కర్నూల్ చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ 174వ వర్థంతి సభ కర్నూల్‌లోని పోదుపు భవన్‌లో జూలై 12న జరిగింది. ఈ సభకు ప్రముఖ సాహిత్య చరిత్రకారుడు వైద్యం వెంకటేశ్వరాచార్యులు అధ్యక్షత వహించారు. తన అధ్యక్షోపన్యాసంలో 1801లోనే స్వాతంత్య్ర పోరాటం ప్రారంభించిన వీరులున్నారని, చరిత్రకారులు ఈ అంశాన్ని విస్మరించటం శోచనీయమన్నారు. దేశం మారుమూరులల్లో ఎన్నో స్వాతంత్య్ర పోరాటాలు జరిగాయని అవన్నీ వెలుగులోకి తేవాలన్నారు.గులాం రసూల్ ఖాన్ పుస్తక రచయిత ఎస్.డి.వీ అజీజ్ మాట్లాడుతూ, చారిత్రకాధారాలను భద్రపరిస్తే చరిత్ర పై రాసే వారికి అనువుగా ఉంటుందన్నారు. సాహితీ స్రవంతి జిల్లా అధ్యకక్షులు రఘుబాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో ముస్లిం సోదరులు పాల్గొన్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్ఫూర్తి ఎంతో అవసరమన్నారు. చరిత్ర పరిశోధకులు డా||మద్దయ్య మాట్లాడుతూ రసూల్ ఖాన్ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ఇనయతుల్లా మాట్లాడుతూ జిల్లాలో ఫాక్షనిస్టులేకాదు స్వాతంత్య్ర వీరులూ ఉన్నారన్నారు. సభలో బీసీ సంఘ నాయకులు శేషఫణి, మహిళా నాయకురాలు జ్యోతి మొదలైనవారు పాల్గొన్నారు.గులాం రసూల్ ఖాన్ పై తపాలా స్టాంపు తేవటం, నగరం నడిబొడ్డులో ఆయన విగ్రహం పెట్టటం, ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.