'మది నదిలో' ఆహ్లాద భావాల ప్రవాహం

మద్దాల సునీల్‌
98494 82031

'మది నదిలో' అనే ఈ కవితా సంపుటిలో చిట్టె సిద్ధ లలిత తన మనసులోని భావాలను ప్రవహింపచేశారు. ఈ కవితా సంపుటి ''ఒక ప్రయోగం కాదు.. ఒక ప్రక్రియా కాదు.. పరిశీలన కాదు.. పరిశోధనా అంతకంటే కాదు, ఇది నా మదిలోని జీవ నది. నా మదిలోని ప్రవాహలే ఈ కవితలు'' అని కవయిత్రి చెప్పుకున్నారు. ఈ పుస్తకాన్ని పాఠకుడు ఏకబిగిన చదవడానికి తన కవితా శైలి ఉపకరిస్తుంది. ఇది తన మొదటి కవితా సంపుటి అనే భావన ఎక్కడా రాదు.
కాలంతో పరుగులు పెట్టే మనుషులకు కాస్తంత విరామంలా, విసిగిపోయిన మనసులకు హాయి గొలిపేలా ఉంటాయి ఈ కవితలు. కవయిత్రి రాసిన ప్రతి కవితా ప్రశాంతంగా పరవశింప జేసేలా ఉంది. కవయిత్రి తనకంటూ ఒక నిర్ధిష్టమైన కవితా శైలిని కనబరిచింది. తన చుట్టూ జరుగుతున్న వాటినే వస్తు రూపాలుగా మలచింది.. ''కవిత్వమంటే అర్థం కాని మాటల ప్రయోగం కాదు, నాన్న కోపంలో కూడా ప్రేమను వెలికితీయడమే కవిత్వం..'' సరికొత్త నిర్వచనం ఇచ్చారు. సినీ పాటల రచయిత భువన చంద్ర ఈ సంపుటికి ముందు మాట రాశారు. ''కవితకు ఉండాల్సిన ప్రథమ లక్షణం సున్నితత్వం, రెండోది భావ పటుత్వం, మూడోది సరళత, నాలుగోది ఒక్కసారి చదివితే అర్ధమయ్యే భాష.. ఈ నాలుగూ నాలుగు స్తంభాలై ఈ మది నదిలో కవితా సంపుటిని బలంగా నిలబెట్టాయి అని పేర్కొన్నారు. కవయిత్రి ''నా మది నదిలా పరుగులు తీస్తుంది నీకోసమే'' అని మొదలుపెట్టి తన మనసులాగే తన కవితల్ని పరుగు పెట్టించారు.. అక్షరంతో స్నేహం చేయబట్టేమో అక్షరాలను కవితలుగా అలవోకగా మలిచారు.. ''కొండలెక్కి దూకుతున్నాను కోనల్లో సాగుతున్నాను /గతి తప్పని శృతులతో లయగా పరవళ్ళు తొక్కుతూ నీ దరికే ప్రవహిస్తున్నాను'' అని; సంద్రాన్ని సాయమడిగి తన సిరా నింపుకుని / ఆకాశాన్ని అరువడిగి కాగితం తెచ్చుకొని / అక్షరాలను ముత్యాలుగా మలచి రాసిన అందమైన కవితలు.. తన కవితల జ్ఞాపకాలన్నీ మూటగట్టి నీతో గడిపిన క్షణాలన్నింటిని కట్ట గట్టి / గతమనే పెట్టెలో భద్రంగా దాచిపెడుతున్న అని కొన్నిటిని దాచి మరికొన్నిటిని మనకు అందించారు. 'చిట్టీ చిలకమ్మా' అని మొదలు పెట్టి.. అలసినపుడు... విసిగి వేసారినపుడు నిరాశ నిస్పృహలు కమ్ముకుని మనసును కల్లోలం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని కాసేపు వెనక్కి ప్రయాణిస్తాను / అదిగో అక్కడికే బాల్యపు ముంగిట్లోకి చిట్టి చిలకమ్మలమై తోటకెళ్ళి పోతాము అని బాల్యన్ని గుర్తుచేశారు. ''కన్నీటికే కలాన్నందిస్తే ఎన్నెన్ని కథలను రాస్తుందో /ఎంత మంది హృదయాలను కరిగిస్తుందో'' అని కలానికి కన్నీటికి స్నేహం కుదిర్చింది. ''వారి తప్పేమి లేదు.. నేరమేమి చేయలేదు.. విధి వెక్కిరించిందట.. నుదుటి బట్టు తుడిచేసి.. చేతిగాజులు పగులగొట్టి తెల్లని వస్త్రాన్ని కట్టి ఇదే నీ సౌభాగ్యమంటారు ఎదుటికి రాకుండా పక్కకి తప్పుకోమంటారు మూఢ నమ్మకాలతో... మూర్ఖంగా..'' అని మూఢ నమ్మకాలను విమర్శించారు ఈ కవయిత్రి. ''సారీ, నేను చాలా బిజీగా ఉన్నాను / నన్ను డిస్టర్బ్‌ చేయవద్దు వెలసిపోయిన జీవితానికి రంగులద్దుకుంటున్నాను / శిధిలమైన నా జీవన సౌదాన్ని పునః నిర్మించుకుంటున్నాను'' అని పరుగులు పెట్టే బిజీ బిజీ జీవితాల గురించి చెప్పారు. ''ఒంటరితనం కూడా ఒక వరమే... అవసరమైనప్పుడది ఏకాంతమవుతుంది/ చిన్న గదిని కూడా అంతఃపురంగా మార్చేస్తుంది.'' అని గొప్ప భావుకతను వ్యక్త పరిచారు. ''రంగులు పులుముకున్న ప్రపంచంలో/ ఎప్పుడు ఏ రంగును ఒంపుకోవాలో తెలియక తికమక పడుతున్నాను'' అని ఇదొక రంగుల ప్రపంచమని వర్ణించారు. ''శ్వాస ఆగిపోయిన నా కట్టెను చూచి... కన్నీళ్ళు విడవమని నేను కోరను కానీ / కఠినమైన మాటలు మాత్రం మాట్లాడకండి / ఆ మాటలు ముల్లయి తిరిగి మీ కాళ్ళకు గుచ్చుకుంటాయేమో...!'' అని ఈ సమాజానికి చురకలంటించిన కవితలు చాలానే ఉన్నాయి. ''దుఃఖమంటే భయమెందుకు కన్నీరంటే అయిష్టతెందుకు / అర్జునుడు దు:ఖించక పోతే కృష్టుడు భగవద్గీతను బోధించేవాడా? / దు:ఖపు జాడ తెలియకపోతే బుద్ధుడికి జ్ఞానోదయమయ్యేదా / వేదన రుచి చూడకపోతే వేమన యోగి అయ్యేవాడా...! అని దు:ఖం సారాంశాన్ని వివరించారు. మైనస్‌ అంటే ఆడపిల్లని ప్లస్సు అంటే మగ పిల్లాడని లెక్కలు కట్టే ఈ మనుషులను చీదరించుకున్నారు. ''ఎదిగితే గుండెలమీద కుంపటన్నారు / ఎదురు తిరిగితే బరితెగించిందన్నారు...'' అని విమర్శించారు. ''జీవితమనే పుస్తకంలో మొదటి పేజీని నేను / చివరి పేజీవి నువ్వు/ మధ్య పేజీలలో నాకు నువ్వు నీకు నేనేగా మన మిద్దరమేగా'' ప్రేమైక బంధాన్ని చాటారు. ''తూరుపు వాకిట నిలిచిన ఒక తుంటరి నక్షత్రం ఒంటరిగా ఉందట/ తోడు కోసం రమ్మంటుంది వెళ్ళనా'' అనే చమత్కార కవితలూ ఈ సంపుటిలో కనిపిస్తాయి. ''మనిషైనా.. చినుకైనా... చెట్టయినా... పుట్టయినా... చివరకి మట్టినే చేరాలి బతుకును ముగించాలి అదే కదా సత్యం... జరుగుతోంది నిత్యం...'' అనే జీవిత సత్యాన్ని చెబుతూ ఈ కవితా సంపుటిని ముగించారు. ఆహ్లాదంగా సాగే ఆమె శైలి పాఠకులను ఆకట్టుకుంటుంది. జీవితంలోని మృదుభావాల మీదుగా ప్రవహించిన అమృతాక్షరాల్లా అనిపిస్తుంది.