కాకినాడలో సాహిత్య హేల

   సాహితీస్రవంతి కాకినాడ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 6న సాహిత్య హేల కార్యక్రమం జరిగింది. ఈ కారక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహనరావు మాట్లాడుతూ సాహిత్యంలోని అన్ని ప్రక్రియలనూ ప్రోత్సహించడానికి, సమాజంలో ఉదాత్తమైన, ప్రగతిశీలమైన కళాస్పృహ పెంపొందించడానికి ఇక్కడి సాహితీస్రవంతి కృషి చేస్తోందని అన్నారు. వివిధ ప్రాంతీయ మాండలికాల వినియోగం చేతనే వ్యవహారిక భాష సుసంపన్నమౌతుందని గురజాడ చెప్పిన విషయాన్ని వివరించారు. పి. సీతారామరాజు నాటికల గురించి ప్రసంగిస్తూ 'పక్కింట్లో పుట్టాలి' అనే వై.ఎస్‌.కృష్ణారావు నాటకాన్ని విశ్లేషిస్తూ మాట్లాడారు. పద్మజా వాణి ఉత్తరాంధ్ర కథా ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గంటేడ గౌరునాయుడు కథల్ని విశ్లేషించారు. వక్కలంక లక్ష్మీపతి రచనలపై ఎర్రమిల్లి శారద ప్రసంగించారు. గనారా స్వాగతం పలుకగా మణిబాబు వందన సమర్పణ చేశారు.