ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహించడం, సామాజిక చైతన్యానికి దోహదపడటమే పరమావధిగా సాహితీస్రవంతి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మునిపల్లె రాజు అన్నారు. సాహితీస్రవంతి ఆధ్వర్యంలో వెలువడుతున్న సాహిత్య ప్రస్థానం మాసపత్రిక ప్రత్యేక సంచిక 'కథనశాల'ను హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రాంగణంలో డిసెంబరు 10న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక సంచికను చదివితే కథలు రాయటానికి భయపడే నూతన రచయితలు భయరహితులవుతారని అన్నారు. ఈ ప్రత్యేక సంచికలో కథాంశాలకు ప్రాముఖ్యతనిచ్చారని అన్నారు. కథాసాహిత్యం మీద అనేక వ్యాసాలు ఈ సంచికలో ఉన్నాయని అన్నారు. ఇది నూతన కథా రచయితలకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాహిత్యప్రస్థానం సంపాదకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో కథ కూడా కొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వివిధ పార్టీలు ఢిల్లీలో ఒక కథను, హైదరాబాద్‌లో మరో కథను నడుపుతున్నాయని చెప్పారు. ఒక పార్టీ అధ్యకక్షుడు ఒక కథ వినిపిస్తే, ఆ పార్టీ ప్రతినిధులు ఆయ ప్రాంతాల్లో మరో కథను వినిపిస్తూ ప్రజల్ని గందరగోళంలో పడేస్తున్నారని తెలిపారు. వ్యదార్థ జీవితాలు, యదార్థ గాథలు మనకు రోజూ తారసపడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో సాహిత్య ప్రస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన 'కథా కార్యశాల' లో కథలపై విస్తారమైన చర్చ జరిగిందని అన్నారు. పుస్తకాన్ని పరిచయం చేసిన ప్రముఖ విమర్శకులు కెపి అశోక్ కుమార్ మాట్లాడుతూ కథనశాలను ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరముందని చెప్పారు. ఇది నూతన రచయితలకు ఒక రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుందని అన్నారు.
కాళోజి శతజయంతి ప్రసంగం
ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతిని పురస్కరించుకుని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ఇదే సభలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై జీవితాంతం ప్రశ్నించిన కవి కాళోజీ అని చెప్పారు. 'ఆధిపత్యాన్ని ఎదిరించిన వాడు నాకు ఆరాధ్యుడు' అని చెప్పిన కాళోజీ ఆధిపత్య భావజాలం ఎక్కడున్నా ప్రశ్నించేవారని అన్నారు. ఒక వ్యక్తికి డబ్బు, హోదా, అధికారం ఉంటే సరిపోదు, అతనిలో మానవత్వం ఉన్నప్పుడే అతడు నిజమైన మనిషంటూ ఆయన పదేపదే చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. సామాన్య మానవుడికి సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో దీర్ఘ సమాసాలు, అలంకారాలు, చందస్సు లేకుండా చిన్న చిన్న పదాలతో కవిత్వం రాసిన కాళోజీ, ఎవరకీ భయపడకుండా స్వేచ్ఛగా జీవించారని అన్నారు. ఒక వ్యక్తి తన అభిప్రాయాలను, భావాలను నిర్మోహమాటంగా వ్యక్తపరిచే స్వేచ్ఛ అతడికి ఉండాలంటూ కాళోజీ కోరుకునేవారని చెప్పారు. తెలకపల్లి రవి మాట్లాడుతూ భౌతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కలుషితమైన నేటి సమాజానికి సాహిత్యమనేది దిక్సూచిలాగా పనిచేస్తుందని అన్నారు. ఉన్నతమైన, ఉత్తమమైన, ఉత్తేజితమైన సాహిత్యం సమాజ గమనాన్ని మారుస్తుందని చెప్పారు. ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో తెలుగుజాతిని ముందుకు నడిపించేందుకు కాళోజీ రచనలు ఒక దివిటీలాగ పనిచేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సినీ రచయిత జనార్దన మహర్షి, కథా రచయిత బారహమతుల్లా, మహ్మద్ ఖదీర్‌బాబు, సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి వొరప్రసాద్, ప్రజాశక్తి బుక్‌హౌస్ మేనేజర్ కె. లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు-2013 విజ్ఞప్తి
ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు -2013 కోసం రాష్ట్రంలోని కవులనుండి కవితాసంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు అవార్డు వ్యవస్థాపకులు డా|| రాధేయ ఒక ప్రకటనలో తెలియజేశారు. అవార్డు పరిశీలన కోసం 2013 సం||లో ప్రచురింపబడిన కవితాసంపుటాలను మాత్రమే పంపాలని కోరారు. ఎంపికైన ఉత్తమ కవితా సంపుటికి మూడువేల రూపాయలు నగదు, షీల్డుతో కవికి సత్కారం వుంటుందని, తేది:28-2-2014 లోగా 4 ప్రతులు డా|| రాధేయ, కవితానిలయం, 13-1-606-1, షిర్డినగర్, రెవిన్యూకాలనీ, అనంతపురం - 515001. అనే చిరునామాకు పంపాలి. ఇతర వివరాలకు 9985171411 ద్వారా సంప్రదించవచ్చును.
కవితల పోటీ విజేతలు
గుదిబండి కళాపీఠం, సాహితీకిరణం శ్రీజయనామ సంవత్సర ఉగాది సందర్భంగా కవితల పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు గుదిబండి వెంకటరెడ్డి, పొత్తూరి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ బహుమతి రూ|| 1500/-, ద్వితీయ బహుమతి రూ|| 1000/-, 5 ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కటి రూ|| 500/- చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు.హైదరాబాద్‌లో జరిగే సభకు విచ్చేసి విజేతలు బహుమతులు అందుకోవాలని కోరారు. తేది 31.01.2014 లోపు కవితలను సాహితీకిరణం, ఇం.నెం. 11-13-154, అలకాపురి, రోడ్ నెం. 3, హైదరాబాద్ - 500 035 చిరునామాకు పంపించాలి. ఇతర వివరాలకు 9490751681 ద్వారా సంప్రదించవచ్చును.