ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర రాసిన కథల సంపుటి 'రాయక్క మాన్యమ్' ను మే12న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జోగినీ వ్యవస్థ నిర్మూలనా ఉద్యమ నాయకురాలు ఆజమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆజమ్మ మాట్లాడుతూ అనాదిగా అంటరానితనం, అణచివేతలకు గురౌతున్న దళిత మహిళల జీవితానుభవాలను కథలుగా రాసినందుకు జూపాక సుభద్ర అభినందనీయురాలు అన్నారు. ఈ పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షత వహించిన ద్రావిడ విశ్వవిద్యాలయం ఆచార్య పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ ఈ కథల ద్వారా తెలంగాణ మట్టి మనుషుల సాంస్కృతిక సౌందర్యం, యాస, భాషల పరిమళాలను రచయిత్రి సుభద్ర మనముందు ఉంచారన్నారు. ఎస్వీ విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్. మునిరత్నమ్మ మాట్లాడుతూ ఈ కథా సంకలనంలో 17 కథలున్నాయని, దళిత మహిళల కష్టాలను, వారి జీవన వైవిధ్యాలను గతంలో ఎవ్వరూ రాయలేనంత లోతుగా, సవివరంగా రచయిత్రి ఈ కథల్లో ఆవిష్కరించారని అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క మాట్లాడుతూ 'గద్దెత్క పోయిన బత్కమ్మ' కథ దళిత మహిళల జీవితాలకు అద్దం పడుతున్నదని, తెలంగాణ నవ నిర్మాణంలో దళిత బహుజన మహిళలకు గౌరవం, సమాన హక్కులు దక్కాలని ఆకాంక్షించారు. రుంజ పూర్వ అధ్యకక్షురాలు, మట్టిపూల రచయిత్రి జ్వలిత మాట్లాడుతూ దళిత మహిళలపై నేటికీ కొనసాగుతున్న తీవ్రమైన దోపిడీ వివక్షలు, అణచివేతలకు సుభద్ర కథలు అద్దం పడుతున్నాయన్నారు. మట్టిపూల కవయిత్రి డాక్టర్ షాజహానా మాట్లాడుతూ దేశంలో గాయాలు లేని దళిత స్త్రీ లేదని, కుల వివక్ష రూపాలు మార్చుకుంటున్నదిగానీ, సమసి పోలేదన్నారు. సుభద్ర కథల్లోని పాత్రలన్నీ సజీవమైనవేనని అన్నారు. మరో మట్టిపూల రచయిత్రి, ఉపాధ్యాయురాలు గంధం విజయలక్ష్మి మాట్లాడుతూ సుభద్ర కథల్లో తెలంగాణ మట్టి మనుషుల భాషా మాధుర్యం, నానుడులు, చాటువులు, పలుకుబడులు, జాతీయాలు కళ్ళకు కట్టినట్టు కన్పిస్తాయని, వినిపిస్తాయని తెలిపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సీనియర్ అధ్యాపకులు డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచీకరణకు మూలసూత్రమైన సాంస్కృతిక ఏకీకరణను తిప్పికొట్టగల సామర్థ్యం ఈ కథల్లోనే ఉన్నదన్నారు. నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ జి.వి. రత్నాకర్ మాట్లాడుతూ దళిత సాహిత్యంలో జూపాక సుభద్ర రచనలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అట్టడుగు మహిళా సమాజాలను ఉద్యమ స్థాయిలో అక్షరబద్దం చేస్తున్న జూపాక సుభద్ర రచనలపై వివరమైన పరిశోధన జరగాలన్నారు. మాదిగ మహాశక్తి జాతీయ కన్వీనర్, రచయిత కృపాకర్ మాదిగ మాట్లాడుతూ రచయిత్రి సుభద్ర రచనలు, ఇతర మట్టిపూల రచయిత్రుల సాహిత్యాల వెనకనున్న సామాజిక జెండర్, సాహిత్య వస్తు తత్వాలపై సమగ్రమైన విశ్లేషణ, అధ్యయనం, పరిశోధన, ప్రచారం జరగాలన్నారు. బహుజనులైన మట్టిపూల రచయిత్రుల రచనలే ఇకపై ప్రధాన స్రవంతి సాహిత్యం అవుతుందన్నారు. చివరగా ఈ 'రాయక్క మాన్యం' కథా సంకలనం రచయిత్రి జూపాక సుభద్ర మాట్లాడుతూ తన చుట్టూ ఉన్న అట్టడుగు దళిత సమాజాల మహిళల జీవితాలే తన కథలకు మూలము, స్ఫూర్తి అని తెలిపారు. - కృపాకర్ మాదిగ