మట్టి మాటలే కవిత్వమై..

డాక్టర్‌ బిరుసు సురేష్‌ బాబు
75694 80800

కదిలించేలా కవిత్వం రాయడమంటే అంత సులభమైన విషయమేమీ కాదు. అలా రాయడం తెలిసిన వ్యక్తి కవిత్వంతో ఆడుకోగలడు, పాడుకోగలడు, తన గుండెకు తాకిన ప్రతి వేదనను కవిత్వ జల్లుగా వర్షించగలడు. పీడిత వర్గాల వెనుక నిలబడి పోరాటం చేయగలడు. ఆ కోవకు చెందిన కవే పల్లిపట్టు నాగరాజు.
సామాజిక అంశాలను కవితా వస్తువులుగా చేసుకొని, పదునైన భాషను, అభివ్యక్తిని కవిత్వంలో ఒంపుకొని బలమైన కవిత్వాన్ని రాస్తున్న యువకవిగా పల్లిపట్టును చెప్పవచ్చు. పుట్టింది చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకటాపురం గ్రామం. పేదరికం, ఆకలి, వేదన, అవమానాలు, పీడన, దోపిడీ ఇలా అడ్డుగా వచ్చిన ప్రతి దాన్ని కవితానిచ్చెనగా మలచుకొని తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకున్నాడు.
ఈ ప్రపంచీకరణ కాలంలో, ఈ టెక్నాలజీ యుగంలో ఒక కొత్త కవి నుంచి ఇంత గొప్ప కొలమానాలతో కవిత్వం వస్తుందని బహుశా చాలామంది ఊహించకపోయి ఉండవచ్చు. వర్తమాన పల్లె జీవతాన్ని, యాసను 'యాలై పూడ్సింది' అనేతన మొదటి కవితా సంపుటిలో సజీవంగా నింపే ప్రయత్నం చేశాడు కవి.
52 కవితలతో తెలుగు సాహితీ వినీలాకాశంలోకి ప్రవేశించిన 'యాలైపూడ్సింది' కవితా సంపుటిలో వస్తు వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. కవి గుండెను కదిలించిన ప్రతి విషయమూ కవితగా రూపుదిద్దుకుంది. వస్తు వైవిధ్యంతో పాటు శిల్ప చాతుర్యం, పాఠకున్ని కట్టిపడేసే అభివ్వక్తీకరణ, శిల్పం ఇందులోని ప్రతి కవితలో మనకు కనిపిస్తుంది. గ్రామీణ దళిత కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగి వచ్చిన కవి కావడం వల్ల సహజంగానే తాను పల్లె నుంచి విశ్వవిద్యాలయం దాకా కులం కోరల్లో చిక్కుకున్న సమాజాన్ని సునిశితమైన దృష్టితో చూడగలిగాడు. తన సొంత అనుభవాలే కవిత్వ రచనకు కావలసినంత ముడిసరుకులుగా మారాయి.
''నేను పలానా'' అనే కవితను గమనించినట్లయితే
''నేను నంజరే తింటానో
గెంజినీళ్లే తాగతానో
నా కూటికుండ కాడా నోటికవణం కాడ
ఎవడి కులుకుతనమో ఏందయ్యా
నన్ను వారగట్టినోళ్లెవరూ
మా వాకిట్లోకి రావద్దు మాకొట్టంలోకి దూరొద్దూ
మా గొడ్లపెంటతోసే పొరక్కట్టకి అంటురోగం అంటుకుంటాదేమో..''
కులవ్యవస్థ పునాదిగా కలిగిన భారతదేశంలో వేలయేండ్లగా అస్పృశ్యతను అనుభవిస్తున్న దళితుల ఆక్రోశాన్ని కవి ఈ కవిత ద్వారా వెల్లగక్కుతాడు. తన సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని శాసిస్తున్న శక్తులపై తిరుగుబాటుకు పూనుకుంటాడు.
ఒక్క దళిత జీవితాన్నే కాకుండా ఈ సమాజంలో వెనక్కు నెట్టబడి సాంఘికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా అణగదొక్కబడ్డ వర్గాల పక్షాన కూడా కవి గళమెత్తాడు.
''ఎన్నెన్ని ముఖాలను
ఎంత అందంగా పొగడ్రా పూసి
పెళ్ళి కొడుకుల్ని చేస్తూ ప్రతిపూటా
రెట్ట నొప్పులతో మూలుగుతున్నామో'' అంటూ 'మంగలి న్యాయం' కవితలో మంగలి వృత్తి సామాజిక వర్గాల శ్రమను, వారి బాధలను కవి తన సొంతం చేసుకొని గుండెలకు హత్తుకోగలిగాడు. ఇదే కవితలో-
''పనిని కులంజేసి
కులాన్ని కట్టడీ కలుగుల్లో పాముని జేసినా
జుట్టు ముళ్లన్నింటినీ కత్తిరించి
మా కత్తెరకు ఏ కుళ్లిన కట్టుబాట్లు అడ్డుగావని
ప్రతి కూడలిలో అంగళ్లు తెరిచినాం''
వృత్తులను కులాలుగా మార్చి ఆ వృత్తులలో హెచ్చుతగ్గులు నిర్ణయించిన వైనాన్ని ప్రశ్నించాడు. అయితే ఆ వృత్తినే ప్రాణంగా నమ్మి బతుకుతున్న మంగలి వారు కుల కట్టుబాట్ల కంచెలు దాటి ఒక సమైక్యతా భావంతో ముందుకు కదులుతున్నట్లుగా ఈ కవితలో చెప్పాడు.
'పండగ్గెద్దె' కవితలో పేదల ఆర్ధిక దుస్థితిని చెబుతూ ... ''వచ్చే పోయే పండగదినాల అలికిడి వింటేనే
పెద్దోళ్లు మొద్దుబారిపోతుంటారు
పిలకాయల ముదిగారం తీర్చలేక
అప్పులమడుగులో కూరుకుపోతూ
సద్దో గిద్దో తాగి పొద్దెల్లదోస్తున్న
కడగొట్టుతనాల అయ్యలమ్మలు అవిసిపోతారు'' అంటూ నిబద్ధత కలిగిన కవిగా కదిలిపోతాడు. కడుపు నిండిన కవిత్వం పండగలంటే పిండివంటల గురించి, కొత్త బట్టల గురించి మాట్లాడుతుంది. ఈ కవిది మాత్రం కడుపు ఎండిన వారిని గురించి పరామర్శించే కవిత్వం. పండుగ వచ్చిందంటే అందరికీ ఆనందం, సంతోషం. కానీ పండగంటేనే భయపడిపోయే పేదలు ఇక్కడ కవికి కనిపించారు. ఆ పండుగ కోసం పిల్లల బట్టల కోసం, తిండికోసం అప్పుల పాలవుతున్న అట్టడుగు వర్గాల అమ్మానాన్నలు కవికి కవితా వస్తవులయ్యారు. ఊరు నిద్రలేవకముందే వీధులన్నీ ఊడ్చి శుభ్రం చేసే శ్రమజీవుల గురించి 'సపాయమ్మలు' కవితలో
''దినమంతా చీపురుకట్టలై కదిలే
ఆ చేతులకు ఎన్ని సలాములూ చేయాలి?
ఎండంతా నెత్తిమీద కొంగై తిరిగే వాళ్లకు
చెత్తబుట్టలు మోసే ఆ వీపులకు చేతులెత్తి
ఎన్ని దండాలు పెట్టాలి?'' అని మననం చేసుకుంటాడు. మన చుట్టూ ఉన్న చెత్తను, మురికిని శుభ్రం చేసే సపాయి కార్మికులను కొందరు హీనంగా చూస్తుంటారు. వారి పట్ల దురుసుగా మాట్లాడుతూ చులకన భావం కలిగి ఉంటారు. అయితే మనం చేసిన మురికినంతా వారి చేతులతో ఎత్తి శుద్ధి చేస్తున్న సపాయమ్మల శ్రమను కవి తన కవిత్వంలో భాగం చేసుకున్నాడు. వారి వెలకట్టలేని శ్రమకు సలాం చేస్తన్నాడు, చేతులెత్తి దండం పెడుతున్నాడు.
సామాజిక కవిగా మాత్రమే కాకుండా రాయలసీమ అస్తిత్వ కవిగానూ గొంతువిప్పుతూ 'కరువు ఋతువు' కవితలో ఇలా అంటాడు : ''చుక్క రాలని ఈ మట్టిలో
దుక్కమే నవ్వుతుంటది
దుక్కమే ఏడుస్తుంటది
దుక్కమే ఎక్కిరిస్తుంటది
ఎక్కడైనా ఋతువులు మారుతుంటాయి
ఇక్కడ కాలం పొడవూతా ఒకటే రుతువు
కరువు కొడవళ్లతో నమ్మకపు గొంతులు కోస్తూ..''
రాయలసీమ రైతులు వాన కోసం ఎదురు చూస్తూ చూస్తూ అది రాకపోగా నిత్యం కరువు కోరల్లో చిక్కుకపోవడాన్ని కవి ఈ కవితలో ప్రతిబింబిస్తాడు. చినుకు కోసం ఎదురుచూసే రైతన్నకు చివరకు దుఃఖమే మిగులుతుంది. ఆరు ఋతువులకు బదులుగా ఒకే ఋతువు రాయలసీమలో నిరంతరం తాండవిస్తూ ఉంటుందని, అదే కరువు ఋతువు అని ఈ ప్రాంత దీనస్థితిని పాఠకుల కళ్లముందుంచుతాడు.
వర్తమాన భారతంలో గోవు పేరిట జరుగుతున్న అరాచకాలను 'చర్చ' కవితలో నిగ్గదీసి ఇలా అడుగుతాడు.
''వధను గురించి మాట్లాడే ముందు
వ్యధను గురించి మాట్లాడాలి
వధవంకన మృగాలు చేస్తున్న వేలవేల వధల గురించి
మైకులు విడవకుండా మాట్లాడాలి
జంతువును గురించి మాట్లాడేముందు
మనిషి గురించి మాట్లాడాలి''
దేశంలో జరుగుతున్న వర్తమాన వాస్తవిక పరిస్థితులను కవి ఈ కవితలో చర్చకు పెట్టాడు. పశువును పవిత్రంగా చూస్తూ, మనిషిని అసహ్య జంతువుగా చేసి దూరంగా నెట్టేస్తున్న రాజ్యం పోకడలను ఎత్తిచూపాడు. పశువుకిచ్చినంత ప్రాధాన్యత మనిషికి ఇవ్వకపోవడం గురించి ప్రస్తావించాడు. అందుకే వధను గురించి మాట్లాడేముందు ఊరికి దూరంగా వెలివేయబడ్డ మనిషిపడే వ్యధను గురించి మాట్లాడాలంటాడు. జంతువును గురించి మాట్లాడేముందు మనిషి గురించి మాట్లాడాలంటూ మానవత్వపు పరిమళాన్ని ఆకాంక్షిస్తాడు. అంతేకాదు..
''యవుడు కూడు వోడు తింటావుంటే...
కూటికుండ కాడా/ కూరసట్టి కాడా...
కారుకూతలేంది..ఈ కత్తి గాట్లేందీ..
కాలమిట్టా కడతేరిపోవాల్సిందేనా..!?'' అంటూ 'యాలైపూడ్సింది' కవితలో కుల మత రాజకీయ ముసుగులో దళితుల, ముస్లింలపై జరుగుతున్న మానసిక, సాంస్కృతిక దాడిని ఖండిస్తాడు.
''వారగా బోండప్పా/ యాలై పూడ్సింది...
వాకిలి చిమ్మాలా.../ కల్లాపు జల్లాలా...'' అంటూ మకిలిని మనసులో దాచుకున్న ఈ కులవ్యవస్థను, కులహంకార తత్త్వాన్ని కడిగిపారేసేందుకు సమయం ఆసన్నమైందన్న ఒక హెచ్చరిక ఈ కవిత ద్వారా సమాజానికి ఇస్తాడు.
ఇలాంటి గుండెను తట్టిలేపే కవితలు ఈ కవితా సంపుటిలో పుష్కలంగా ఉన్నాయి. కవిలోని నిజాయితీ, నిష్కల్మషత్వం ప్రతి కవితలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కవి బాల్య స్మృతులు, రైతుల వెతలు, ఎన్నికల్లో రాజకీయ దోపిడీలు, ప్రపంచీకరణలో మనిషి నలిగిపోతున్న దృశ్యాలు ... ఇలా కవి తనకు తారసపడ్డ ప్రతి విషయాన్ని కవితగా మలచగలిగాడు. 'యాలైపూడ్సింది' కవితా సంపుటిలో వర్ణణలు, భావచిత్రాల విషయంలో ప్రత్యేకత కనిపిస్తుంది. వాటిని అసహజంగానూ, అతికించినట్లూ కాకుండా మాట్లాడుతున్న విషయం తాలూకు వాస్తవ జీవితం నుండే, తాను బతుకుతున్న వీధి భాషనుండే వాటిని వినియోగించాడు. ఈ కవితా సంపుటిలో అడుగడుగునా మట్టి పరిమళాలతో పూసిన చిక్కటి కవిత్వం కనిపిస్తుంది.
ముందుమాటలో ప్రముఖ కవి కె.శివరెడ్డి గారు అన్నట్టు కొత్తతరం కవుల్లో బలమైన కవిత్వం రాస్తున్న వారిలో పల్లిపట్టు నాగరాజు ముందువరుసలో ఉంటాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంత యాసను, నుడికారాన్ని విరివిగా సీమ భాషను కవిత్వంలోకి వొంపుతున్న ఈ కవి అభినందనీయడు. రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యంగా దళిత నేపథ్యం నుంచి ఒక మంచి కవి తెలుగు సాహిత్యానికి దొరకడం నిజంగా మంచి పరిణామం.