కవిత్వ శిల్పంపై చర్చాకార్యక్రమం

    సాహితీస్రవంతి ఖమ్మం ఆధ్వర్యంలో బోడేపూడి విజ్ఞానకేంద్రంలో ప్రతీ నెలా మూడవ ఆదివారం సాహిత్య అధ్యయన వేదిక నిర్వహిస్తున్నారు. జనవరి 19న జరిగిన కార్యక్రమంలో కవిత్వ శిల్పంపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ దండలో దారంగా ఉండి, నేర్పరితనం కలిగి వుండటమే శిల్పం అన్నారు. శిల్పంపై పట్టు సాధించినవారు గొప్ప కవిత్వాన్ని సృష్టించగలుగుతారని అన్నారు. అనంతరం పొత్తూరి సుబ్బారావు మాట్లాడుతూ కవిత్వ భాష ఒక ప్రత్యేక భాష అని, 20వ శతాబ్దపు కవులు అభిభాషించారని తెలిపారు. కవిత్వం శిల్ప పరస్పరాధారితాలని, పద్యం రాసేటప్పుడు కవి తన భాష నుంచి పక్కకు తొలుగుతాడని, దానికొక ప్రత్యేక శైలిలో నేర్పుగా సృజన చేస్తాడని అన్నారు. పురాణ, ఇతిహాస, చారిత్రక, సాంఘిక, పద్య, వచన, కవిత్వం పరిచయం చేసుకుంటేనే కొత్తపోకడలు కవిత్వంలో చూపించగలం అన్నారు. సీనియర్‌ కవి జీవన్‌ మాట్లాడుతూ పలువురు కవుల కవిత్వ చరణాలను పేర్కొంటూ శిల్ప చాతుర్యాన్ని వివరించారు. కపిల రాంకుమార్‌ మాట్లాడుతూ కవిత్వాన్ని మెరుగుపెట్టుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలను సూచించారు. వురిమళ్ళ సునంద, శైలజ, బండారు రమేష్‌, షేక్‌ బషీర్‌, తదితరులు తమ కవితలను చదివి వినిపించారు. ఖమ్మం జిల్లా సాహితీస్రవంతి కార్యదర్శి రౌతురవి వందన సమర్పణ చేశారు.