సాహితీస్రవంతి నిజామాబాద్ జిల్లా కన్వీనర్‌గా కృషిచేసిన ఆరెట్టి నారాయణ రెండవ వర్థంతి సందర్భంగా ఆరెట్టి సోషల్& కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జనవరి 12న నిజామాబాద్ పట్టణంలోని ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో సంస్మరణ సభ జరిగింది. సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి వొరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఆరెట్టి నారాయణ తన జీవితం చివరి క్షణం వరకూ పేదప్రజల పక్షాన నిలిచారని అన్నారు. ఒక సాంస్కృతిక కార్యకర్తగా, మార్గదర్శిగా, నాయకునిగా బహుముఖ ప్రజ్ఞ ఆరెట్టి కనబరచారని ప్రశంసించారు. సామాన్య ప్రజలలో చైతన్యం నింపాలని నిరంతరం తపించేవారని అన్నారు. ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఆరెట్టి నుండి స్ఫూర్తి పొందాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన షాహిద్‌మియా మాట్లాడుతూ కళాకారుడిగా, నాటక రచయితగా, మేధావిగా ఆరెట్టి నారాయణ ఎందరినో ప్రభావితం చేశారన్నారు. విజయానందరావు, శిర్పలింగం, పడాల రామారావు, సిర్ప నాగయ్య, నర్శింలు, కవయిత్రి మల్లవరపు విజయ తదితరులు ప్రసంగించారు. అనంతరం ఆరెట్టి కల్చరల్& సోషల్ ఆర్గనైజేషన్ తరపున వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు. అరెట్టి కుటుంబ సభ్యులు, కవులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరెట్టి నారాయణకు నివాళి అర్పించారు.