సంఘర్షణ పథం వైపు సాహిత్యం

గురజాడ సంస్కరణల వైపు సాహిత్యాన్ని తీసుకొస్తే శ్రీశ్రీ సంఘర్షణవైపు సాహిత్యాన్ని తీసుకెళ్లారనీ, శ్రామిక జనావళి వైపు మళ్లించి కవిత్వాన్ని కొత్తపుంతలు తొక్కించారని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యకక్షులు, ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు. శ్రీశ్రీ 30వ వర్థంతి సందర్భంగా శ్రీశ్రీ విజ్ఞాన కేంద్రం 'సాహిత్యం - సంస్కృతి-మీడియా'పై విశాఖలోని పౌర గ్రంథాలయంలో జూన్‌ 15న ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్యవక్త. ఈ సందర్భంగా రవి శ్రీశ్రీ రచనలను ప్రస్తావిస్తూ మహా ప్రస్థానమంటే మరణం కాదు పోరాట మార్గంగా కొత్త అర్థం తీసుకొచ్చారని, జగన్నాథ రథచక్రాలు, సింధూరం అన్న పదాలకు కొత్త అర్థాలు తెచ్చి భాషకు కొత్త శక్తిని తెచ్చారని, అభ్యుదయ శక్తులతో ఆయన పోరాటాల్లో కూడా పాల్గొన్నారని ప్రస్తుతించారు. కవుల్ని అనధికార శాసనకర్తలుగా పేర్కొంటారని చెబుతూ అసహాయుల తరుపున ప్రశ్నించే, ప్రజల తరపున నడిచే శాసనసభ ఉంటే శ్రీశ్రీది సభాపతి స్థానమని చెప్పారు. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే మహాకవి శ్రీశ్రీ అని, ఆధునిక సాహిత్యంలో గురజాడని ఆదికవిగా పేర్కొంటూ ఆయన ప్రారంభించిన అభ్యుదయ సాహిత్యాన్ని కొనసాగించిన కవి శ్రీశ్రీ విశాఖ వారేనని చెప్పారు. శ్రీశ్రీకి ఉన్నన్ని స్మారక కేంద్రాలు ఏ కవికీ లేవని చెబుతూ ఇది ప్రజలపై ఆయన ప్రభావానికి చిహ్నమని పేర్కొన్నారు.
       ప్రజల జీవితంలోంచే సంస్కృతి వస్తుందనీ, ఆధిపత్యం, అణచివేత వర్గాల మధ్య సంఘర్షణలోంచి సంస్కృతి ఉంటుందనీ రవి పేర్కొన్నారు. ఇప్పుడున్న దాన్ని గ్లోబల్‌, ఆధిపత్య, డాలర్‌ సంస్కృతిగా అభివర్ణించారు. శకలీకరణ, వికలీకరణ, వెకిలీకరణ సంస్కృతి విజృంభిస్తున్నాయని అన్నారు. ప్రపంచమంతా ఒక్కటే అని చెబుతూ.. ప్రతి ఒక్కరినీ విడివిడి వినిమయదారుడిగా మారుస్తోందని చెప్పారు. ప్రస్తుత సాహిత్యంలో గత వైభవ స్మరణ, మృతవైభవ స్మరణ అనే ధోరణులను ప్రస్తావించారు. మానవ సంబంధాలను వికలంచేసే వికలీకరణ ఉందని అన్నారు. గ్లోబలైజేషన్‌ అంటే గ్లోబల్‌ బలిపీఠంపై బలిచేసే సంస్కృతీకరణ జరుగుతోందన్నారు. ఆధిపత్యం, వాణిజ్యం, వ్యక్తిస్థాయిలో ప్రలోభపెట్టే సంస్కృతి పెరుగుతోందని అన్నారు. బికక్షువర్షియసి కవితలో 'ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని' శ్రీశ్రీ ప్రశ్నించాడని చెప్పారు. నేటి సంస్కృతి తల్లులను బస్టాండ్లలో విడిచిపెట్టే విధంగా మార్చివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా స్వభావం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం మీడియా నడిపించబడుతోందనీ, మీడియా ద్వారా అంగీకార సృష్టిచేస్తున్నారనీ చెప్పారు. ఇప్పుడున్నదాన్ని బజారు సంస్కృతిగా, మాయాబజార్‌ సంస్కృతిగా పేర్కొంటూ అందులో మీడియాని మాయా పేటికగా అభివర్ణించారు. 

ప్రముఖ రచయిత రామతీర్థ మాట్లాడుతూ మీడియాని అవసరమైన దెయ్యాలుగా పేర్కొంటూ 24 గంటల న్యూస్‌ ఛానళ్లు అవసరాన్ని ప్రశ్నించారు. టివి ద్వారా దుర్మార్గమైన సంస్కృతి ఆవిర్భవించిందనీ, మీడియా ద్వారా సామాజిక ఆత్మహత్య జరుగుతోందని విమర్శించారు. ఒక్కో మీడియాలో ఒక్కోరకమైన కథనాల రావడాన్ని బట్టి మోసపోతున్నది మనమన్నది ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చైతన్యవంతమైన చోదక సాధనంగా పేర్కొన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీశ్రీ విజ్ఞాన కేంద్ర ప్రధాన కార్యదర్శి విఎస్‌ పద్మనాభరాజు మాట్లాడుతూ మానవాళి విముక్తికోసం, నవ సమాజం కోసం శ్రీశ్రీ సాహిత్యం ద్వారా కృషి చేశారని చెప్పారు. శ్రీశ్రీ విజ్ఞాన కేంద్రం ట్రస్టును నూతనంగా ఏర్పాటుచేసినట్టు పేర్కొంటూ ట్రస్టు సభ్యులను పరిచయంచేశారు. ఈ ట్రస్టుకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్‌సి ఎంవిఎస్‌ శర్మ మేనేజింగ్‌ ట్రస్టీగా వ్యవహరిస్తారని చెప్పారు. సాహితీ స్రవంతి విశాఖ నగర కన్వీనర్‌ శ్రీనివాస్‌ తదితరులు ప్రసంగించారు. 
 
కిన్నెర సంస్థ హైదరాబాద్‌ త్యాగరాయగాన సభలో నిర్వహించిన సభలో డా. ద్వానాశాస్త్రి రచించిన 'తెలుగు సాహిత్యంలో హాస్యామృతం' గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న డా. సినారె, డా. యార్ల గడ్డ లక్ష్మీప్రసాద్‌. చిత్రంలో రావికొండలరావు, డా. రాళ్ళబండి కవితాప్రసాద్‌, జి. వల్లీశ్వర్‌, కిన్నెర రఘురాం, డా. ఓలేటి పార్వతీశంలు ఉన్నారు. 
    హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో సచ్చిదానంద కళాపీఠం నిర్వహించిన సభలో డా. ద్వానాశాస్త్రిని సత్కరిస్తున్న డా. సినారె. చిత్రంలో త్రినాథరావు, ఆర్‌. దిలీప్‌ రెడ్డి, కళాదీక్షితులు, రత్కాకర శర్మలు ఉన్నారు.