కడలి ఘోష

డా. వేలం పళని
9912343804
రెప్పల దరులకు తగిలి రాలుతున్న
కడలి కలల కన్నీళ్లు
పాపపుణ్యాల ఆటుపోట్లకు లేచి పడుతున్న
తను కెరటాల తపనలు
వలపురేడు తెడ్ల తిప్పులకు
సుళ్ళు చుట్టే సుఖాల సుడిగుండాలు
వాంఛల వాయు గుండాలు
కట్టుబాట్ల చెలియలి కట్టకు విసిరే వేడి వానల సవాళ్లు
కోర్కెల బడబాగ్నులు
మది లోతుల్ని మరగదీసి రేపే తీపి సెగలు

ఏకాంతపు చీకట్లో ఘోషించే కడలికి సూర్యుడంటే సిగ్గు
వెలుగు స్పర్శకు ఉలిక్కిపడి
వేదనను విసిరేసి, తాపాగ్నుల్ని ఆర్పేసి
వయస్సు కెరటాల్ని ముడిచేసి
మౌన గంభీర ముద్రను దాలుస్తుంది

కలల్ని, క్రీడల్ని వెలుగు వెనుక క్రీనీడలో దాచిపెట్టి
విషణ్ణ వదనానికి అరుణహాసాల్ని పులుముకుంటుంది
అనంతమైన విరహాన్ని, విషాదాన్ని కనబడనీయకుండా
మిలమిల మెరుస్తూ, జలజల అరుస్తూ నటిస్తూంటుంది

ఉడుకుల ఉత్సుకతల్ని దాచలేక ఉవ్వెత్తున ఎగసిపడుతూ
అలల చేతుల్ని ఆకాశం వైపు చాస్తూ
తనను తాను ఆవిష్కరించుకుంటూ ఉంటుంది
వయసు వ్యాకోచాలు, మనసు సంకోచాలతో
నిరంతరం సంఘర్షించి
నిలువెల్లా కల్లోలించే కడలి కాంత
కాముని పున్నమిని కోరుకుంటూ గంభీరంగా ఘోషిస్తోంది

కడలి ఘోషిస్తోంది
తుళ్ళీ తుళ్ళీ మళ్లీ మళ్లీ పెళ్లి కోసం వెంపర్లాడే
వయసు విధవలా ఆశను శ్వాసిస్తూ, శ్వాసను ఆశిస్తూ,
కడలి ఘోషిస్తోంది!