జయనామ సంవత్సరంలో అన్ని శుభాలే జరగాలని పలువురు కవులు తమ కవితాగానంలో ఆకాంక్షించారు. ప్రతి మనిషి కొత్తగా ఆలోచించాలని, నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. పాలమూరు సాహితీ, లుంబిని టెక్నో స్కూల్ యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 28న మహబూబ్‌నగర్‌లోని లుంబిని టెక్నో హైస్కూల్‌లో జయనామ ఉగాది కవిసమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా సభాధ్యకక్షుడు లక్ష్మణ్‌గౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని నూతన కవులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రతి ఏటా ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. 60 ఏళ్ల సుదీర్ఘ ప్రత్యేక రాష్ట్ర ఆందోళనకు ముగింపు పలికి నూతన తెలంగాణ రాష్ట్రంలో ఉగాది జరుపుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యఅతిథి జలజం సత్యనారాయణ అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తూరు రాములుగౌడ్ మాట్లాడుతూ సమాజానికి దిశా, నిర్దేశం చేసేకవుల కవితాబలం గొప్పదన్నారు. ప్రధాన వక్త పల్లెర్ల రాంమోహన్‌రావు ఉగాది ప్రాముఖ్యతను వివరించారు. ఈ కవిసమ్మేళనంలో పాలమూరు సాహితీ అధ్యకక్షుడు డా|| భీంపల్లి శ్రీకాంత్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా జిల్లా కవులు వల్లభాపురం జనార్ధన్, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, జనజ్వాల, ఖాజామైనొద్దీన్, శ్రీశైలం, ప్రతాప్ కౌటిల్య, డివివిఎస్ నారాయణ, పల్లాటి తారకం, రాజారాం ప్రకాశ్ విరజాజి రాంరెడ్డి, కపిలవాయి వెంకటేశ్వర్లు, ఇరువెంటి వెంకటేశ్వరశర్మ, శాంతారెడ్డి, వెంకటదాసు, చక్రవర్తి గౌడ్, వీణాదేవి, సత్యవతి, పులిజమున, నవీన్, శ్యామాచార్య, పద్మావతి, హరీష్‌కుమార్, గన్నోజు శ్రీనివాసాచారి, చెన్నయ్య, బోలయాదయ్య, గిరిష్‌మిత్ర, కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.