విలువల క్షీణత ఆందోళనకరం

    సాంకేతికంగా సమాజం అభివృద్ధి పథంలోకి దూసుకుపోతున్నప్పటికీ మానవ విలువలు క్షీణతకు గురికావడం ఆందోళన కలిగిస్తోందని సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి వొరప్రసాద్‌ అన్నారు. సాహితీస్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో మార్చి29న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నగర కమిటీ అధ్యకక్షులు తంగిరాల చక్రవర్తి అధ్యక్షతన ఎన్నికల ఉగాది జనకవనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది జనకవనం నిర్వహించుకోవడమంటే గ్రామాలతోనూ, ప్రకృతితోనూ ఉన్న అనుబంధాన్ని పట్టణంలో జీవిస్తున్న మనం మరోకసారి గుర్తు చేసుకోవడమేనన్నారు. వ్యవసాయ సమాజంలో పండగలన్నీ భూమి కేంద్రంగానూ, ఆహార పదార్థాల కేంద్రంగానూ జరుగుతాయని, ప్రస్తుతం నగరీకరణ, పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో నాటి సంప్రదాయ పండుగలన్నీ మసకబారుతున్నాయని అన్నారు. దీంతోపాటు ప్రజల మధ్య ఆత్మీయ అనుబంధాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక సాంస్కృతిక అసమానతలతో సమాజం అతలాకుతలం అవుతోందన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే రచయితలు కవులు కళాకారులు అట్టడుగున పడి నలుగుతున్న వర్గాల గురించి, వారి జీవితాలను రచనా వస్తువుగా స్వీకరించి తమ కవిత్వం ద్వారా థాదిశా నిర్ధేశం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ రకంగా బుద్ధిజీవులైన సాహితీవేత్తలు మానవ విలువలను పెంపొందించడానికి ప్రయత్నించాలని, అందుకోసం ఉగాది నుంచి ప్రేరణ పొందాలని చెప్పారు. పాలకులు అమలు చేస్తున్న ప్రపంచీకరణ విధానాలు ప్రజలను అధోగతిపాలు చేశాయని విమర్శించారు. పాలకులు అనుసరించే విధానాలు వ్యాపారం కోసం కాకుండా మనుషుల అవసరాల కోసం విధానాలు ఉండాలన్నారు.ఆలోచింపజేసిన ఎన్నికల ఉగాది జనకవనం    అనంతరం టి వెంకటి ఆధ్వర్యంలో జరిగిన జనకవనంలో 24 మంది కవులు తమ కవితలను చదివి వినిపించారు.    ''ఒట్టేసి ఓటేసి చెప్పాలి/ మార్పు తీర్పులు కావాలి'' అంటూ డాక్టర్‌ విప్లవ్‌ దత్‌ శుక్లా మిని కవిత చదవగా యాంత్రిక సమాజపు చట్రంలో/ మనిషిగా పురోగమించడానికి! నాకు ఉత్తేజాన్నిచ్చేది నిరంతరం సూర్యోదయమే'' అంటారు వొరప్రసాద్‌. ''నమో'' ''రాగా'' లాపన లోంచి జాతిని బ్రతికించు! ప్రతిసారి ఓడే ఓటరును ఈ సారి గెలిపించు ! అంటూ ఎన్నికల ఉగాదిని చక్రవర్తి స్వాగతించారు. ఆకుపచ్చని ఆమనిని / ఆస్వాదించాలని/ ఓ వనంలోకి వెళితే / రక్తపు రుచి మరిగిన పులి / మేక వన్నెను పులుముకొని / మనమంతా ఒకటే నంటూ నమ్మబలికినపుడు అవగాహనకు వచ్చాను / ఈ పాట వసంతాన్నైనా మిగలనీయరీ నాయకులని'' అంటారు పొత్తూరి సుబ్బారావు. ఓటెయ్యడానికి పద్దెనిమిది నిండితే చాలు/ ఎన్నికల్లో నిలబడడానికి మాత్రం పద్దెనిమిది చాలవు?/ అవినీతి పెరిగింది! నిర్మూలిస్తాం అంటారు/ ఎన్నిక కాగానే అవినీతిలో కూరుకుపోతారు అంటూ తన వ్యంగ్య కవిత 'ఎన్నికల కవనం' చదివారు బత్తులశశి. ఎన్ని వసంతాలు వస్తేనేమి? పోతేనేమి? మార్పులేని జీవితాల్లో / వసంతాలు విప్పేసిన అంగీలు'' అంటారు ఎస్‌. విజయలక్ష్మి ''విజయనామవత్సరం / విశిష్టతని నింపుకెళ్ళింది / జయనామవత్సరం! జాగృతినివ్వాలి'' అంటూ ఆశావహదృక్పథంతో చక్కటి కవితను సుతారపు  వెంకట నారాయణ వినిపించారు.''భూమధ్య రేఖ రెండు కొసళ్ళనూ కలుపుతూ / తెల్లపావురం తోడుగా ఎక్కడెక్కడ తిరిగావో/ కాలోహ్యం నిరవధిః విపులాచ పృథ్వీ/ వినసొంపైన జనశ్రుతిని పాడుకుంటూ ! అంటూ తమ స్వీయానుభవ రసావిష్కరణను కొంపెల్ల కామేశ్వరరావు తన వసంత సంకీర్తనలో గానం చేసారు. ''స్విస్‌ బ్యాంకులలోని - నల్ల సొమ్ముతో/ ప్రజాసేవకు సిద్ధమని/ మరో మారు జిత్తుల మారీచులు'' అంటూ కె.వి.రావు ''ఎన్నికలు- ఎన్నో ఆశలు'' అనే కవిత ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసారు. ''సకల వర్ణ పతాకాలు కమ్మిన అంబరాలే/ పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఏలుని / పట్టేసుకోజూస్తుంది పచ్చనోటు / ఓటున్నదన్న ప్రతి నోటునీ/ ముద్దెట్టుకోబోతుంది సారా ప్యాకెట్టు/'' అంటూ ఎస్‌.ఎస్‌.బి. గేరా తన ''సిరాచుక్కల జాతర'' కవితలో నేటి కుళ్ళు రాజకీయ వ్యవస్థని ఎండగట్టారు. ఉగాది ప్రాశస్థ్యాన్ని శుభాభివందనాల ఆశల ఆకాంక్షల్ని తెల్పుతునే ఎన్నికల్ని రాజకీయ నేతల వాగ్దానాల్ని- తీరుని ఎండగడుతూ ఎస్‌. వివేకానంద, ఒబ్బిని సన్యాసిరావు తదితర కవులు జనకవనంలో పాల్గొన్నారు.  సాహితీస్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి జి. యాదగిరిరావు స్వాగతం చెప్పగా అనంతోజు మోహనకృష్ణ వందన సమర్పణ చేసారు.- తంగిరాల చక్రవర్తి