ప్రవహించే ఆత్మ

శ్రీధర్‌ కొమ్మోజు
99894 64467

త్రయంబకంలో ఊపిరి పోసుకుని
బాసర, భద్రాద్రి దాటుకుంటూ
కోనసీమ వడ్డాణం చుట్డుకుని
అంతర్వేది నరసింహుని సన్నిధిలో
కడలిని ముద్దాడతావు !

చంద్రికలు నీ తరగలపై మెరుస్తుంటే
'విశ్వనాథ' కిన్నెరసాని
వెన్నెలపైట వేసుకున్నట్టుంటుంది
'నండూరి' ఎంకి గలగలమంటూ నవ్వుల్ని
మాపైకి రువ్వుతున్నట్టుంటుంది.
'బాపు' నీ సౌందర్యాన్ని కుంచెకు పట్టించి
బమ్మలకి సొగసులద్దుకున్నాడు!
నీ నడకల సంగీతం ఆస్వాదిస్తూ
రామదాసు కీర్తనల నైవేద్యం చేశాడు!

నీ అలల అద్దాల్లో జాబిలిని చూసుకుని
మురిసిపోయి మైమరచిన క్షణాలెన్నో!
నీ ఒడిలో ఎగిసిపడే చేపపిల్లలు
వెన్నెల కాంతుల్లో మిలమిల మెరుస్తూంటే
నక్షత్రాలు నిన్ను ముద్దాడినట్టు ఉంటుంది
నీ మేనిపై నావలు సాగుతున్నపుడు
నిశ్శబ్దపు రాత్రిలో నీటిపొరల చప్పుళ్ళు
నా జ్ఞాపకాలపై మధుర సంతకాలు!

తీర ప్రజల ఆత్మవు నీవు
బంధాల చెలియలకట్ట దాటి
కడలి పరమాత్మలో లీనమవుతూ
గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతావు !

ఏర్లూ, సెలయేర్లూ, ఉపనదులనే కాదు
తీర కాలుష్యాలనూ మమేకం చేసుకునే
నీవొక సమైక్యతా ప్రతిరూపానివి
నీ గమనం ... మా జీవనం ఒక్కటే !