దళిత ఉద్యమ కేతనం గుర్రం జాషువా

ప్రజాశక్తి బుక్‌హౌస్‌, ప్రజానాట్యమండలి సంయుక్త ఆధ్వర్యంలో జూలై 24న తిరుపతిలోని గాంధీ ట్రస్టు భవన్‌లో జరిగిన గుర్రం జాషువా వర్థంతి సభ. చిత్రంలో డా. కొలకలూరి మధుజ్యోతి, డా. వి.ఆర్‌. రాసాని, ప్రజానాట్యమండలి అధ్యకక్షులు భాషా, కార్యదర్శి యాదగిరి, జగన్‌ తదితరులు         నిర్భయ, నిష్కలంక సత్యాన్వేషి అగ్రవర్ణ దౌర్జన్యాలపై గళమెత్తిన దళిత ఉద్యమ కేతనం గుర్రం జాషువా అని వక్తలు భావోద్వేగంతో ప్రసంగించారు. గాయపడిన కవులందరూ కావ్యాలు రాస్తే ఎంతటి సాహితీ సంపద సృష్టించబడేదోనని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతిలోని గాంధీట్రస్టు భవన్‌లో జూలై24న ప్రజాశక్తి బుక్‌హౌస్‌, ప్రజానాట్యమండలి సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జాషువా వర్థంతి సభ జరిగింది. రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరాస్వామి, డా|| వి.ఆర్‌. రాసాని,   శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ మధుజ్యోతిలు ప్రసంగించారు. వక్తలు మాట్లాడుతూ ఉదర పోషణార్థం వృత్తులెన్నో చేసినా కావ్యరచనే ఆయన ప్రధాన ప్రవృత్తిగా స్వీకరించారన్నారు. సమాజపు దుష్ట సంప్రదాయాలను, అంటరానితన్నాన్ని దుయ్యబట్టారని గుర్తు చేశారు. సాంఘిక దురాచారాలపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన కవి దిగ్గజ, నవయుగ కవితా చక్రవర్తిగా జాషువాను కొనియాడారు. 1971, జూలై 24న జాషువా మృతిచెందారని తెలిపారు.  ప్రపంచీకరణ నేపథ్యంలో విలువలు క్షీణించి ప్రతిదీ మార్కెట్లో సరుకుగా మారిందని, దీనిని నివారించాలంటే బలమైన ప్రజాసాంస్కృతిక ఉద్యమం అవసరమన్నారు. అభ్యుదయ మార్గంలో పయనిస్తూ నేడు విజృంభిస్తున్న హీన, క్షీణ, సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడటమే ఆ మహనీయులకు మనమిచ్చే అసలైన నివాళని అన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యకక్షులు భాషా, కార్యదర్శి పులిమామిడి యాదగిరి, జిల్లా అధ్యకక్షులు ఒ.వెంకటరమణ తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఆర్‌ఆర్‌ రెడ్డి, వెంకటరమణ, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ ఇన్‌ఛార్జ్‌ వెంకటేశం, శ్రీనివాసులు, ప్రజానాట్యమండలి జగన్‌, నారాయణబాబు, దయాకర్‌, శ్రీరాములు రవితేజ తదితరులు పాల్గొన్నారు.