ఇప్పుడు నిశ్శబ్దం కాదు ..!

డా. కటుకోఝ్వల రమేష్‌
99490 83327
తల తెగినప్పటికీ
కొన్ని దేహాలు ప్రయాణం చేస్తూనే వుంటాయి
జిర్ర పురుగులా..

మెదళ్లు లేని తలకాయలు
తల లేని దేహాలు
వున్నా లేకున్నా ఒక్కటే!
తలలుంటేనే కదా.. ఎటుపోతున్నామో
ఎవ్వరి పంచన చేరుతున్నామో
ఏది మంచో ఏది చెడో తెలిసొచ్చేది

దారి తప్పుతున్న భౌతిక పరంపరలు
సమూహమై అలుముకునే సందర్భాలు
ఒకానొక అసంబద్ధ విషపు కాలంలో
ఒక్కొక్కటిగా పోగుపడుతుంటాయి

బతుకు భద్రత నుంచి
అమాంతం నెట్టివేయబడ్డ దేహం
ఒడ్డున పడ్డ చేపపిల్ల మాదిరిగా
గిలగిలా కొట్టుకోవటం
అసంకల్పితంగా జరిగిపోద్ది

పురుగు పడ్డ జామపండులా
మన తియ్యదనాలను
అదృశ్య రూపాలేవో
లోలోపల కొల్లగొడుతూనే వుంటాయి
కడుపు చించుకుంటే
కాళ్ల మీద పడుతుందేమోననీ
ఆలోచించే వ్యవధిలోనే
అలుముకున్న డొల్లతనమంతా
ప్రపంచం ముందు దృశ్యమానమైపోతుంది

ద్వారాలు మూసుకున్న
చీకటి గదుల్లో దాక్కుంటే
నీ దేహంలో పుట్టిన రాచపుండు
సలపటం ఆపదు
కొన్ని గాయాలకు లేపనాలుండవు
కాలమే కరిగి వెన్నపూసై చల్లబరుస్తుంది
కొన్ని తేల్చుకోవాలన్నా విదిల్చుకోవాలన్నా
వెలుగు రెక్కల్ని విప్పుకోవాలి
సమర స్వరాల్ని కప్పుకోవాలి

మింగుడు పడని ఓ చిన్నమాట
శరమై మనసును తొలిచేస్తుంది
మంచంకోడుకు చిటికెన వేలుతగిలినా
ప్రాణం విలవిల్లాడిపోతుంది
సన్నివేశాలు.. సందార్భాలు ఏవైనా
కొన్ని నిట్టూర్పులను తూకం వేయలేం
అనివార్యంగానో అక్రమంగానో తగిలిన గాయం
చిన్నదా.. పెద్దదా.. అనేది
ఇప్పుడు ప్రశ్న కాదు
నాలుగు దార్లు పరుచుకున్న
ఏ కూడలీ
ఇప్పుడు.. నిశ్శబ్దం కాదు..!