కష్టజీవుల స్నేహితుడు శ్రీశ్రీ

విజయనగరం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జూన్‌15న విజయనగరంలోని గురజాడ స్వగృహంలో శ్రీశ్రీ వర్థంతి సభ జరిగింది. సాహితీస్రవంతి విజయనగరం కో-కన్వీనర్‌ యస్‌.వి.కృష్ణారావు సభకు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి నూతన ద్వారాలు తెరిచిన వాడు శ్రీశ్రీ అన్నారు. కవి అంటే కష్టజీవుల స్నేహితుడు అని శ్రీశ్రీ రాసిన 'కమ్మరికొలిమి' కవితా చరణాలను ఉదహరించారు. శ్రీశ్రీ శ్రమైకజీవుల పక్షపాతి అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పాత్రికేయులు ఎ.వి. సుబ్బారావు మాట్లాడుతూ సాహితీస్రవంతి వర్థంతి సభలను నిర్వహిస్తూ, కవులను, గాయకులను వారిలోని సృజనాత్మక శక్తిని పదునుపెట్టుకొనేలా ప్రోత్సహిస్తుందని కొనియాడారు. మరో అతిథి పి.వి.జి. నాటక కళాపరిషత్‌ అధ్యకక్షులు, న్యాయవాది యన్‌. రాజా మాట్లాడుతూ శ్రీశ్రీ ముందుచూపుతో చేసిన రచనలు నేటికీ మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. ఆ రోజుల్లో ప్రతీఒక్కరి చేతుల్లో శ్రీశ్రీ 'మహాప్రస్థానం' కనపడేదన్నారు. సాహితీస్రవంతి విజయనగరం జిల్లా కన్వీనరు చీకటి దివాకర్‌ మాట్లాడుతూ శ్రీశ్రీ మార్క్సిస్టు అవగాహనతో సాహిత్యం రాయడం వల్ల ప్రజల సమస్యలు, బాధలు తన బాధలుగా స్వీకరించాడని అన్నారు. కవి రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ ఏ కవి అయితే సమాజం గూర్చి ఆలోచిస్తూ, వారి బాధలను పట్టించుకుని కవిత్వం రాస్తారో అటువంటి కవులు ప్రజల హృదయాలలో ఎన్నటికీ నిలిచే ఉంటారని అన్నారు. 'జోహార్‌ జోహార్‌' అనే గేయాన్ని పాడి వినిపించారు. శ్రీశ్రీ 'మరోప్రపంచం మరోప్రపంచం' గేయాన్ని ఆలపించిన కె. లక్ష్మిని అందరూ అభినందించారు. శ్రీమతి ఆదిలక్ష్మి, శ్రీనివాసరావు, లక్ష్మణరావు తదితరులు తమ కవితలను, గేయాలను ఆలపించారు.