ఖమ్మంలో సాహిత్య అధ్యయన వేదిక

     ఖమ్మంలో బి.వి.కె. గ్రంథాలయంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో క్రమబద్ధంగా నిర్వహించబడుతున్న సాహిత్య అధ్యయనవేదిక మే 18న జరిగింది. ఇటీవల కన్నుమూసిన ప్రసిద్ధ సంఘసేవకురాలు, రచయిత్రి మల్లాది సుబ్బమ్మకు సభకు హాజరయిన కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సమావేశానికి కొత్తగా వచ్చిన పి. వెంకటేశ్వర్లు ''చుండూరు  దళితుల మారణకాండ'', వురిమళ్ళ సునంద ''రండి మీరింక ఆలస్యం చేయొద్దు '' - అనే వ్యంగ్య కవితలో కార్పొరేట్‌ స్కూళ్ళు, కాన్వెంట్‌లు చేసే హడావుడిని చిత్రీకరించారు.  యడవల్లి శైలజ '' నగరం''  అనే కవితలో రోజూవారి నగర జీవన గమనాన్నీ తనదైన శైలిలో వినిపించారు. ఆధునిక జీవనంలో సంప్రదాయాలు ఎలా మారిపోతున్నాయో వివరించే కవిత నాగేశ్వరావు వినిపించారు.  ఈ శకం నాది అనే కవితలో దళిత ధిక్కర స్వరంతో పాటు, ఆత్మ స్థైర్యం ప్రతిబింబించింది '' మానవతా వాదం నా మదినిండ వుంది '', '' బంగారు తల్లి '' అనే కథానికను '' అమ్మాయి '' ని వస్తువుగా  తీసుకుని  (ఆడపిల్ల - అక్కడపిల్లా ?) నేటి సామాజిక పరిస్థితులు, అమ్మాయిలపైని ఎటువంటి సానుకూల, ప్రతికూల ప్రభావాలు పడతాయో, తండ్రి ఆలోచన, తల్లి ఆరాటం ఎలా ఊగిసలాటలో వుంటాయో చక్కగా చదివి వినిపించారు సంపటం దుర్గా ప్రసాద్‌. రౌతు రవి, కన్నెగంటి వెంకటయ్య, తమ తమ సందేశాలను అందించారు.  రాబోయే సెప్టెంబరు 2014 కు సంవత్సరం పూర్తి అవుతుంది కాబట్టి ఒక ప్రత్యేక సంచిక తేవాలని అందులో కార్యక్రమాల నివేదిక, చదివిన కవితలు, ప్రసంగాల సంక్షిప్త సమాచారం వుండేలా చూడాలని తీర్మానించారు. అలాగే సాహితీ స్రవంతి 15 వ వార్షికోత్సవం జూన్‌ 14-15 తేదీలలో జరుగవచ్చునని దానికి ఒక ప్రత్యేక సంచికకై కవితలను, వ్యాసాలను, జూన్‌ నెల 5 వ తేదీలోగా బి.వి,.కె. గ్రంథాలయ నిర్వహకుడు, సాహితీ స్రవంతి అధ్యయనవేదిక నిర్వాహకుడు కపిల రాంకుమార్‌ అందించాలని కోరారు. కె. ఆనందాచారి మాట్లాడుతూ  కాలానికి, కవిత్వానికి వున్న బంధం, సంబంధం రాజకీయలకి, సాహిత్యానికి కూడ అవినాభావ సంబంధం వుండటం నేడు అనివార్యం అని నొక్కి చెప్పారు. మతం, కులం, స్త్రీ పురుష తేడాలు, వివక్షతలపై మన సాహితీకారులు పోరాటం చేయాలన్నారు. ప్రస్తుత సాంస్కృతిక వ్యవస్థపై దాడిచేయడానికే మతచాందసుల లక్ష్యంగా కనబడుతోందని, మనం సాహితీ సృజనకారులంగా ఆ దుష్ట వైఖరిని ముక్త కంఠంతో ఖండించాన్నారు. చివరగా ఆసు ప్రసాద్‌ పోలవరం ముంపు బాధితులపై ఒక పాట ఆలపించాడు. సీనియర్‌ కవి డా|| సీతారాం కవితలను విశ్లేషిస్తూ మాట్లాడారు. రౌతు రవి వందన సమర్పణ చేసారు.