సత్య భాస్కర్
బార్లా తెరిచిన గేటు అలానే ఉంది
ఆమె ఎంతకూ రాదే !
కళ్ళను వీధి వాకిలికి తగిలించి
క్షణాలు లెక్కపెట్టుకుంటూ నేను
రాలుటాకుల చప్పుడుకు ఉలికులికిపడే నేల కూడా
ఆమె కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది
ఆకాశాన్ని శుభ్రంగా ఊడ్చిన సూర్యుడు
ఉక్కబోతను కళ్లాపిగా చల్లుతున్నాడు
ఓదార్పునిచ్చే ఒక్క మేఘమూ లేదు
ఎగ శ్వాసతో రొప్పుతున్న ఐసియు పేషెంట్‌లా
అరుగుపక్కన వీధికుక్క డొక్కలెగరేస్తూ ...
మామిడిగుబురు పరదా వెనుక నక్కి
గజల్స్ వినిపిస్తున్న కోయిల కూడా
ఏమాత్రం సాంత్వననివ్వదు!
వడగాల్పుల కర్ఫ్యూకు
ఆటలనుంచి గృహనిర్బంధానికి తరలించబడ్డ
బాధిత చిన్నారుల సణుగుడు
రోజంతా మోగుతున్న పెళ్లి మైక్ సెట్ పాటల్లా
సహనాన్ని పరీక్షిస్తుంది!
ఇంతలో
చూస్తూనే ఉన్న కళ్ళను మోసగిస్తూ
ఆకాశంలో మబ్బులు మొలుచుకొస్తాయి
ఒక్కసారిగా మొదలైన చినుకుల రన్నింగ్ రేస్‌ను
చప్పట్లతో ఉత్సాహపరుస్తూ కిటికీ రెక్కలు ఊగిపోతాయి
మట్టివాసన గమ్మత్తు
వాసెన కట్టిన జాడీలోని ఆవకాయలా
మనసుని ఊరిస్తూ నాస్టాల్జియాలో ముంచెత్తుతుంది
నోట్ పుస్తకం కాస్తా కాగితప్పడవల అవతారమెత్తి
పిల్లల వదనాల్లో విసుగును రబ్బరు మల్లే తుడిపేస్తూ
సంబరాల సన్నాహాల వైపు మళ్ళిస్తుంది!
సినిమా హాల్లో తెరమల్లే
చూరునుంచి కిందికి దిగుతున్న ముత్యాల దండల కర్టెన్
ఉక్కిరిబిక్కిరి ఉక్కపోతకు శుభం కార్డు వేస్తుంది!
ఆమె రాకతో అంతా ఒక్కసారిగా మారిపోతుంది!