విశాఖపట్నంలో ఉగాది కవి సమ్మేళనం


    సాహితీస్రవంతి విశాఖ నగర కమిటీ ఆధ్వర్యాన నగర పౌర గ్రంథాలయంలో మార్చి30న  ఉగాది కవితాగానం జరిగింది.  సమకాలీన సమస్యలపై కవులు అక్షర అస్త్రాలు సంధించారు. అడవిబిడ్డల అగచాట్లను, కడలిపుత్రుల కష్టాలను ఏకరువు పెట్టారు. ఎన్నికల వేళ స్వార్థ నాయకుల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. మాయమైపోతున్న మట్టి గురించి, చెట్టు గురించి, మానవత్వం గురించి ఆవేదన చెందారు. మంచి మార్పుకోసం ప్రతిన పూనారు.  విశాఖ సాహితీస్రవంతి గౌరవాధ్యకక్షులు రమణాచలం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 22 మంది కవులు పాల్గొన్నారు. వివిధ అంశాలను స్పృశిస్తూ కవితలు విన్పించారు. అల్తి రవికుమార్‌, పి. అనంతరావు, మంగు శివరామప్రసాద్‌, కె. సత్తిరాజు, ఎస్‌. నాగరాజు, విరియాల గౌతమ్‌, పివి రామ్‌కుమార్‌, సుజాతామూర్తి, ప్రనాలె, బి. వెంకటేశ్వరరావు, డా|| కె. బాబూరావు, డా|| విజయగోపాల్‌, సుధాకర్‌ గుప్తా, చొక్కర తాతారావు, భమిడిపాటి సుబ్బారావు, వై. అప్పారావు, రామారావు, అడపా రామకృష్ణ, అరుణ, దేవులపల్లి పద్మజ తదితరులు తమ కవితలను భావయుక్తంగా చదివి వినిపించారు. ఇందులో 9 ఉత్తమ కవితలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. కవులు ప్రజాపక్షం వహించాలని, సమకాలీన సమస్యలపై స్పందించటంతో పాటు పరిష్కారం వైపు నడిపే ఆశావాద దృక్పథం కలిగించాలని సాహితీస్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యాజీ అన్నారు. సమాజంలో జరిగే పరిణామాలకు, దుర్భరమైన వ్యత్యాసాలకు మూలాలేమిటో కనుక్కోవాలని అన్నారు. గతాన్ని ఘనంగా భావించటం, వర్తమానం మొత్తం చెడిపోయిందని తీవ్రంగా బాధపడ్డం వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు. సమాజాన్ని మంచివైపు నడిచే, నడిపించే ఒక ఉత్ప్రేరకంగా సాహిత్యం ఉపయోగపడాలని అన్నారు. సాహితీస్రవంతి విశాఖ కార్యదర్శి నూనెల శ్రీనివాసరావు సాహితీస్రవంతి ప్రచురిస్తున్న 'సాహిత్య ప్రస్థానం' మాసపత్రికను సభకు పరిచయం చేశారు. అధ్యకక్షులు రమణాచలం  కవితాగానం జయప్రదం చేసిన కవులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.వి. చలపతి, అడపా రామకృష్ణ, ఎ.వి. రమణారావు, పి. మణి తదితరులు పాల్గొన్నారు.