ఖమ్మంలో ఉగాది కవి సమ్మేళనం

    ఖమ్మం పట్టణంలో బోడేపూడి విజ్ఞానకేంద్రంలో ఉగాది రోజున ఖమ్మం జిల్లా సాహితీస్రవంతి  ప్రచురించిన 'ఆమని' ఉగాది కవితా సంకలనాన్ని ప్రముఖ కవి, నాటక రచయిత, దర్శకుడు బాణాల కృష్ణమాచారి ఆవిష్కరించారు. ఈ సమావేశానికి సాహితీ స్రవంతి జిల్లా అధ్యకక్షుడు కె. ఆనందాచారి అధ్యక్షత వహించారు.  సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి రౌతు రవి మాట్లాడుతూ ఈ జయనామ ఉగాదికి ఎంపిక చేసిన కవితలతో 'ఆమని' సంకలనం వెలువరించామని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.  ఇందులో సమకాలీన, సామాజిక రాజకీయ అంశాలతో పాటు పండుగ నేపథ్యాన్ని మిళితం చేసి, షడ్రుచుల సమ్మిశ్రితంగా కవితలు, పద్యాలు, గేయాలు, మీకు దర్శనమిస్తాయన్నారు. వీటిని ఒక చోటికి తేవటం సంకలనపరచడం కత్తిమీద సామైనా సాహితీ స్రవంతి కార్యకర్తల తోడ్పాటుతో ఈ చిన్న రూపం తేవడంలో సంతృప్తి కలిగిందన్నారు. వెంటనే స్పందించి కవితలు పంపినవారికి, సహకరించిన కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మానికి చెందిన సీనియర్‌ కవులను, సాహిత్యాభిమానులను సన్మానించారు. తదుపరి కన్నెగంటి వెంకటయ్య, సునంద, కపిల రాంకుమార్‌, నిర్వహణలో కవి సమ్మేళనం కొనసాగింది. ఇరవైరెండు మంది కవితలను పుస్తకరూపంలో సంకలనం కావించగా, వీరు కాక, మరోపదిహేనుమంది తమ కవితలను చదివి వినిపించారు. మాజీ మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ అఫ్రోజ్‌ సమీనా, సి.ఐ.టి.యు. నాయకులు ఎర్రా శ్రీకాంత్‌, ప్రముఖ రంగస్థల కళాకారుడు అద్దంకి కృష్ణప్రసాద్‌, బి.వి.కె. డిప్యూటి జనరల్‌ మేనేజర్‌ కందాడై శ్రీనివాసులు మొదలగు వారు సందేశమిచ్చారు.    రాజకీయ నాయకులు సామాన్యుని అవసరాలపై ఎలా వల వేస్తారో  తన కవితలో రాంకుమార్‌, ఆరు ఋతువులు సమ్మేళనం ఈ ఉగాది అంటూ సునంద, మానవాళి మేలుకొరకు మరింత వెలుగులు నింపాలని ఆశతో శైలజ, ఏది ఏమైనా కోయిలా ఓట్ల పండుగని వెంటేసుకుని వొచ్చావులే అంటూ కన్నెగంటి చమత్కరించగా,  కాలాన్ని నిర్వచిస్తూ చక్కటి చమత్కార కవిత గిరి నరసింహారావు, శిశిరంలో రాలిన పండుటాకుల్ని లెక్కిస్తూ, తొక్కేస్తూ ఋతువుల క్రమాన్ని తన కవితలో బంధించిన వనం తేజశ్రీ. ఎన్ని ఉగాదులొస్తేనేం, మనిషి మనసుని మార్చగలవా అని ప్రశ్నిస్తూ పోట్ల సుధారాణి, ''జయాలనిచ్చే ఉషోదయానికై'' అంటూ  గేయ రూపంలో  ఉగాదిని స్వాగతించిన సంపటం దుర్గా ప్రసాదరావు, పండుగ సంబరమొకరోజే కాని సాలు పొడుగునా వైఫల్యాలెన్నో ఇన్నేళ్ళ ఉగాదుల వెంట వస్తూనే వున్నాయంటూ చావా జయప్రద, ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకున్న ఉగాదే అంటూ చతురత కూడిన కవితతో మేడగాని శేషగిరి, కలవరపడకే కోయిలా అంటూ హెచ్చరిస్తూ కంచర్ల శ్రీనివాస్‌, కోయిల స్వరాలకు బదులు కాకుల స్వరాలు, పల్లెల్లోనూ, గల్లీల్లోనూ వినిపిస్తున్నాయంటూ కవితాంజనేయులు, స్వాగతం యుగగీతి గేయంతో రౌతురవి, జయ ఉగాది పై చక్కటి సంప్రదాయ వృత్తాలతో డా. పొత్తి సుబ్బారావు, డా|| పాపయ్య శాస్త్రి. తాగుబోతోడి శ్రీమతి తంటాలను చమత్కారంగా పావే రావు. పండుగ హడావుడి  హాస్యరూపకాన్ని రౌతు కడలి, ఎన్నికల వేళ మతంరంగు పులుముకుని దాడిచేయబోయే వాడిని గుర్తుపట్టానంటూ బండారు రమేష్‌, ప్రతీ దానినీ నిశితంగా, నిజాయితీగా చూడటం నేర్చుకోవాలని, కె. ఆనందాచారి, బతికేవున్నామని ఓ ఐదేళ్ళకోసారి గుర్తుచేసుకోవటమేనా ఎన్నికలంటే అంటూ తీవ్ర స్వరం వినిపించిన పోతగాని, పర్వదినం పేరుతోనైనా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవటం యెంతో అవసరమని గజేంద్ర సైదులు, పైసలకు ఆశపడితే పడ్డావు కాని, ఓటు మాత్రం అర్హత కలిగిన వాడికే వెయ్యాలి సుమా అంటూ ఆలేటి పరంజ్యోతి కవితలు అందర్ని అలరించాయి. వివిధ ప్రజా సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగ సంఘనాయకులు, పట్టణంలోని ప్రముఖ న్యాయవాదులు, వ్యాపారస్తులు, మహిళాసంఘ నాయకులు, ఆదివారం మీ కోసం అధ్యక్ష, కార్యదర్శులు తదితరుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోడేపూడి విజ్ఞానకేంద్రం నిర్వాహకులు ఉగాదిపచ్చడి, చక్కెరపొంగలి, పులిహోరలతో వచ్చిన వారందరికీ పండుగ ఆతిథ్యాన్ని అందించారు. ఎం. శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య, కళానిలయం బృందం తమ గీతాలతో అలరించారు.- కపిల రాంకుమార్‌