'శివ'మెత్తిన కవితా యోధుడికి 'మువ్వా' పురస్కారం

''చలిని ఎదుర్కొనే ధైర్యమున్నవాడే/ పొద్దున్నే బయటికొస్తాడు చేతులు కాలుతాయని తెలిసిన వాడే మంటని ముట్టుకుంటాడు గుప్పిట పట్టుకుంటాడు/ ఒకానొక సందర్భంలో/ దేశంలో నిరసించటమే వీరకార్యమౌతుంది! దేహమూ, ప్రాణము విలువయినవే/ అత్యంత ప్రీతి కరమైనవే - ఒక దేశం కోసం ఒక సమిష్టి ప్రయోజనం కోసం వాటిని లెక్క చేయనివాడే హీరో వాటిని వెచ్చించినవాడే హీరో / రాజ్యముంటుంది/ రాజ్యహింస వుంటుందని తెలిసీ రాజ్యం ముఖం మీద గుద్దగలిగిన వాడే హీరో'' అంటూ రాజ్యాధికారంపై నిప్పులు చెరిగే కవిత్వంతో నాటి 'రక్తం సూర్యుడు' నుండి 'ఆసుపత్రి గీతం' నుండి నేటి 'గాథ' వరకూ శివమెత్తుతున్న శివారెడ్డికి కవితా హృదయాల గమ్మంలో ఘనసత్కారాన్ని నిర్వహించారు.ఒక సంవత్సరం క్రితం కవిత్వం చుట్టూ పచార్లు కొడుతూ 'సమాంతర ఛాయలు'గా వెలిసిన మువ్వా శ్రీనివాసరావు ఇప్పుడు  ''సిక్త్స్‌ ఎలిమెంట్‌''ను తన దృక్పథ ఎసెన్స్‌గా మలిచిన సందర్భంగా తన తల్లిదండ్రి ''మువ్వా పద్మావతి రంగయ్యల పేరు మీద ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి, ఆ ఫౌండేషన్‌  ప్రథమ పురస్కారాన్ని ఈ నెల పన్నెండున స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో శివారెడ్డి ప్రధానం చేశాడు. ఈ ఉత్సవం తెలుగు సాహితీలోకానికి ఒక గొప్ప అనుభూతిని, స్ఫూర్తిని ఇచ్చేదిగా మిగిలింది. పాతిక మంది ప్రముఖ కవులు అతిథులుగా పాల్గొన్న ఈ సాహితీ సభలో హైకోర్టు జస్టిస్‌ చంద్రకుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని శివారెడ్డి గారికి పురస్కారాన్ని అందించారు. ''ప్రపంచ సాహిత్యాన్ని, ఆర్థిక శాస్త్రాన్ని, ఫిలాసఫిని చదివిన కవి శివారెడ్డి'' అని కవి అంటే దార్శనికుడని, భయంలేని వాడే నిజమైన మనిషి, అన్యాయాలు, దోపిడీలపై తన గొంతుకను కవిత్వమై సమాజానికి అందించిన ఈ కాలపు సమాజకవి శివారెడ్డి' అని న్యాయమూర్తి శివారెడ్డిని అభినందించారు.''సమాజంలో కవులు, కళాకారులు, నిర్మాణాత్మక శక్తులని, కవిత్వం రాయడమంటే ఖడ్గంలో సహజీవనం చేయడమేనని మొద్దుబారడం, మోడువారడానికి వీళ్ళేదని'' పురస్కారం గ్రహీత శివారెడ్డి తన జీవితానికి కవిత్వానికి ఉన్న సంబంధాన్నీ వివరించారు. భూపోరాటాలు, ఉద్యమాలు లేకుండా నా కవిత్వం లేదన్నారు. మనిషిగా పుట్టింది ఆంధ్రాలో అయినా కవిగా పుట్టిందీ పెరిగిందీ హైద్రాబాద్‌లోనే అని, తెలంగాణ ఉద్యమాలే నన్నింతవాడ్ని చేసాయని, కవులు నూతన తెలంగాణ కోసం కృషిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.రెండు వేల మంది సాహితీ వేత్తలు, కవులు, సాహితీప్రియులు పాల్గొన్న ఈ సాహితీ పురస్కారం ప్రధానోత్సవ సభకు ప్రముఖ కవి ఖాదర్‌ మోహియుద్దీన్‌ అధ్యక్షత వహించారు, కవి సీతారాం కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు. ప్రముఖ కవులు దేవిప్రియ, నగ్నముని, శిఖామణి, యాకూబ్‌, ఆశారాజు, అరుణ్‌సాగర్‌, వంశీకృష్ణ, ప్రసేన్‌, ప్రసాదమూర్తి, ఆనందాచారి, సురేంద్రరాజు వాసిరెడ్డినవీన్‌, రామతీర్థ, వాగ్గేయకారులు గోరటివెంకన్న జయరాజు, చక్రధర్‌, తులసిప్రసాద్‌, స్కైబాబా, కొండపల్లి పవన్‌ మొదలైనవారు పాల్గొని అభినందనలు తెలిపారు.పాతికవేలు నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రం శాలువాలతో శివారెడ్డిని అతిథులు ఘనంగా సన్మానించారు. మువ్వా ఫౌండేషన్‌, సాహితీస్రవంతీ, ఫెమా, రవళి సాహితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.ఈ సాహితీ సభలో మొదట వర్ణలేఖ, చైతన్య, అనిల్‌డ్యాని, నరేష్కుమార్‌ల కవితా సంపుటి ''తీరం దాటిన నాలుగు కెరటాలు...'' పుస్తకాన్ని దేవిప్రియ, ఆవిష్కరించారు. దీని తొలి ప్రతిని కవులు తమ గురువు సత్యనారాయణరెడ్డికి అందజేశారు. అనంతరం నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్‌ రచించిన 'స్మృతి' కావ్యాన్ని మాజీ ఎం.పి. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించి తొలి ప్రతిని అంబటి మురళీకృష్ణకు అందించారు. మువ్వా శ్రీనివాస రావు రచించిన ''సిక్త్స్‌ ఎలిమెంట్‌'' కవితా సంపుటిని మాజీమంత్రి తుమ్మలనాగేశ్వరరావు ఆవిష్కరించి, కవి గురువయిన తొటచర్ల వెంకటపూర్ణచంద్రరావుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పల్లా రాజేశ్వరరెడ్డి, లోకసత్తా నాయకుడు రవిమారుత్‌, కళాశాలల యాజమాన్య సంఘ నాయకులు వీరారెడ్డి పాల్గొని సందేశాలిచ్చారు.''ఒక పురస్కారం మూడు పుస్తకాల ఆవిష్కరణ'' కార్యక్రమానికి ముందుగా 'టెన్‌ టివి' వారు అరుణ్‌ సాగర్‌ ఆధ్వర్యంలో ప్రసాదమూర్తి, బిక్కికృష్ణలు కలిసి నిర్మించిన శివారెడ్డి కవిత్వం జీవితం గురించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అద్భుతంగా తీసిన ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను సభికులు ఎంతో ఆసక్తితో తిలకించారు. ఒక సాహితీ వాతావరణం నెలకొని కవితా ఔత్సాహికులకు నూతన ఉత్తేజాన్ని నింపింది. కేవలం కవితా నిర్మాణమేకాదు, కవితా వాతావరణ  నిర్మాణంలోనూ ముందుంటానని తెలిపేందుకు సహమిత్రుల రెండు పుస్తకాలను వెలుగులోకి తేవటం, ఒక సాహితీ ఫౌండేషన్‌ ఏర్పాటు చేయడం, సాహితీ సభను పౌరసాహితీ సభగా నిర్వహించిన మువ్వా శ్రీనివాసరావు పురజనులు, కవుల అభినందనలు పొందారు.- కె.ఆనందాచారి