మనసును తడిమే కవిత్వం

పాతూరి అన్నపూర్ణ
94902 30939

కొందరి కవిత్వం గలగలా ప్రవహించే జలపాతంలా ఉంటుంది.కొందరి కవిత్వం సముద్రపు అలల్లా ఉద్వేగభరితంగా ఉప్పొంగుతుంది . కానీ కొండరాళ్ళ నుంచి నిశ్చలంగా ప్రవహిస్తూ, దారిని ఒరుసుకొని ఒంపుసొంపులు తిరుగుతూ, చిన్న పాయే కదా అని అనుకునేలోపు ఎంతో గంభీరంగా అనిపిస్తూ, ఎక్కడా ఎత్తుపల్లాలు లేకుండా నిర్విరామంగా ప్రవహించే కవిత్వాన్ని రేఖ సొంతం చేసుకుంది. మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు అదే సవ్వడి. సమాంతరమైన సుకుమారమైన భావజాలం ఎక్కడా ఆగిపోకుండా అలా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని అక్షరాలూ కుప్ప పోసుకున్నా కొత్త ఆలోచనలు తీగల్లా సాగుతూ, ఆ అక్షరాలతో కలిసి మరో కవిత్వపు పుటకు తెరతీస్తాయి. రేఖది ఆత్మాశ్రయ కవిత్వం అవుతుందేమో!
చిరు అలజడికే కలం కవితకు ప్రాణం పోస్తుంది. ఆర్ధ్రత , ఆర్తి ఈ కవిత్వంలో ఎక్కువగా పాలుపంచుకున్నాయి. మనిషి ఎంత సౌమ్యంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ కవిత్వం కూడా అంతే మెత్తదనాన్ని పొదుపుకుంది.
ఈ కవితాసంపుటి శీర్షిక 'ఆగిన చోటనే మళ్ళీ' అని పెట్టడంలో ఆలోచనలు,అనుభవాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడమే. రేఖ తన రహస్యాలన్నీ గాలికీ , నీటికీ , భూమికీ, అప్పుడే కళ్ళు విప్పుతున్న మొక్కకీ ఒక్కో అక్షరాన్ని, పదాన్ని చెక్కి మరీ అందించినట్టు అనిపిస్తుంది. మొదటి అడుగు నుండే తన ఆర్తిని, ప్రేమను పంచే సంభాషణ మొదలైంది.
''ఏదైనా రాయి కొత్తగా'' కవితలో
''ఈ ఒడ్డుమీద నాలుగడుగులు కలగన్నాక
ఇవాళ నువ్వే మిగిలావ్‌
నీ రెండడుగులు ఇసుక మీద
అవే అడుగులు గుండెమీద
కాసేపు గుర్తులుగా, గాయాలుగా!'
ఎంతగా పదాలు తడిసిపోయాయి . భావోద్వేగంతో గుండె నిండిపోతున్న మాటలు ఇవి. ఇది అనుభవైక మైన భావన . అందుకే చదువుతున్నంత సేపు కళ్ళు చమరుస్తాయి.
''మనసులో పాట'' అంతే
''మేలుకున్న మనసుకి/ శబ్దం అవసరం లేదు
కొన్ని చూపులే సరిపోతాయి' అంటుంది రేఖ.
నిజమే కదా... చూపులతోనే మనిషిని ,మనసుని వెతకచ్చు. ఉదయం నుండి రాత్రి వరకు చూపులే సంభాషణగా మారి పాటగా సాగుతాయి. ఆ పాట ఎన్ని సంవత్సరాలైనా పూర్తవదు. అందుకే ఆ పాట జీవితాంతం తనతోనే ఉండిపోతుంది. చిన్న చిన్న వెదుకులాటలు పదాలుగా పాటలుగా మారి అవి జీవితాంతం తోడుగా ఉండడం ఆమె అనుభూతి . నిర్వచనానికి అందని ప్రేమ ఎక్కువైనా ,తక్కువైనా మాటలు ఉండవు. .... మౌనం తప్ప. ఆ మౌనంలోంచి మువ్వల్లాంటి అక్షరాలూ పుట్టుకొచ్చి కవితగా ఆకృతి చెందడం జరుగుతున్నది.
''ఎదురుచూసిన మేఘం ప్రాణాలన్నీ పెట్టుకున్న మేఘం చినుకుల్ని మోసుకొస్తుందని ఆశపెట్టుకున్న మేఘం
ఇంత ఎడారిలో రవ్వంత కురిసిపోతుందని ఆశించిన మేఘం దాటిపోతోంది, నన్ను చూసి దాటిపోతోంది వెనుతిరిగి చూస్తూ దాటిపోతోంది అచ్చం నీలాగే !''......
ఇది రేఖ మనసులోని వర్షం. మేఘం బరువెక్కి కురిస్తేనే ఆకాశం తేలిక పడుతుంది. మనసూ అంతే! .ఎదుటి వ్యక్తి ప్రేమను అందించలేనప్పుడు అది చినుకులు కురవని మేఘమే. పై నాలుగు పదాల్లో ఎంత బరువుని నింపిందో రేఖ కవిత్వం .
నాకు నచ్చిన మరో కవిత ''నాక్కాస్త సమయం పడుతుంది
'' నిజమే ! మనం మనలా నిలదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతూనే ఉంటుంది. అలాగే జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని చెప్తోంది ఈ కవిత.
''నువ్విచ్చిన వసంతంలోనుంచి
నువ్వు లేని గ్రీష్మంలోకి జారిపోవడానికి
నాక్కాస్త సమయం పడుతుంది .....
ఎటు కదలను ..?
ఈ కాస్త కూడా ఇపుడు లేదనుకోడానికి
నాక్కాస్త సమయం పడుతుంది''
ఇట్లా '' ఆగినచోట నుండే మళ్ళీ '' పుస్తకం చదువుతూ మళ్ళీ మొదటికే వస్తాము . ఎందుకంటే , ఈ కవితలు ఒక్కసారి చదివితే అర్ధం కావు. ఈ పుస్తకం నింపుకున్న భావచిత్రాలను మళ్ళీ మళ్ళీ చదివితేనే వాటిల్లో నిగూఢం గా దాగిన భావం అర్ధంమవుతుంది . అందుకే ఈ పుస్తకం నాకు అంది నెలరోజులైనా నేను నా మాటలు ఇలా అందించడానికి సమయం పట్టింది. రేఖ పోస్ట్‌ లో పుస్తకం పంపిన రోజునుండి నా అమెరికా ప్రయాణం వల్ల ఆ పుస్తకంలోకి వాకిలి తెరుచుకొని వెళ్ళలేకపోయాను . ఇదిగో ! ఈ సాయంత్రం నీరెండవెలుగులో కూర్చొని పుస్తకం తెరిచాను. అంతే ! కళ్ళూ , మనసూ ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. ఈ కవితలో ఎంత భావజాలాన్ని దాచుకున్నాయో, ఎంత బరువును నింపుకున్నాయో అర్ధమయింది . ఈ భారాన్ని నాలుగు మాటలలో అందిద్దామని మొదలెట్టాను. కానీ ఆగిన చోటుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నాను . ఇది అంతం లేని ప్రయాణం అని తెలిసింది .
ఇక్కడ మనస్ఫూర్తిగా మెచ్చుకోదగినవారు ,ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దిన గిరిధర్‌, చిత్రాలు గీసిన కిరణ్‌ కుమారి , కవిత్వాన్ని ఎంతో శ్రద్ధగా అందించిన వాకిలి పబ్లిషర్స్‌ . రేఖా! మీ ప్రయాణం ఎన్నో మజిలీలుగా సాగుతున్నా మీ అడుగులు ముందుకు నడవాలని మరిన్ని అనుభవాల మేఘాల వర్షం కురిపిస్తారని మనసారా నమ్ముతూ మనమంతా అక్షరాల త్రోవపైన కలసి ప్రయాణం చేద్దాం.