మన్ను భాషలో మొలకెత్తిన కవిత్వం

శ్రీరామ్‌
99634 82597

శైలజ గారి లాంటి వైద్యులు కవిత్వం రాయడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది ఆ పని చేశారు. ఆ మాట కొస్తే వైద్యమే కాదు, ఏ వృత్తిలోనివారైనా కవిత్వం రాసినపుడు అందులో ఆ వృత్తి ప్రతిఫలిస్తున్నదా లేదా అని ఒక వ్యర్ధ పరిశీలన చేయాలనిపిస్తుంది. ఏం? ఎందుకని అంటే? ఆయా వృత్తి తాలూకూ కొత్తదనమేదన్నా ఆ కవిత్వానికి వెలుగు తెస్తున్నదా అన్న ఆతృత వలన. మరీ ముఖ్యంగా ఆ కవుల పని విశేషం వాళ్ళ కవిత్వ వస్తువు మీద చూపెట్టే ప్రభావం ఎంతటి లోతుల నుండీ తన్నుకొస్తుందా? అని కూడా. అయితే కవిత్వంలోని లోతునెలా కొలవగలం? దానికేం పరికరం ఉంటుందీ? శైలజ గారి కవిత్వంలోని డాక్టరు గిరీ ఆపరేషన్‌ ధియేటర్‌, ఆసుపత్రిలో జైలూ, దగ్ధ పరిమళం, చివరాఖరికి లాంటి కవితల్ని ప్రాణవంతం చేయడం పాఠకుణ్ణి కట్టి పడేస్తుంది. అది ఆమె వృత్తి గొప్పతనం కాదు. వృత్తిపరమైన జీవితంలోంచి కూడా సజీవంగా ధ్వనించగలిగిన ఆమె చైతన్యానిది. ఆమె దాన్ని ఎలా పరిరక్షించుకుందీ, పలికించిందీ వేరొక విషయం. ముందుగా ఆమె కవిత్వ ప్రాతిపదిక అనుభవ తలానిది కావడం కొంగలు గూటికి చేరేవేళ అన్న ఆమె తాజా పుస్తకానికి ముఖ్యమైన వన్నె. శాస్త్రీయవాదులు ఈరకంగా ఉండటం చిన్న విషయం కాదు. అందునా శైలజ గారిలాంటి బుద్ధి జీవులు కవిత్వంలోకి తమ తెలివితేటల్ని జప్పించారా లేక హృదయ స్పందనల్నా అన్న వెతుకులాట తేల్చగలిగిందేమీ కాదు, లేదు గానీ ఆమె కవితల్లోని చైతన్యం పురోగమన శీలత నుండి కన్ను తెరవడం ఆనందాన్నిస్తుంది. లేకపోతే బర్న్స్‌ వార్డులో స్త్రీ అంతరంగాన్ని, కాన్పు బల్లపై తొమ్మిది నెల్ల ఎదురు చూపుని, జైలు నుంచి వొచ్చిన ఖైదీ రోగుల్ని, (వ్యధార్థ గాధలుగా) ఇంకొకరైతే కవితల్లోకి తేవడం అసాధ్యం. శైలజ వీటన్నింటినీ సమర్ధవంతంగా కవిత్వపరం చేయడంలో వస్తువును విశేషమైన నిర్దిష్ట పరిధిలో ఉంచిన ప్రయత్నముంది. అందుకు ఈమె తీసుకున్న స్వేచ్ఛని కూడా ప్రశంసించాలి. వ్యవస్థని, అందులోని లోపాలను, మంచి చెడులను నవ్వులపాలు కాకుండా బయట పెట్టడం కష్టసాధ్యమైన పని. శైలజ వ్యథార్థ గాధలు విభాగం అందుకు మంచి ఉదాహరణ. అయితే ఈ గుణం తత్తిమా కవిత్వం మొత్తానికీ వర్తించదు. ఎందువల్ల?
'నా చుట్టూ' అని చేసిన విభాగం ఊదా పూలు లాంటివి విభాగ శీర్షికలతో నిర్నిమిత్తంగా గమనిస్తే శైలజలోని సంప్రదాయ పునాదులు తెలిసివస్తాయి. ఆమె కవిత్వ లక్ష్యం పట్ల కూడా మనకొక అవగాహన వస్తుంది. శైలజలోని సామాజిక కోణం ఎదుర్కొన్న అనేక పరిమితులు అర్థమవుతాయి. సంప్రదాయ అనగానే భావ కవిత్వమ్మాత్రమనే ఛాయలనుకునే రోజుల్లో లేము. ఆ మాటకొస్తే కృష్ణశాస్త్రిని, తిలక్‌నీ ఈ కవయిత్రి చాలా అభిమానిస్తారు. గాంధీ పట్ల ఎనలేని ఆపేక్ష ఉంది. ఆయనపై 'నవతరానికి రోల్‌ మోడల్‌ గాంధీజీ' అన్న పుస్తకం కూడా రాశారు. ఇంకా ఆమెలోని ప్రకృతి ప్రేమ, దైవ చింతన, లోతైన తత్వ వివేచన లాంటి లక్షణాలు ఆమె కవిత్వ సారాన్ని ఇట్టే గ్రహించడానికి ఉపయోగపడతాయి. అవధానుల మణిబాబు ఈ పుస్తక ప్రస్తావనలోనే 'తొలి పుస్తకాల్లో సాధారణంగా వస్తువు, శిల్పం,
అభివ్యక్తి వీటన్నింటా మన బహుముఖీనతను తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. లేకపోతే సాహిత్య సమాజం ఇతడు ఫలానా కవిత్వం మాత్రమే వ్రాస్తాడూ అనే ముద్ర పడే ప్రమాదం ఉంటుంది' అంటారు. (ఆంధ్రప్రభ, 02.05.22) శైలజలో ముద్ర వేసేంత ఏకోన్ముఖ భావజాలమూ లేదు. వేయకుండా వదిలేసేంత సార్వజనీన ఉదాత్తత కూడా లేదు. ఒకటి మాత్రం నిజమనిపిస్తుంది. అది ఆమెలోని నిజాయితీ. ఏ ఆలోచనని అక్షరంలోకి తీసుకొచ్చినా అందులో ముసుగు వేయనితనం ఒకటుంది. అందుకు మనమామె కవిత్వాన్ని ఇష్టంగా చదవొచ్చు.
ప్రధానంగా ఆమె తట్టినంతనే జల జల మని కన్నీరయ్యే తల్లి గుండె గల కవయిత్రి. రోడ్డు దుర్ఘటనలో ఎదిగిన కొడుకును పోగొట్టుకున్న తల్లి.. 'మాయమైన నువ్వు - మాయలాంటి మనం', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి కవితలు రాస్తే మనమేమయిపోతాం? జన్మలే నిజమైతే నిన్ను మరింత ప్రేమిస్తాను (పేజీ 36) అన్నప్పుడు 'ముందు' గుండె చిక్కబడుతుంది. ఆ తరువాత తేలికపడ్డానికి మెదడు సహాయం తీసుకోవలసి వస్తుంది. ఎందుకంటే శైలజ 'ఎంత చీకటి రాత్రినైనా నక్షత్రాల రజనుతో' వెలిగించగల శక్తి గల కవయిత్రి. జీవితంలో పెనవేసుకోలేని అనుబంధాల పేదరికాన్ని, వెన్నెల భోజనాల్లోని వెలుగు నీడల సయ్యాటల్ని, ఆమె చిత్రించిన వైనానికి ఆశ్చర్యపోతాం. 'ఓటమిలోంచి వికసించే రహస్యం పట్టుబడింది. విషాదం కన్నా జీవితం తీయనిది (పేజి 104) అన్నప్పుడు సమాధానపడతాం. ఒక కవి అంతరంగంలో వృత్తిపరమైన అనుభవాల వ్యక్తీకరణల్లోంచి దాచలేని పునర్విమర్శని, వ్యక్తిగతమైన పెనుగులాటల్లోంచి నలిగి పెల్లుబికే జీవన సారాంసాల్నీ ఒకే సమయంలో పాఠకుడు తాకి తట్టుకోవడం సులువు కాదు. చదువరుల్లో శైలజ ఈ రకమైన ఉద్వేగాల్ని కలిగించడంలో విజయం సాధించారు.
శైలజకి మార్గదర్శి కరుణామూర్తి. కవిత్వంలో బౌద్ధ ప్రభావం కనిపించకపోయినా, నేపధ్యాలు ఎక్కువగా కరుణ రసాన్వితమైన స్పందనలుంటాయి. కవితల నిండా అంతర్నేత్రం వెలుగు సోకే ప్రదేశాలెక్కువ. దివ్యాంగుల గురించి రాసిన దివ్యలోకం, వృద్ధుల గురించిన వృద్ధాప్యం, వాయులీనం, గూర్ఖా గురించిన అజ్ఞాతవీరుడు, రచ్చబండ, సరిహద్దు రేఖ లాంటి కవితలు వస్తు పరంగా కొత్త కోణాల్ని చూపెడతాయి. శైలజ ఎక్కువ జ్ఞానవంతురాలు. ఆమె జ్ఞాన ఛాయలు కవిత్వంలోకి చాలా సందర్భాల్లో చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తాయి. రోజూ తన చుట్టూ జరుగుతున్న సంఘర్షణలకి శైలజ ధైర్యంగా ఎదురుతిరిగే లక్షణాన్ని చూపెడుతుంది. రాజీ ప్రదర్శించదు. మృదువుగా ఉంటూనే శిల్పాన్ని నిర్ణయాత్మకం చేస్తుంది. ఇక్కడ కొన్ని మినహాయింపులు చేయాలంటే.. వ్యథార్థ గాధలు అన్న విభాగంలో ఉన్నంత సూటిదనం, నిక్కచ్చి మిగతా విభాగాల్లో ఉండదు. ఆసుపత్రి అనే ఒకే వాతావరణంలో కవయిత్రి చూపెట్టిన గొప్ప వైవిధ్యం మిగతా కవిత్వ వైశాల్యంలో లేదు. కళాత్మక వ్యూహం లేనట్టున్నా ఈ కవితల నిర్మాణంలో ఒక అందముంటుంది. ధార ఉంటుంది. భావానికీ, భాషకీ మధ్య అక్కడక్కడా పొసగనితనం శైలికి కావల్సిన సరళతని కూడా సూచిస్తుంది. మొదటి సంపుటికుండే సౌందర్యం ముందు అసలు కవితల్ని నాలుగు విభాగాలుగా విభజించడం వలన జరగని మేలు ఏరకంగానూ అవరోధం కాలేదు.
'రాగం ప్రాచీనమే, భావం పురాతనమే. ఆలపించే గళాలు కొత్తవవుతాయి' అని చెప్పే ఈ కవయిత్రి ప్రతి కవితా వాక్యంలోనూ సహజత్వంతో కూడిన నవీన భావనల సముదాయముంటుంది. ప్రతి క్షణమూ ఇంద్రియాలకు కొత్త అనుభూతినిచ్చే అవకాశం చాలా ఎక్కువిస్తుంది. ప్రతీ కవికీ మొదటి పుస్తకంలో ఎలా రాశామన్న స్పృహ ఎక్కువుంటుందా? ఏం రాశామన్న ఎరుకనా? ఏది ఏమయినా శైలజ గారు కవిత్వాన్ని చాలా సీరియస్‌ వ్యవహారంగానే భావిస్తున్నారన్న సాంస్క ృతిక సందర్భాన్ని ఈ 'కొంగలు గూటికి చేరే వేళ' కవిత్వ సంపుటి తెలియజేస్తోందని మాత్రం రూఢిగా చెప్పదలుచుకున్నాను. (పుస్తకం కోసం అనల్పను సంప్రదిం చండి.. ఫోను 7093800303. ధర రూ.150)