంతిశ్రీ జనకవనం నిర్వహించారు. 'ఆడపిల్లకు కావాల్సింది ఆభరణాలు కాదు- ఆయుధం' అంటూ ఆడపిల్ల పెంపకంపై కవయిత్రి దుర్గాప్రసన్న రాసిన కవిత సభికులను ఆకట్టుకుంది. దేశంలో జరుగుతున్న దారుణాలపై మోపిదేవి రాధాకృష్ణ రాసిన వ్యంగ్య కవిత నవ్వులు పూయించింది. పోగొట్టుకున్న వాటిని రాబట్టుకోవాలంటే పోరాటమే మార్గమంటూ మహేష్‌దుర్గే కవిత్వం ఆలోచింపచేసింది. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, ఉన్నోళ్లకు చట్టాలు చుట్టాలుగా మారిన తీరు తదితర అంశాలపై పలువురు తమ స్వీయ కవితలను వినిపించారు. ఈ కార్యక్రమానికి సాహితీస్రవంతి నగర కమిటీ ప్రధాన కార్యదర్శి జి. యాదగిరి రావు స్వాగతం పలికారు. సాహితీస్రవంతి నగర కమిటీ ఉపాధ్యకక్షులు గేరా వందన సమర్పణ చేశారు.