అనంతపురం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్థంతి

అనంతపురంలోని భగత్‌సింగ్‌ నగరపాలక ప్రాథమిక పాఠశాలలో అనంతపురం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్థంతి సభ జరిగింది. ఈ సమావేశానికి సాహితీస్రవంతి అనంతపురం జిల్లా అధ్యకక్షులు పి. కుమారస్వామి అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి మల్లెల నరసింహమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 1910 ఏప్రిల్‌లో జన్మించిన శ్రీశ్రీ వ్యక్తికాదు శక్తి అన్నారు. 1933 నుండి 1940 మధ్య ప్రపంచం మొత్తం ఆకలిచావులతో ఉన్నకాలంలో అట్టడుగు వర్గాల కోసం రాసిన కవిత్వమే మహాప్రస్థానమని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో 'యోగ్యతాపత్రం'లోని చలం రాసిన 'ఇది మహాప్రస్థానం' సంగతి కాదు ఇదంతా చలం గొడవ, ఇష్టం లేని వాళ్ళు పేజీలు తిప్పేసి  శ్రీశ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు అగాధంలోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి...' అనే మాటలను గుర్తుచేశారు. సాహితీస్రవంతి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి తగరం క్రిష్ణయ్య మాట్లాడుతూ ''శ్రీశ్రీ ఉద్వేగమైన కవిత్వం రాయటమే కాకుండా, తన మాటలలో చమత్కారం తొణికిసలాడేదని అన్నారు. తన స్నేహితుడు నాటిక రాయమని అడిగితే 'రాస్తాను మిత్రమా ఏనాటికైనా' వంటి చమత్కార సంభాషణలెన్నో చేసేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయకార్యదర్శి ఆకుల రఘురామయ్య, షేక్‌  రియాజుద్దీన్‌ అహ్మద్‌, జూటూరు షరీఫ్‌, ప్రగ్న సురేష్‌, వై. నారాయణరెడ్డి, మధురశ్రీ, వెంకటేషు, వెంకటేశ్వర్రావు, యమునారాణి, బి.కె. నారాయణ, నూర్జహాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

            సాహితీస్రవంతి అనంతపురం నగర కమిటీ సమావేశం నగర పాలక ప్రాథమిక పాఠశాలలో జరిగింది. అనంతపురం సాహితీస్రవంతి జిల్లా అధ్యకక్షులుగా పి. కుమారస్వామి ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా తగరం కిష్ణయ్య, నగర కమిటీ అధ్యకక్షులుగా వై. నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ప్రగ్న సురేష్‌, ఉపాధ్యకక్షులుగా వెంకటేశ్వరరావ్‌, సహాయ కార్యదర్శిగా యమున రాణి, కోశాధికారిగా వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులుగా మధురశ్రీ, నూర్జాహాన్‌, బి.కె. నారాయణ, రాజశేఖర్‌లు ఎన్నికయ్యారు.