'పుట్టుక నీది చావు నీది బతుకంతా లోకానిది' అంటూ అల్పక్షరాల అగ్నివర్షాన్ని కురిపించిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని ఆంధ్ర సారస్వత ప్రాశ్చ్యకళాశాల పూర్వ ప్రిన్సిపాల్ మోతుకూరి నరహరి అన్నారు. సాహితీస్రవంతి హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని షోయబుల్లా హాల్‌లో కాళోజి శతజయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాళోజీ నారాయణరావు నిర్మోహమాటంగా మాట్లాడేవారని, ప్రజల గురించి, ప్రజల భాషలో ప్రజల కోసం కవిత్వం రాశారని అన్నారు. నిశిత సత్యాలను తన కవిత్వం ద్వారా ప్రపంచానికి చాటిన కవి అని కొనియాడారు. యుక్తవయసులోనే కాళోజీపై ఉద్యమాల ప్రభావం పడిందని అన్నారు. రజాకార్ల దాష్టీకానికి వ్యతిరేకంగా, భాషా ఉద్యమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. ఆయనను కొందరు ప్రాంతానికి పరిమితమైన కవిగా చూడడం బాధేస్తోందని అన్నారు. అనంతరం సాహితీస్రవంతి నగర కమిటీ ఉపాధ్యకక్షులు, కవి గేరా ఆధ్వర్యంలో జనకవనం జరిగింది. ఈ జనకవనంలో పలువురు కవులు తమ కవితలను వినిపించారు. 'అందరివాడు కాస్త కొందరి వాడు అయ్యాడన్న' కేతవరపు రాజ్యశ్రీ కవిత సభికుల్ని ఆకట్టుకుంది. 'కాలంతోపాటు మనమూ మారాలన్న' మహేశ్ దుర్గే రాసిన కవిత, 'సువిశాలమైన ప్రపంచంలోకి సంకెళ్ళు తెంచుకురమ్మని' ఆహ్వానిస్తూ జి. రాజకుమారి కవిత అందర్నీ ఆలోచింపచేశాయి. జి. నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభ జి. మోహనకృష్ణ వందనసమర్పణతో ముగిసింది.