'కథనశాల' ఆవిష్కరణ

    సాహిత్య ప్రస్థానం నవంబర్‌& డిసెంబర్‌ 2013 ప్రత్యేక సంచిక 'కథనశాల'కు విశేష స్పందన వచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ జరిగింది. విశేషాలు....
    విజయనగరంలో జనవరి 2న గురజాడ స్వగృహంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యాన 'చాసో వర్థంతి సభ, సాహిత్య ప్రస్థానం 'కథనశాల' పుస్తకావిష్కరణ సభ జరిగాయి. ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ప్రముఖ కథా రచయిత పంతుల జోగారావు మాట్లాడుతూ తెలుగుకథకు, నాటకానికి ఈ ప్రాంతం పెట్టింది పేరన్నారు. గురజాడ, చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు వంటి రచయితలు ఉత్తరాంధ్ర సాహిత్యానికి ఎనలేని సేవ చేశారన్నారు. అయితే నవలా వికాసం ఉత్తరాంధ్రలో జరగలేదన్నారు. 1960 దశకంలో మంచి సాహిత్యం వెలువడిందన్నారు.రాష్ట్ర సాహితీస్రవంతి వెలువరించిన 'కథనశాల' పుస్తకాన్ని పరిచయం చేసిన విశాఖ సాహితీ స్రవంతి సభ్యులు సత్యాజీ మాట్లాడుతూ రచనలపై ఆసక్తి ఉండే ఔత్సాహికులకు ఎంతగానో తోడ్పడే విధంగా కథనశాల ప్రత్యేక సంచికను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఏయే సామాజిక పరిస్థితుల్లో తెలుగు కథ ఎలా పరిణామం చెందిందన్నదే దీంట్లో ప్రధానంగా ఉందన్నారు. చాసోపై ఉపన్యాసం చేసిన శ్యామల గోదావరి శర్మ మాట్లాడుతూ చాసో కథల్లో మానవీయ విలువలు కనిపిస్తాయన్నారు. 'ఇంపు' కుంకుడాకు, వాయులీనం వీటికి తార్కాణం అన్నారు. చాసో కథలు చదివితే అందులోని సారం మనిషిని సాహిత్యం వైపు మరలేలా చేస్తాయన్నారు. సాహితీ స్రవంతి కన్వీనర్‌ చీకటి దివాకర్‌ ఆధ్వర్యాన సాహితీ స్రవంతి కో - కన్వీనర్‌ ఎస్‌విఆర్‌ కృష్ణారావు అధ్యక్షతన సభ జరిగింది. పట్టణానికి చెందిన ప్రముఖ కవులు, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు. చిన్నారి కీర్తి ఆలపించిన 'పాపగారు ఎందుకింత బాగున్నారు' అన్న పాట సభికుల్ని ఆకట్టుకుంది.

    కర్నూలులో కార్మిక కర్షక భవన్లో కథనశాల ఆవిష్కరణ సభ జనవరి 14వ తేదీన జరిగింది. సభకు అధ్యక్షత వహించిన జంధ్యాల రఘుబాబు తొలిపలుకుల్లో సాహిత్య ప్రస్థానం కథనశాల ప్రత్యేక సంచిక ద్వారా ఓ నూతన ప్రయోగాన్ని చేసిందన్నారు. కథకు సంబంధించిన వివిధ అంశాలు ఒకే చోట చేర్చటం వల్ల పాఠకులకు మంచి ఉపయోగమన్నారు. దీనివల్ల కథ గురించిన ఇంకొన్ని మెళకువలు తెలుసుకోవాలన్న స్ఫూర్తి కలుగుతుందన్నారు. ఇందులోని స్వీయ కథా విశ్లేషణలు రచయితలు పడ్డ శ్రమను, వారి రచనా పాటవాన్నీ తెలియజేస్తామన్నారు. ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ప్రముఖ రచయిత ఇనయతుల్లా మాట్లాడుతూ సాహితీ స్రవంతి ప్రయత్నాన్ని ప్రశంసించారు. కథనశాల కూడా ప్రజలకు పరిచయం చేయడం హర్షించవలసిన విషయమన్నారు. సాహిత్యం మీద ప్రపంచీకరణ ప్రభావం ఎలా ఉందో, కథపై కూడా ఉందన్నారు. కర్నూలు జిల్లాలో 1918 లోనే గాడిచర్ల హనుమంతరావు కథ రాశారని, కర్నూలు జిల్లాలో కథా సాహిత్యానికి కొదువలేదు'' అన్నారు. కర్నూలు జిల్లాలోని యాసలో వచ్చిన కథలు వాస్తవికతను, ప్రజల కష్టాలను ప్రతిబింబించాయన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత అజీజ్‌ మాట్లాడుతూ ఎప్పటిలాగే సాహితీ స్రవంతి మంచి ప్రయత్నం చేసిందన్నారు. కథనశాల రచయితలకు, రచయితలుగా కాగోరే వారికి ఓ కరదీపికగా ఉండగలదన్నారు. ఇందులోని మెళకువలు పాటిస్తూ సాధన చేస్తే మంచి  రచయితలు కాగలరన్నారు. మనిషి తన భావాలను ఇతరులతో పంచుకోవాలనుకోవటమే ఆలోచనే కథ రాయటానికి దారి తీస్తుందన్నారు. కథాంశంలో మంచి పట్టు ఉంటే కథలు రసవత్తరంగా ఉంటాయన్నారు. కెంగార మోహన్‌ మాట్లాడుతూ యువత కథ రాసే ప్రయత్నం చేయటం ముఖ్యమన్నారు. కథనశాలను ఉపయోగించుకుని మంచి రచనలు చేసే వీలుందన్నారు. స్వీయ కథా విశ్లేషణలోని కథల్ని ప్రస్తావించారు. అనంతరం సంక్రాంతి సందర్భంగా రైతుకవనం జరిగింది. అందులో పదవ తరగతి విద్యార్థి  హర్ష చదివిన కవిత అందరినీ ఆకర్షించింది. ఉపాధ్యాయులు నాగమణి, విజయసారధి, డా|| రమాదేవి, మహేష్‌, డా|| కళామురళి, కెంగార మోహన్‌ తదితరులు కవితలు చదివారు. ఈ మధ్య పదవీ విరమణ చేసిన తెలుగు అధ్యాపకులు, సాహితీ స్రవంతి జిల్లా కమిటీ సభ్యులు డా|| కళామురళి కి సన్మానం జరిగింది. ప్రముఖ రచయిత వియోగి, జంధ్యాల రఘుబాబు శాలువా కప్పి సన్మానించారు.  పులిచేరి మహేష్‌ వందన సమర్సణతో కార్యక్రమం ముగిసింది.

ఖమ్మంలో రచయిత సమాజంతో మమేకం అయితేనే రచనకు సార్థకత ఉంటుందని ప్రముఖ కథారచయిత శిరంశెట్టి కాంతారావు అన్నారు. ఖమ్మం పట్టణంలో హరీష్‌ మెమోరియల్‌ గ్రంథాలయంలో జనవరి 5న సాహితీస్రవంతి ఆధ్వర్యంలో సాహిత్య ప్రస్థానం ప్రత్యేక సంచిక 'కథనశాల' ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఆయన మాట్లాడుతూ వర్తమాన సామాజిక స్థితిగతులపై రచయితలకు అవగాహన ఉండాలన్నారు. కథ, కవిత, పాట ఏ సాహిత్య రూపమైనా వాస్తవికత ముఖ్యం అన్నారు. ప్రజల సమస్యలను దగ్గరనుంచి గమనించటం ద్వారా సాహిత్య అంశాలను ఎంచుకోవాలన్నారు. తాను ఇదే తరహాలో రచనలు చేయటం వల్లే పాఠకులు, సాహితీవేత్తల అభిమానం పొందగలిగానన్నారు. వర్ధమాన కథా రచయితలకు రచనా మెళుకువలు తెలియజేసేలా సాహితీస్రవంతి హైదరాబాద్‌ కమిటీ నిర్వహించిన కథా కార్యశాల విజయవంతమైందన్నారు. ఆ వర్క్‌షాప్‌ మెటీరియల్‌తో సాహిత్య ప్రస్థానం 'కథనశాల' ప్రత్యేక సంచికను ప్రచురించడం అభినందనీయమన్నారు. ఇటువంటి పుస్తకాలు నూతన రచయితలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య ప్రస్థానం సంపాదక వర్గ సభ్యులు కె. ఆనందాచారి, సాహితీస్రవంతి ఖమ్మం జిల్లా గౌరవాధ్యక్షులు మండవ సుబ్బారావు, కార్యదర్శి రౌతురవి, కన్నెగంటి వెంకటయ్య, కపిల రాంకుమార్‌, వురిమళ్ళ సునంద తదితరులు పాల్గొన్నారు.

     విశాఖలో సాహితీస్రవంతి విశాఖపట్నం ఆధ్వర్యంలో జనవరి 12న ద్వారకానగర్‌లోని పౌరగ్రంథాలయంలో సాహిత్య ప్రస్థానం ప్రత్యేక సంచిక 'కథనశాల' ఆవిష్కరణ సభ జరిగింది. సాహితీస్రవంతి విశాఖ కమిటీ సభ్యులు ఎ.వి. రమణారావు స్వాగతం పలుకగా గౌరవ అధ్యక్షులు ఎన్‌. రమణాచలం సభకు అధ్యక్షత వహించారు. శాసనమండలి సభ్యులు ఎం.వి.యస్‌. శర్మ, ప్రముఖ సాహితీవేత్త రామతీర్థ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కథనశాల ప్రత్యేక సంచికను ఎం.వి.యస్‌. శర్మ ఆవిష్కరించి మాట్లాడుతూ కథలు వ్రాసే యువరచయితలకు వర్క్‌షాప్‌ నిర్వహించి, ఆ అంశాలతో ప్రత్యేక సంచికను తీసుకురావడం ముదావహం అన్నారు. ఇదే ప్రయత్నం విశాఖలో జరపాలని కోరారు. అనంతరం రామతీర్థ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి కథల వర్క్‌షాప్‌ నిర్వహించడమే గాక, అతి త్వరలో దానిపై ప్రత్యేక సంచికను తీసుకురావడం శ్లాఘనీయం అన్నారు. కథనశాల ప్రత్యేక సంచికలోని వ్యాసాలను పరిచయం చేస్తూ కథాసాహిత్యంలో వస్తున్న మార్పులపై సవివరంగా ప్రసంగం చేసారు. శ్రీమతి జగద్ధాత్రి కూడా ప్రసంగించారు. సాహితీస్రవంతి విశాఖ కమిటీ కార్యదర్శి నూనెల శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. ఈ సభలో రచయిత్రి అయ్యగారి సీతాలక్ష్మి, రచయితలు సితార, మంగు శివరామ్‌ప్రసాద్‌, కూర్మారావు, భమిడిపాటి సుబ్బారావు, సాహితీస్రవంతి సభ్యులు అరుణ్‌జీ, సి.హెచ్‌.ఎల్‌.ఎన్‌. శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.