సాహితీస్రవంతి ఆధ్వర్యంలో చలం జయంతి

       స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో, స్త్రీని ఏ విధంగా గౌరవించాలో చలం తన రచనల్లో గొప్పగా చెప్పారని ప్రముఖ సాహిత్య విమర్శకులు గుడిపాటి అన్నారు. సాహితీస్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మే 24న జరిగిన చలం జయంతిని పురస్కరించుకుని జరిగిన 'చలం సాహితీ సమాలోచనం' సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. చలం రచనల్లో మైదానం, జీవితాదర్శం, అరుణ రచనలు అందర్నీ ఆలోచింపజేసేవిగానూ, విస్మయపరిచేవిగానూ ఉంటాయని తెలిపారు. స్త్రీని ఎలా అర్థం చేసుకోవాలో, తనను కూడా సాటి మనిషిలా గుర్తించాలని చలం తన రచనల్లో అద్భుతంగా రాశాడని అన్నారు. కానుక, ఫలసేకరణ, గీతాంజలి రచనలు మళ్ళీ మళ్ళీ చదవుతామని అన్నారు. చలం రచనల్లోని పాత్రలు, సంభాషణలు పాఠకులను వెంటాడతాయని అన్నారు. మహిళ కుటుంబంలో అందరికోసం ఆలోచిస్తుంది కానీ తన కోసం ఎప్పుడూ ఆలోచించదని సాహితీస్రవంతి నగర కమిటీ సభ్యురాలు శాంతిశ్రీ అన్నారు. సమాజ విముక్తితో స్త్రీ విముక్తి ముడిపడి వుందని ఆమె అన్నారు. సాహితీస్రవంతి హైదరాబాద్‌ నగర కమిటీ అధ్యకక్షులు తంగిరాల చక్రవర్తి సభాధ్యక్షత వహించారు. నగర కమిటీ ప్రధాన కార్యదర్శి జి. యాదగిరి రావు సభకు స్వాగతం పలికారు. నగర కమిటీ సభ్యుడు టి. కిషోర్‌ 'మహిళా సాధికారత' అంశంపై జనకవనం నిర్వహించారు. 22 మంది కవులు తమ కవితలను చదివి వినిపించారు. వూసల రజనీగంగాధర్‌, పొత్తూరి సుబ్బారావు, ఒబ్బిని సన్యాసిరావు, రత్నా మహీధర్‌, ఆచార్య నరేంద్ర, విల్సన్‌రావు, స్ఫూర్తి, కొంపెల్ల కామేశ్వరరావు, వి.ఎస్‌.వి. ప్రసాద్‌, ఆలువాల సురేష్‌, పెద్దూరి వెంకటదాసు, గుళ్ళపల్లి ఆంజనేయులు, జె. శ్రీనివాసరావు, ఎస్‌. వివేకానంద, కె. రాజ్యలక్ష్మి, బొపార తదితర కవులు తమ స్వీయ కవితలు వినిపించారు. సీనియర్‌ కవులు అద్దేపల్లి రామమోహన రావు, నాళేశ్వరం శంకరం, సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి వొరప్రసాద్‌, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ మేనేజర్‌ కె. లక్ష్మయ్య  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.