కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ 72వ జన్మదినోత్సవం సందర్భంగా వరంగల్‌లో డిసెంబర్ 24న స్థానిక వాగ్దేవి కాలేజి ఆడిటోరియంలో సాహిత్య సమావేశం జరిగింది. వాగ్దేవి డిగ్రీ& పీజి కాలేజి డైరెక్టర్ ఆచార్య జి. నరసింహమూర్తి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. నవీన్ రచించిన సాహిత్య వ్యాసాల సంకలనం ''సప్తవర్ణాల హరివిల్లు''ను ప్రఖ్యాత కవి శ్రీకాంత్ శర్మ ఆవిష్కరించి మాట్లాడుతూ ''ఈ వ్యాసాలను చదివినప్పుడు నవీన్‌లోని సహృదయుడైన విమర్శకుడు మనకు దర్శనమిస్తాడని'' అన్నారు.''బాంధవ్యాలు'' నవలను ''నాతేరిస్తే'' పేరుతో హిందీలోకి అనువదించిన కొమ్మిశెట్టి మోహన్ ఆవిష్కరించి మాట్లాడుతూ ''అనువాదాలు చెయ్యడం అనేది కత్తిమీద సాములాంటిదని, బాంధవ్యాలు లాంటి పెద్ద నవలను హిందీలోకి అనువదించటానికి మూడేళ్ళు శ్రమించానని'' చెప్పారు. ''కాలరేఖలు'' తమిళ అనువాదం ''కాలచ్చువడుగల్''ను బహుభాషాకోవిదుడు నలిమెల భాస్కర్ ఆవిష్కరించి ''కాలరేఖలును తమిళంలోకి అనువదించిన రుద్రతులసీదాసు తమిళ అనువాదాన్ని చాలా చక్కగా చేశాడని, మూలంలాగే ఈ తమిళ అనువాదం కూడా చాలా సరళంగా, సూటిగా సాగిందన్నారు. 2012 ఏప్రిల్ 12,13 తేదీల్లో వరంగల్లులోని సి.కే.యం. కాలేజిలో ''నవీన్ జీవితం సాహిత్యం'' అన్న అంశం మీద జరిగిన రెండు రోజుల సెమినార్ పత్రాలను అదే పేరుతో పుస్తకంగా వెలువరించారు. ఈ పుస్తకాన్ని సి.కే.యం. డిగ్రీ అండ్ పీజీ కాలేజి ప్రిన్సిపాల్ డా|| విజయ కుమార్ ఆవిష్కరించారు. గత సంవత్సరం నుండి అంపశయ్య నవీన్ సాహిత్య సమితి వారు ఒక నవలాకారుడి మొదటి నవలకు ఇచ్చే 10 వేల రూపాయల పారితోషికాన్ని ఈసారి కడపకు చెందిన వేంపల్లి గంగాధర్ రచించిన 'నేలదిగిన వానకు' ప్రదానం చేశారు. 'నేలదిగిన వాన'ను ప్రఖ్యాత విమర్శకుడు కె.పి. అశోక్ కుమార్ సభకు పరిచయం చేశారు. ''అంపశయ్య నవీన్ సాహిత్య సమితి పురస్కారం పొందిన రెండు నవలలు కూడా (ఆకుపచ్చ విధ్వంసం, 'నేలదిగిన వాన') 'చతుర' మాసపత్రికలో ప్రచురించబడటం గమనార్హం'' అని పేర్కొన్నారు. నవీన్ రచించిన సాహిత్య వ్యాసాలను గూర్చి గిరిజామనోహర్ బాబు, రామాచంద్రమౌళి, ఇంద్రగంటి జానకీబాల ప్రసంగించారు.చివర్లో నవీన్ మాట్లాడుతూ ''కొత్తగా నవలలు రాసే వాళ్ళను ప్రోత్సహించాలనే లక్ష్యంతోటే నేనీ పురస్కారాన్ని ఇస్తున్నానని, తాము రచించిన నవలలను ప్రచురించుకోవడానికి ఈ పురస్కారం కొంత తోడ్పడతుందనీ, నవలలు రాయటాన్ని పూర్వంలాగే ఇప్పుడూ కొనసాగించాలనీ'' నవీన్ అన్నారు. డా|| వీరాచారి వందన సమర్పణతో మూడు గంటలపాటు సాగిన ఈ సభ ముగిసింది.
- వి.ఆర్. విద్యార్థి