ఆకాశ విహారం అనుభూతినిచ్చే కవిత్వం

శాంతికృష్ణ ఎం.ఎస్‌
95022 36670

ఆకాశం ఎప్పుడూ ఓ అద్భుతమే! ప్రతి ఉదయం రంగులు చల్లుకున్న బాల్యమంత అమాయకంగా కనిపిస్తూ మధ్యాహ్నం బడిలో మాష్టారంత కఠినంగా దండిస్తుంటుంది. సందెపొద్దుకు అమ్మ లాలిలా మారి... చీకటి వేళ అమ్మ ఊయలవుతుంది. ఇలా ఒకటే ఆకాశం ఘడియ ఘడియకు తన ఉనికిని మార్చుకుంటూ మనతో అనుబంధం కలిగి ఉంటుంది.
'ఒకే ఒక ఆకాశం' అంటూ వచన కవిత్వ సంపుటితో మన ముందుకు వస్తున్న కవి నెల్లూరు వాస్తవ్యులు సాహితీసేవకులు, ప్రముఖ కవి గుర్రాల రమణయ్య గారు. వీరు విశ్రాంత ప్రభుత్యోద్యోగి. గతంలో 'మాట ముల్లు' అనే వచన కవితా సంపుటిని ప్రచురించారు. ఇది వీరి రెండవ సంపుటి. ఇందులో 70 కవితలు ఉన్నాయి. అన్నీ అనేక సామాజిక అంశాలపై రచించిన కవితలు.
ఒక్కసారైనా ఊరెళ్ళి రావాలి
చివరిసారిగానైనా
అమ్మ సమాధి చూసి రావాలి
బక్క చిక్కి ఉన్నా
ఎండి మండి పోతున్నా
మా ఊరి ఏటి ఒడ్డున కూచొని
మురళినూదుకోవాలి
దేవాలయం కోనేరులో
రాత్రి స్నానమాడే చుక్కల్ని చంద్రుణ్ణి
మరొక్కసారి దర్శించుకోవాలి
ఒక్కసారైనా చివరిసారిగానైనా!''
- 'చిగురించని కొమ్మ' కవితలో...
బాల్యాన్ని ఆత్మీయంగా స్పర్శిస్తున్న కవిత ఇది. ఒక్కసారైనా ఊరెళ్ళి రావాలని, అమ్మ సమాధిని చూడాలని, మిత్రుల ఇండ్ల అరుగులపై గిజిగాడి గూళ్ళు పెట్టాలని, తాను నడిచిన వీధిలో తన అడుగుల జాడలు వెతకాలని, తొలినాటి ప్రేమ గురుతులు, దేవాలయం కోనేట్లో చంద్రుణ్ణి దర్శించటం... ఇలా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మళ్ళీ తడిమి చూడాలని ఉందని ఆర్తిగా రాసుకున్న ఈ కవితను చదువుతున్నంత సేపు పాఠకులు కూడా అది తమ మనసులోని కోరికే అన్నంతగా మమేకమై పోతారు.
''ఆకాశంలో రంగు రంగుల కలలు ఆవిష్కరిస్తూ
ప్రపంచ యాత్రకు పయనమౌతారు మీరు
రెక్కలతో శూన్యాన్ని ఈదుతూ
సముద్ర కెరటాలతో పోటీ పడుతుంటారు'' - 'పక్షి వసంతం' కవితలో...
ఆకాశంలో అద్భుత విన్యాసం చేసే పక్షుల గురించి ఈ కవితలో ఆవిష్కరించిన తీరు వసంతంలా వర్ణమయంగా ఉంది.
''ఒక్కడుండాలి
కీకారణ్యంలో వేసిన కేకని
ప్రతిధ్వనించి మోసుకెళ్ళే వాడు
ఒక్కడైనా చాలు
ప్రపంచపు చివరి అంచుపై నిలిచి
పదుగురినీ సమీకరించి
సమైక్యతా సమరనాదాన్ని అందివ్వగలవాడు''
- 'ఒక్కడే' కవితలో....
వీరి కలం మృదువైన భావాలనే కాదు ఘాటుగా కూడా స్పందించ గలదని మనకు ఈ కవిత నిరూపిస్తుంది. సమాజాన్ని చైతన్య పరచే ధీరుడైన నాయకుడు తప్పకుండా ఒక్కడు ఉండాలని... అతను వేల అబద్ధాలను నడి రోడ్డుపై నిలదీసేవాడై ఉండాలని కవి ఈ కవితలో బలంగా కోరుకుంటున్నారు.
''అమ్మ చిత్రం గీస్తూ దేవుడు కూడా
ఆమె పెదాలపై సూర్యోదయం
చిత్రించడం మరచిపోయాడు మరి''
- 'అమ్మ చిత్రం' కవితలో.
బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపాలని అమ్మ నవ్వునే కాదు ఎన్నింటినో త్యాగం చేస్తుంది కదా...
''ఇక్కడ చిరునవ్వులకు
మతాలు కులాలు అంటురోగాలుండవు
అందరిదీ పరిమళ భాష
అందరిదీ ఒకటే శ్వాస''
- బడి గంట' కవితలో...
పసివాళ్ళ మనసులెపుడూ పరిమళ భరితమే. అందుకే బడి ఎపుడూ ఓ ఉద్యానవనంలా ఉంటుంది.
''ఎన్ని భాషల పదాలో
చేరి సముద్ర మైన భాష
నా తెలుగు భాష
కోటి కోటి సూర్యుళ్ళచ్చినా
సముద్రం ఆవిరి కానట్లు
కోటి కోటి తరాలు మారినా
నా భాషకు మరుగు ఉండదు'' అంటారు 'శాశ్వతం' కవితలో.
భాష పైన ఈ కవికి ఎంత గౌరవమో అంత నమ్మకం కూడా ఉంది. ఎన్ని తరాలు మారినా చెరిగిపోనిది మన తెలుగు భాషంటూ ఆత్మ విశ్వాసంతో ఈ కవితను రాసుకున్నారు.

''నీ హస్తవాసి సంజీవని
నీ హృదయం కల్పవృక్షం'' - 'చలి మంట' కవితలో... వైద్య వృత్తిలో ఉన్న తన కుమారుడిని గురించి ప్రేమతో గొప్పగా రాసుకున్న కవిత ఇది.
ఇలా అన్ని కవితలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇంకా ఇలా ఎన్నో పుస్తకాలను ప్రచురించాలని కోరుకుంటూ.... 'ఒకే ఒక ఆకాశం' రచయిత గుర్రాల రమణయ్య గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. వారిని 99639 21943 నెంబరుపై పలకరించొచ్చు.