ప్రజాపక్ష ప్రచురణ కర్త

    నవశక్తి, జయంతి పబ్లికేషన్స్‌ అధినేత తెలుగు పుస్తక ప్రచురణ రంగంలో గణనీయ కృషిచేసిన మువ్వల పెరుమాళ్లు జనవరి 21న తుదశ్వాస విడిచారు. కమ్యూనిస్టుగా ఆదర్శజీవితం గడిపిన వీరు 1948 నుండి 1951 వరకు రహస్య జీవితంలో ఉన్నారు. కమ్యూనిస్టుగా ఆదర్శజీవితం గడిపిన వీరు 1952లో ప్రచురణల రంగంలోకి వచ్చారు. నవశక్తి పేరుతో ప్రచురణలు చేపట్టిన ఆయన 1955లో జయంతి పబ్లికేషన్స్‌ ప్రారంభించారు. 1995 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుండి విశిష్ట తెలుగు ప్రచురణకర్త అవార్డును అందుకున్నారు. 1946లో గుంటూరులో రాత్రి బడులు నిర్వహించారు.కమ్యూనిస్టు పత్రికల ప్రచురణ సంస్థలతో మొదలైన పెరుమాళ్లు కృషి తర్వాతి కాలంలోనూ ఎన్నో ఉత్తమ గ్రంధాలను అందించేందుకు దోహదం చేసింది. పుస్తక ప్రియులకు జయంతి పబ్లికేషన్స్‌ అన్న పేరు సుపరిచితమైందంటే అందుకు పెరుమాళ్లు ఉత్తమాభిరుచులే కారణం. ఎన్నో ఉత్తమోత్తమ గ్రంథాలను తెలుగువారికి అందించిన ఘనత పెరుమాళ్లుదే. రవీంద్రుడు, రాహుల్‌ సాంకృత్యాయన్‌, శరత్‌బాబు, అడవి బాపిరాజు వంటి వారి రచనలు ప్రచురించడమే గాక ఉత్తేజకరమైన సామ్యవాద పోరాట సాహిత్యాన్ని, యోధుల జీవితాలను తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా గొప్పది. సుందరయ్య గారి వీరతెలంగాణా సాయుధ పోరాట గ్రంధాన్ని ప్రత్యేకాసక్తితో ప్రచురించడం ద్వారా పెరుమాళ్లు తన నిబద్ధతను చాటుకున్నారు. జీవితాంతం సామాన్యప్రజల ఫక్షాన నిలబడ్డ పెరుమాళ్ళుకు సాహితీస్రవంతి, సాహిత్య ప్రస్థానం తరపున నివాళి అర్పిస్తున్నాం.