సాహిత్య ప్రస్థానం ఏప్రిల్‌ 2021

ఈ సంచికలో ...

కథలు
గోడలు - సింహ ప్రసాద్‌
సరంగు - వంజరి రోహిణి
తులసి కొమ్మ - పెమ్మరాజు విజయ రామచంద్ర
మానసం - కేశిరాజు వెంకట వరదయ్య
ఫ్లాట్‌ ఫ్రెండ్స్‌ - కె ఉషారాణి
కవితలు
అక్షరాల రైలుబళ్లు - సాంబమూర్తి లండ
కర్ఫ్యూ - శ్రీనివాస రెడ్డి
రుతువున రుతువై ... - అడిగోపుల వెంకటరత్నమ్‌
ఎగిరి పో! ..- దారల విజయ కుమారి
ప్రతిరోజూ ఉగాదే!.. - ఈదర శ్రీనివాస రెడ్డి
అతనిపుడు ... చెళ్లపిళ్ల శ్యామల
ఒక సాయంకాలం - ఏటూరి నాగేంద్రరావు
కవితోదయం - భరత్‌ మూరిశెట్టి
ఆమనీ .. ఆలకించు! - చినమర వెంకట రమణయ్య
నాగలి నెత్తిన ... - కంచరాన భుజంగరావు
కవిత్వమంటే ... - ఉప్పరి తిరు రమేష్‌

గోడలు

సింహప్రసాద్‌
99892 24280

వినాయక చవితి.
పూజా మందిరం ముందు మనవళ్ళ పుస్తకాలు, పెన్సిళ్ళతో బాటు ఒక బౌండు పుస్తకం, కొత్త పెన్ను పెట్టాను. మిగతా సామగ్రి సర్దుతుంటే మావారు, కొడుకు, కోడలూ, పిల్లలూ వచ్చారు.
''ఈ లావు పుస్తకం ఎవరిదిరా'' మా వారు అడిగారు.
''నాదేనండీ''
''నీదా? కొత్తగా ఈ అవతారం ఏంటోరు. ఇంతకీ ఏం రాస్తావు, కథా? నవలా? నువ్వు మహా రచయిత్రివైపోతే ఇక నన్నంతా 'భానుమతి మొగుడు' అంటారేమోనోరు!''
ఆయన నవ్వులాటకి అన్నా, నాకు మాత్రం చిరు సంతోషం, గర్వం కలిగాయి. కించిత్తు సిగ్గుగానూ అన్పించింది.

'మది నదిలో' ఆహ్లాద భావాల ప్రవాహం

మద్దాల సునీల్‌
98494 82031

'మది నదిలో' అనే ఈ కవితా సంపుటిలో చిట్టె సిద్ధ లలిత తన మనసులోని భావాలను ప్రవహింపచేశారు. ఈ కవితా సంపుటి ''ఒక ప్రయోగం కాదు.. ఒక ప్రక్రియా కాదు.. పరిశీలన కాదు.. పరిశోధనా అంతకంటే కాదు, ఇది నా మదిలోని జీవ నది. నా మదిలోని ప్రవాహలే ఈ కవితలు'' అని కవయిత్రి చెప్పుకున్నారు. ఈ పుస్తకాన్ని పాఠకుడు ఏకబిగిన చదవడానికి తన కవితా శైలి ఉపకరిస్తుంది. ఇది తన మొదటి కవితా సంపుటి అనే భావన ఎక్కడా రాదు.
కాలంతో పరుగులు పెట్టే మనుషులకు కాస్తంత విరామంలా, విసిగిపోయిన మనసులకు హాయి గొలిపేలా ఉంటాయి ఈ కవితలు. కవయిత్రి రాసిన ప్రతి కవితా ప్రశాంతంగా పరవశింప జేసేలా ఉంది. కవయిత్రి తనకంటూ ఒక నిర్ధిష్టమైన కవితా శైలిని కనబరిచింది. తన చుట్టూ జరుగుతున్న వాటినే వస్తు రూపాలుగా మలచింది.. ''కవిత్వమంటే అర్థం కాని మాటల ప్రయోగం కాదు, నాన్న కోపంలో కూడా ప్రేమను వెలికితీయడమే కవిత్వం..'' సరికొత్త నిర్వచనం ఇచ్చారు.

సారంగదరియా .. సంవాదమేందయా?

తెలకపల్లి రవి
ఒక పాట లేదా రచన సినిమా మరేదైనా హిట్‌ అయిందంటే దానిపై ఒక వ్యర్థ వివాదం లేవనెత్తడం ఒక రివాజుగా మారుతున్నది. అదేదో విషయం గురించి అయితే అదే తీరు. కేవలం దాని మూలం ఏమిటి, అనుకరణా? అనుసరణా? వంటి సాంకేతికాంశాలతో వాదన సాగుతుంది. ఇప్పుడు సారంగ దరియా పాటపై పంచాయతీ కూడా ఆ కోవలోదే. ఫీల్‌గుడ్‌ చిత్రాలు తీయడంలో శేఖర్‌ కమ్ముల సాటిలేని మేటి అయితే, పాపులర్‌ పాటల్లో అందెవేసిన చేయి సుద్దాల అశోక్‌ తేజ. వీరిద్దరూ కలిపి ఫిదా కోసం రూపొందించిన 'వచ్చిండే' ఆల్‌ టైమ్‌ హిట్‌. ఇప్పుడు సారంగదరియా కూడా ఆ తరహాకు చేరిపోయే సూచన లు రావడం వల్ల కావొచ్చు చర్చ రచ్చ సాగాయి. ఇంతా చేసి ఆ పాటలో అంత మధనం చేయాల్సిందేమీ లేదు. దర్శకుడి కోరికపై జానపద తరహాలో కవి ఒక పాపులర్‌ పాట రూపొందించాడు.

సరంగు

వంజరి రోహిణి
90005 94630

ఆకాశమంత విశాలమైన హృదయం.. భూమికి ఉన్నంత సహనం ఉండాలంటారు స్త్రీకి. కానీ రోజురోజుకి మారుతున్న పరిస్థితులు నా సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మా వారు చేసే వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. కొన్ని నమ్మక ద్రోహాలు, మరికొన్ని స్వయంకృతాలు, కొంత మా చేతకానితనం వెరసి అప్పుల పాలై, ఉన్న ఇల్లు అమ్ముకుని తుపాను గాలికి చెదిరిపోయిన గూటిని వదిలి పిల్ల పక్షులతోపాటు కొత్త గూటిని వెతుక్కుంటూ వెళ్ళే పక్షి జంటలా, ఉన్న ఇల్లు, ఊరు వదిలి చాలా దూరం వచ్చేశాం, నేనూ వావారూ.
ఎక్కడ చిత్తూరు, ఎక్కడ హైదరాబాద్‌! ఏ ధైర్యం మమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చిందో తెలియదు. రేపు ఎలా ఉంటుందో తెలియదు. ప్రవాహవేగానికి నదిలో కొట్టుకు పోతున్న చేపల్లా మేము అప్పుల ఊబినుంచి బయట పడాలని, పరిస్థితులు, కాల ప్రవాహానికి అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి పడ్డాం.

శివారెడ్డి.. ఆ నలుగురూ...

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డ్డి
99487 74243

లక్ష్య సాధనలో విజయవంతం కావాలంటే అప్పటికే ఎంతో శ్రమించి అపూర్వమైన అనుభవాన్ని గడించడం ఘననీయమైన విజయంగా భావించవచ్చు. ఒకరి అనుభవాల నుంచి నేర్చుకోవడం, తన అనుభవాలను జోడించి లోన మరిగించి, పుటం పెట్టుకొని, మనదైన ముద్రతో నిశ్చితాభిప్రాయానికి రావడం మన సజీవతా లక్ష్యాలను పట్టిస్తుంది. జీవితం అనేది బయట నుంచి లోనికి కాదు, లోన నుంచి బయటకు వికసించేది. ప్రతి సందర్భాన్ని లోగొన్నప్పుడే వస్తువు బాహ్యజ్ఞానాన్ని కాకుండా అంతర్‌జ్ఞాన అన్వేషణ జరుగుతుంది. వస్తుసారాన్ని బాహ్యజ్ఞానంతోనే కాదు అంతర్‌ జ్ఞాన అన్వేషణతో తాత్త్విక చింతనతో పట్టుకొని అక్షరబద్ధం చేయాలనేది, అనుభవజ్ఞుడైన, స్నేహబద్ధులైన మిత్ర గురువు దొరికి, చెప్పడం అందరికి అందుబాటుగా ఉండే అంశం కాదు. ఏ కొందరికో ఇటువంటి సౌలభ్యం దొరుకుతుంటుంది.
సాహిత్యరంగంలో మిత్రుని రూపంలో గురువుగా తటస్థపడి సహృదయత, ఆత్మీయతను ఆరవోస్తూ ఎడతెగని కవితా ప్రవాహ స్పర్శతో ఎంతో మంది కవులకు కొత్త కాంతినద్దిన కవి కె శివారెడ్డి. నడుస్తున్న సమాజాన్ని జీవితాన్ని ఎలా గర్భీకృతం చేసుకోవాల్సింది,

తులసి కొమ్మ

పెమ్మరాజు విజయ రామచంద్ర

9849744161
రాత్రి ఎనిమిది గంటలు దాటింది. కమల ఇంట్లోకి, బైటకి తిరుగుతోంది. గోపాల్‌ ఆఫీసు నుంచి ఇంటికొచ్చాడు. స్థిమితం లేకుండా తిరుగుతోన్న కమలని చూసి ''ఏమైంది, అలా తిరుగుతున్నావు'' స్కూటర్‌ స్టాండ్‌ వేస్తూ అడిగాడు.
''నికిత ఇంకా రాలేదండీ, ఎందుకో నా కాలు, చేయి ఆడడం లేదు. గుండె దడ దడ లాడిపోతోంది'' టెన్షన్‌ తో చెప్పింది.
''కంగారు పడకు, స్కూలుకి ఫోన్‌ చేద్దాం'' గోపాల్‌ స్కూలుకి ఫోన్‌ చేశాడు.
ఫోన్‌ మోగింది. సమాధానం రాలేదు. స్కూటర్‌ స్టార్ట్‌ చేసి స్కూలుకి బైలుదేరాడు. స్కూల్‌ గేటుకున్న తాళమేసుంది. గేట్‌ పక్క చెక్కబల్ల మీద కూర్చున్న వాచ్‌ మెన్‌ ని. '' పిక్నికుకి వెళ్ళిన పిల్లలు వచ్చేశారా?'' అడిగాడు.
''ఇప్పుడేటి సార్‌, పిల్లలు వచ్చి రెండు గంటలయ్యింది. డ్రైవర్లు బస్‌ ఇడిసేసి ఇంటికెళ్ళి రెండుగంటలవుతుంది. గోపాల్‌ గుండెల్లో అలజడితో ఇంటికి తిరిగొచ్చాడు.

నిజ జీవితాలకు అద్దం పట్టిన కథలు

కేశవ్‌, కోల్కతా
98313 14213

అంపశయ్య నవీన్‌ కలంలోంచి వెలువడిన పాత్రలు ఎక్కడో కథల పుస్తకాల పేజీల్లో అందమైన వర్ణనల మధ్య దాగొని ఉండవు. మన చుట్టూనే తిరుగుతుంటాయి. ఓ విష్ణువర్థన్‌ని మన ఆఫీసులోనే చూసినట్టుంటుంది. ఓ వాసంతి మన కాలనీలోనే ఎక్కడో ఓ మూల కన్నీళ్ళను తుడుచుకుంటూ పుంజుకున్న చైతన్యంతో ఇంటి నుంచి బయటికి వస్తున్నట్టుంటుంది. ఒక వినోద్‌, ఒక ప్రకాశ్‌ మన దగ్గరే ఏ ఛారు దుకాణంలోనో మాట్లాడుతూ కనిపిస్తారు.
14 కథలతో 'యానాంలో ఒక రోజు' టైటిల్‌తో ఇటీవల వచ్చిన అంపశయ్య నవీన్‌ గారి కొత్త కథల పుస్తకం కరోనా నేపథ్యంలో జీవితాన్ని స్పృశిస్తూ ముందుకొచ్చిన మంచి సాహితీ సృజన. ఒక్కో కథ ఒక్కో మానవతా విలువనీ, జీవిత వాస్తవాన్నీ మనముందుంచుతుంది. 'యానాంలో ఒక రోజు' టైటిల్‌ కథ గొప్ప సాహితీ సృజనగా చెప్పొచ్చు. 21వ శతాబ్దంలో కూడా హానర్‌ కిల్లింగ్‌ పేరు మీద ప్రేమికుల పట్ల అత్యాచారాల నేపథ్యంలో అత్యంత పాశవిక చర్యను గొప్ప సాహితీ సృజనతో కవితలూ, సాహిత్యం కలగలిపి కథను నడిపే విధానం చేయి తిరిగిన అంపశయ్య నవీన్‌కే సాధ్యమయ్యే సాహితీ ప్రక్రియ.

మానసం‌

కేశిరాజు వెంకట వరదయ్య
98491 18254

''హేరు తేజస్‌! లేవ్వయ్యా... తొమ్మిది గంటలు దాటింది. నిన్ను, చిన్నినీ నిద్ర లేపడం రోజూ నాకో డ్యూటీ అయింది. మానస్‌ని చూడు... ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎలా రెడీ అయి కూర్చున్నాడో! లే ఇక!'' అతను కప్పుకున్న బ్లాంకెట్‌ లాగేస్తూ అసహనంగా అంది కమల.
''ఈవేళ క్లాసులు లేవు. కాసేపు పడుకోనీ పిన్నీ''
''అదేంటి ? పదింటికి క్లాస్‌ ఉందన్నావుగా'' గుర్తు చేసింది కమల.

అస్తమించిన 'రాత్రి సూర్యుడు'

కెంగార మోహన్‌

94933 75447
జనవరి 30న తను ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ పెట్టాడు : 'మరణానికి ముందే బతకాలి, అప్పుడే మరణించినా బతుకుతాడు' అని. ఇప్పుడా పోస్ట్‌ గుర్తొచ్చి కెరె జగదీశ్‌ గురించి తలుచుకునేలా.. మళ్ళీ మళ్ళీ కన్నీళ్ళలో ముంచేలా చేస్తోంది. అతడు అక్షరమై పుట్టినవాడు. కవితా వాక్యమై అనతికాలంలోనే అందరూ తనను చూసేలా చేసినోడు. ఆర్ద్రత, అభినివేశం, అభివ్యక్తి, అనిర్వచనీయ భావుకత కలిగిన కవిత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచినవాడు. 2011 కంటే ముందు వివిధ పత్రికల్లో విస్తృతంగా కవిత్వం రాసినా ఆ ఏడాది సముద్రమంత గాయంతో సాహిత్యలోకానికి పరిచయమైన కవి కెరె. నాటి నుంచి పదకొండేళ్ళ సాహిత్య ప్రయాణంలో నాలుగు కవిత్వ సంపుటులను తెలుగు సాహిత్య లోకానికి అందించాడు. అలవోకగా కవిత రాసి పడేసి ఏదో ఓ పత్రికకు ఈమెయిలో, పోస్టో చేసేసి తాపీగా ప్రచురణ కోసం ఎదురు చూసే రకం కాదు జగదీష్‌. ఒక కవిత రాయాలంటే రోజులు, నెలలు.. వస్తువు కోసం కాళ్ళరిగేలా తిరిగి తిరిగి పరిశీలించి, పరిశోధించి అక్షరీకరించే మొండోడు.

మట్టి మాటలే కవిత్వమై..

డాక్టర్‌ బిరుసు సురేష్‌ బాబు
75694 80800

కదిలించేలా కవిత్వం రాయడమంటే అంత సులభమైన విషయమేమీ కాదు. అలా రాయడం తెలిసిన వ్యక్తి కవిత్వంతో ఆడుకోగలడు, పాడుకోగలడు, తన గుండెకు తాకిన ప్రతి వేదనను కవిత్వ జల్లుగా వర్షించగలడు. పీడిత వర్గాల వెనుక నిలబడి పోరాటం చేయగలడు. ఆ కోవకు చెందిన కవే పల్లిపట్టు నాగరాజు.
సామాజిక అంశాలను కవితా వస్తువులుగా చేసుకొని, పదునైన భాషను, అభివ్యక్తిని కవిత్వంలో ఒంపుకొని బలమైన కవిత్వాన్ని రాస్తున్న యువకవిగా పల్లిపట్టును చెప్పవచ్చు. పుట్టింది చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకటాపురం గ్రామం. పేదరికం, ఆకలి, వేదన, అవమానాలు, పీడన, దోపిడీ ఇలా అడ్డుగా వచ్చిన ప్రతి దాన్ని కవితానిచ్చెనగా మలచుకొని తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకున్నాడు.