బ్యాంకాకులు

వి. రెడ్డెప్ప రెడ్డి
94400 44922

ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి, గుండెజబ్బుల విభాగం, దేవళంపాడు చలమేశ్వరకు కృత్రిమశ్వాసకై వారంపాటు అమర్చిన వెంటిలేటరును తప్పించి 2022, జనవరి, పదిహేనవ తేదీన మరణ ప్రకటన వెలువడింది. ఉత్తమ దినాల్లో చావు, శ్రాద్ధకర్మ జరిగితే మోక్షప్రాప్తి లభిస్తుందని నమ్మి వారంపాటు వెంటిలేటరుపై ఉంచారు. చలమేశ్వర కొడుకు పరమేశ్వరను పరామర్శించడానికి వచ్చినవారు ''మీ తండ్రి ఉత్తరాయణ ప్రవేశ పుణ్యకాలంలో స్వర్గస్థులయ్యారు. పుణ్యలోకాలకు వెళతారు'' అన్నారు. పదమూడవ రోజు ''ఉత్తరాయణం, గురువారం, దశమి పుణ్యతిధినాడు శ్రాద్ధకర్మ నిర్వహిస్తుండడంతో మీ తండ్రికి స్వర్గప్రాప్తి లభిస్తుంది'' అంటూ కర్మ నిర్వహించిన స్వాములూ చెప్పారు.
చలమేశ్వర దైవభక్తి అందరికీ తెలిసిందే. అంతకుముందు ఏ మేర పాటించేవారో తెలీదుకానీ, ఎంపీ అయ్యాక అతడికి దేవుడిపై భక్తి పెరిగిందని తెలిసినవాళ్లంటారు. ఎంతగా అంటే, పూజాసమయానికి బయలుదేరవలసి వచ్చినా, లేదా పూజాసమయానికి దిగలేనేమోననిపించినా విమానం కూడా ఎక్కేవాడు కాదు. పూజావేళలు తప్పించే పార్లమెంటుకు కూడా హాజరయ్యేవాడు.
భక్తి విషయంలో తండ్రిని మించిన తనయుడు కొడుకు పరమేశ్వర. భక్తిభావంతో జరిపిన పూజలే తమను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి సాయపడ్డాయని నమ్ముతాడు. అలాంటి భక్తిలో భాగంగానే తండ్రికి పెట్టిన శ్రాద్ధపు కూడు తినడానికి కాకులు రావేమోనని ఫారెస్ట్‌ డిపార్టుమెంటు సాయంతో కాకులను తన ఇంటిమీద వాలే ఏర్పాట్లు చేయించాడు. ప్లేట్లలోను, పాకెట్లలోనూ మిగిలిపోయిన జంకు తిండికి అలవాటుపడ్డ పట్టణకాకులు రుచిపచీ లేని శ్రాద్ధపు కూటిని సాయంత్రపు చీకటి సమయమైనా ముట్టుకోలేదు. ''బ్యాంకులను దిగమింగి పాపాల్జేసి పోయాడు. వీడి పాపాలకు నలుగురు బాంకు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. వీడి శ్రాద్ధపుకూటిని కాకులేల ముట్టుకుంటాయి?'' అని విషయం తెలిసిన ఓ బ్యాంకు మేనేజెర్‌ లోపల అనుకున్నట్లే బయటికే అనేసాడు.
అఅఅ
కేంద్ర పాలక పార్టీ దశమ ఆవిర్భావ దినోత్సవం ఆడంబరంగా జరపడానికి పార్టీ నిర్ణయించింది. అట్లాంటి ఉత్సవం ఏ రాష్ట్రంలో జరిగితే అక్కడికి దేశస్థాయి నాయకులు వస్తారని, అప్పుడు జరిగే చర్చలతో, నిర్ణయాలతో రాష్ట్రంలో పార్టీ కొత్త జవసత్వాలు పొందుతుందని నాయకుల నమ్మకం.
తమ రాష్ట్రంలో అంటే, తమ రాష్ట్రంలో జరపాలని నాయకులు పోటీలు పడ్డారు. ''మా రాష్ట్రంలో జరిపితే ఖర్చు మొత్తం నేనే భరిస్తా''నన్నాడు చలమేశ్వర. ఆ ఆవిర్భావ దినోత్వవ నిర్వహణకు ఐదొందల కోట్లు ఖర్చయింది.
రెండేళ్ళ తర్వాత వచ్చిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ తరుపున నిలబడిన ఇరవై మంది ఎంపీ అభ్యర్థులు ఎన్నికల ఖర్చు రెండువందల కోట్లు తనే భరించాడు. ఇంత ఖర్చుపెట్టి గెలిపించిన ఎంపీలు తన గ్రూపుగా ఉంటారని, గ్రూపుబలంతో ఖచ్చితంగా కేంద్రంలో కేబినెట్‌ మంత్రి అవుతానని అతడి నమ్మకం. అయితే తన అదృష్టదేవత నిద్ర లేవలేదు, పార్టీ ఓడిపోయింది. కొడుకు పెళ్ళి ఘనంగా జరిపాడు. తన నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు వివాహా ఆహ్వానాలు పంపాడు. వారంరోజులు మందు విందులకు లోటు లేకుండా ఏర్పాట్లు చేశాడు. కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గం నుంచి అందరూ పెళ్ళికి వచ్చేటట్లు చూసుకున్నాడు. పెళ్ళికి వంద రకాల వంటలు ఏర్పాటు చేయించాడు. వచ్చిన వారందరికీ వారి వారి స్థాయిని బట్టి బహుమతులు పంచాడు. 500 కోట్ల ఖర్చు తేలింది.
కూతురి పెళ్లి దుబాయిలో చేశాడు. అతిధులను ప్రత్యేక విమానాల్లో తరలించాడు. తన నియోజకవర్గంలో పాస్‌ పోర్టు కలిగిన ప్రతి ఒక్కరిని పెళ్ళికి పిలిపించాడు. మరో 500 కోట్ల ఖర్చు తేలింది.
తెలిసినవారు ''ఎందుకిలాంటి దుబారా''లన్నారు. ''ఈ ఖర్చులు, ఈ పరిచయాలు తన రాజకీయ ఎదుగుదలకు పెట్టుబడి'' లాంటివని చలమేశ్వర జవాబిచ్చాడు.
అఅఅ
చలమేశ్వర మరణం కొడుకు పరమేశ్వరకు ఒకవైపు శుభపరిణామంగానూ, మరోవైపు అశుభంగానూ పరిణమించింది. తండ్రి మరణంతో ఖాళీ అయిన ఎంపీ సీటు తనకే ఇవ్వనున్నట్లు పార్టీ ప్రకటించింది. తండ్రి మరణంతో ఏర్పడ్డ ఖాళీ స్థానంలో కొడుక్కు సీటు ఇచ్చారు గనక ప్రతిపక్షం పోటీ పెట్టలేదు. కానీ ఇండిపెండెంట్‌ అభ్యర్థి నామినేషన్‌ వేయడంతో ఎన్నికలు తప్పలేదు. జరుగుతున్నవి సానుభూతి ఎన్నికలయినప్పటికీ పరమేశ్వర మాత్రం గెలవడం మహాయజ్ఞంలా భావించి యాభై కోట్లు ఖర్చుపెట్టాడు.
''ఎలాగూ గెలుస్తామని తెలిసీ యాభైకోట్లు ఖర్చు పెట్టడమెందుకూ?'' ప్రశ్నించాడు పరమేశ్వర తమ్ముడు యజ్ఞేశ్వర.
''ఎన్నికల్లో మనం పెట్టే ఖర్చులకు భయపడి ఇంకెవరూ ఈ నియోజకవర్గంలో నిలబడే సాహసం చేయకూడదు. ఇప్పుడు మనం ఖర్చుపెట్టక మన మెజారిటీ తగ్గితే, రాబోయే ఎన్నికలప్పుడు ఇతరులు ఈ సీటు అడగవచ్చు. ఇప్పుడే అధిక మెజారిటీ సాధిస్తే రాబోయే ఎన్నికలప్పుడు సీటు ఇతరులకిచ్చే సాహసం పార్టీ చేయదు.'' జవాబిచ్చాడు పరమేశ్వర.
అఅఅ
పరమేశ్వరను ఎన్నికల్లో ఎదిరించని ప్రతిపక్ష పార్టీ, అతడు గెలిచాక అసలు యుద్ధం ప్రారంబించింది. అతడి తండ్రి చలమేశ్వర బ్యాంకుల్లో చేసిన అప్పు వివరాలు, అప్పులు తిరిగి కట్టని వైనం తరచూ పార్లమెంటులో ప్రస్తావించడం మొద లెట్టింది. ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర పార్లమెంటులో ప్రస్తావిస్తూ, ''చలమేశ్వర బ్యాంకుల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుచేశారు. సిమెంట్‌ ఫాక్టరీ కట్టేందుకని ఇండియన్‌ మర్కంటైల్‌ బ్యాంకులో 2011లో ఐదువందల కోట్ల అప్పుచేశారు. సిమెంటు ఖనిజం కోసం ప్రభుత్వమిచ్చిన భూమిని హామీగా చూపెట్టి అప్పు తీసుకున్నారు. ఫ్యాక్టరీ కట్టలేదు. ప్రభుత్వమిచ్చిన భూమిలోని ఖనిజాన్ని అమ్ముకున్నారు.''
''2014లో హైడ్రో-ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణం కోసమంటూ ముంబై రేవంసీ బ్యాంకులో రెండువేల కోట్ల అప్పు మంజూరు చేయించుకున్నారు. కట్టని సిమెంటు ఫ్యాక్టరీని, ఖనిజం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని హామీగా చూపారు. మొదటి విడతగా వెయ్యి కోట్లు బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నారు. ప్లాంటుకు కావలిసిన నీళ్ళు కర్ణాటక ప్రభుత్వం ఇవ్వడం లేదని సాకు చూపి, తమిళనాడు ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడానికి సిద్ధమని, పవర్‌ ప్రాజెక్టును ఆ రాష్ట్రానికి మార్చనున్నామని బ్యాంకుకు లెటర్‌ ఇచ్చారు. మిగతా వెయ్యికోట్ల అప్పు తీసుకున్నారు. ప్రాజెక్టు మాత్రం కట్టలేదు''
''గంగా-కావేరి లింకు ప్రాజెక్టు ప్రాధమిక రిపోర్టు తయారు చేసే కాంట్రాక్టు తమ కంపెనీకి వచ్చిందని 2019లో గుజరాత్‌ స్టేట్‌ కమర్షియల్‌ బ్యాంకునుంచి ఐదువేల కోట్ల రూపాయలు అప్పు మంజూరు చేయించుకున్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడక పోయినా తమ కంపనీకి కాంట్రాక్టు వచ్చినట్లుగా తప్పుడు పత్రాలు బ్యాంకుకు సమర్పించారు. లోను మంజూరయింది. సగం డబ్బు బ్యాంకు నుంచి తీసేసుకున్నారు.''
''గోదావరి నదిపై సోలార్‌ పవర్‌, హైడ్రో పవర్‌ కలిపి ఉత్పత్తి చేసే ప్రాజెక్టు నిర్మించడానికంటూ స్టేట్‌ బ్యాంకు అఫ్‌ చెన్నైనుంచి ఐదువేలకోట్లు అప్పుమంజూరు చేయించుకున్నారు. నదిపై ఏర్పాటు చేసే సోలార్‌ పానెల్లను బ్రెజిల్‌ దేశంనుంచి దిగుమతి చేసుకున్నామని, డబ్బుచెల్లించి వానిని విడిపించవలసి ఉందని చెప్పి బ్యాంకునుంచి మూడువేల కోట్లు తీసుకున్నారు.''
''మొత్తంగా ఎనిమిది వేల కోట్లు అప్పు వివిధ బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ఇన్ని అప్పులు చేసినా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మొదటి అప్పు తీర్చడానికి రెండవ అప్పు, రెండవ అప్పు తీర్చడానికి మూడో అప్పు, అలా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశారు. అప్పు మొత్తంసొమ్ము ఏంచేశారు? అప్పు మంజూరయిన ప్రాజెక్టులపై కాకుండా వేరెక్కడయినా పెట్టుబడి పెట్టారా? లేక ఇతర దేశాలకు తరలించారా? అనేది తేలవలసి ఉంది. దీనిపై సి బి ఐ విచారణకు ఆదేశించాలని

కోరుతున్నాను'' అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.
అఅఅ
ఎన్నికలు ఆరునెలల్లో వొస్తాయనగా 'ఆర్ధిక దోపిడీ' అంటూ రోజుకొక పాలకపక్ష నాయకుడి పేరు చెప్పి ప్రతిపక్షం రచ్చచేయడం, పాలక పార్టీ నాయకులందరూ దోపిడీదారులని ప్రజలను నమ్మించాలని చూడడం, ప్రతిపక్షంలో మాత్రం అందరూ 'ఆర్థిక ధర్మరాజులే' అన్నట్లు ప్రచారం చేయడం దేశంలో ప్రతి ఎన్నికలప్పుడూ జరిగేదే. ఎన్నికల తరువాత ఏ పక్షంవారూ ఆ విషయాలపై ప్రస్తావించక పోవడం, ప్రస్తావించినా ఎంక్వయిరీ కమిటీలకు పరిమితం కావడం దేశ ప్రజల అనుభవం.
రోజుకొక నాయుకుడి ఆర్థిక దోపిడీపై జవాబు చెప్పాల్సిన ఆర్థిక మంత్రి, పార్లమెంటులో జవాబులు చెప్పడంలో తలమునకలై ఉన్నాడు. పరమేశ్వరను ఎలా కాపాడాలో ఆలోచించే సమయంలేని మంత్రి జవాబిస్తూ, విచారణకు పార్లమెంటరీ సంఘాన్ని వేస్తాం'' అంటూ సమాధానం చెప్పడంతో రచ్చ సద్దు మణిగింది.
అఅఅ
పార్లమెంటులో నిత్యం జరిగిన చర్చ వల్లనేమో రాజకీయ నాయకులు చేసే అప్పులగురించి, పాత అప్పులు తీర్చకనే కొత్త అప్పులు తీసుకునే విధానం గురించి ప్రజల్లో కూడా నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. చేసిన అప్పులు, కట్టని అప్పులు చర్చకు రావడం వల్లనేమో, తాము పదివేలు అప్పు తీర్చకుంటేనే లాయర్‌ నోటీసులిచ్చి, కోర్టుకు ఈడ్చే బ్యాంకులు పరమేశ్వరకు వేలకోట్ల అప్పు, అప్పు మీద అప్పు ఎలా ఇచ్చారు? ప్రజల్లో చెలరేగిన ఈర్ష్యతో ఈసారి ఎన్నికల్లో యాభై కోట్లు ఖర్చు పెట్టినా ఎంపీగా పరమేశ్వర ఓడిపోయాడు. పరమేశ్వరపై ఎంక్వయిరీ కమిటీ వేశారు.
అప్పు కంతులు కట్టమని బ్యాంకుల నుంచి, పిలిచినపుడు రావాలని పార్లమెంటరీ కమిటీ నుంచి, ప్రజా ప్రయోజనం పేరుతో కేసు వేయడంతో కోర్టు నుంచి, కేసును విచారించమని కోర్టు ఇచ్చిన తాఖీదుతో సమన్లు పంపిన సిబిఐ నుంచి, బ్యాంకుల్లో తీసుకున్న డబ్బు ఏం చేశారో వివరించమని ఈడి నుంచి వస్తున్న ఒత్తిళ్ళను తట్టుకోవడం కష్టమని, ఇలాంటి ఒత్తిడులు ఇంకా పెరుగుతాయని పరమేశ్వర గ్రహించాడు.
ఈ ఆలోచన వచ్చాకా నాలుగురోజులు నిద్రపోలేక పోయాడు. నాలుగో రోజు కోడి కునుకు పట్టగానే, ఓ విచిత్రమైన కలవచ్చింది. కోర్టులో కేసు విచారిస్తున్న జడ్జీగారు ''ఎనిమిదివేల కోట్లంటే ఎంతో తెలుసా? అంత డబ్బు పెట్టి ఏ నీటిప్రాజెక్టో కట్టిఉంటే, ఆ ప్రాజెక్టు కింద వేలకుటుంబాలు బతికిపోయేవి. లేదా ప్రతికుటుంబానికి ఐదేసి లక్షలు ఖర్చుపెట్టి ఇండ్లు కట్టించి ఉంటే లక్షా అరవై వేల కుటుంబాలకు నీడ దొరికేది. 33 లక్షల మంది పిల్లలకు సంవత్సరం పాటు పాలు దొరికేవి. ఇన్ని జీవితాల అవసరాలను మట్టిలో కలపడమంటే వేలమందిని హతమార్చడంతో సమానం. ఇలాంటివాళ్ళు జీవించడం భూమికి భారం, మరణశిక్ష అమలు చేయండి,'' అంటూ తీర్పు చెప్పారు. కలలో వచ్చిన తీర్పు నిజమైతే ... భయం పట్టుకుంది పరమేశ్వరకు.
ఈ కమిటీలు, కోర్టుకేసులు, తీర్పులు తప్పించుకోవాలంటే ఒకటేమార్గం. ఎంపీ కావడమే మార్గం. రాజ్యసభ పదవీకాలం ముగిసిన ఎంపీల స్థానంలో తను ఎంపిక కావడమే ఇందుకు సులభమైన మార్గమనుకున్నాడు. ముప్పైమంది ఎమ్మెల్యేలను కొని రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
నెలకోసారి బ్యాంకులనుంచి కట్టాల్సిన కంతుల గురించి నోటీసులు ఆగడం లేదు. కంతులు కట్టడానికి తన బ్యాంకు అకౌంటులో డబ్బు లేదు. మిగిలిన మార్గమొక్కటే. తిరిగి బ్యాంకులో అప్పు చేయడం. కొత్తగా అప్పులు చేసి పాత అప్పులు తీర్చడం తన తండ్రి చేశాడు. తను ఇన్నాళ్ళూ అదే చేశాడు. ఏదో ఒక బ్యాంకులోను ఇప్పించమని ప్రార్థిస్తూ పరమేశ్వర తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు.
అఅఅ
బ్యాంకులు అప్పుల వసూలు విషయంలో కొత్తబాటలు వేశాయి. బ్యాంకు ఆఫీసర్లు వసూళ్ళపై దృష్టి పెడుతుండడం, వసూలుకు సంబంధించిన కోర్టుకేసులు చూడడం, అప్పు చేసిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసుకోవడం, అక్కడికెళ్లి అప్పు తీర్చమని అడిగేలోపు అతడు ఉడాయించడం, ట్రాన్సఫర్లవల్ల అప్పు ఇచ్చిన ఆఫీసర్‌ ఒకరు కావడం, అప్పు వసూలు చేయవలసింది మరొకరు కావడం, ఎప్పటికి తీరనవిగా పెద్ద అప్పులు మిగిలిపోవడం, అధికార్లకు ప్రాణాపాయ బెదిరింపులు రావడంలాంటి టెన్షన్లతో బ్యాంకులకు సంబంధించిన మిగతా వ్యవహారాలు కుంటుబడుతున్నాయని బ్యాంకులు గుర్తించాయి. ఈ సమస్య పరిష్కారానికి 'అప్పు వసూలు ఏజెన్సీ'లను నియమించుకోవడం మంచిదని, వసూలు చేసినందుకు ఏజెన్సీలకు రెండు శాతం కమీషన్‌ ఇవ్వడానికి నిర్ణయించాయి.
అఅఅ
అప్పుల వసూలుకు నెలకొల్పిన ఏజెన్సీల రిజిస్ట్రేషన్‌ విషయంలో అన్ని కార్యకలాపాలు ముగించుకుని, అన్నిటికంటే ముందు 'జ్ఞానేశ్వర ఏజెన్సీస్‌' బ్యాంకులకు అప్లికేషన్‌ సమర్పించింది.
సులభంగా అప్పు వసూలుకు వీలుపడే జీవులేవో జ్ఞానేశ్వర ఏజెన్సీ గుర్తించింది. మరెవరు రైతులే, లేదంటే సన్న వ్యాపారులే!
''కొత్తగా అప్పు వసూలు కోసం నియమింపబడ్డ సంస్థలు ఇంతో అంతో టైం ఇస్తార్లే'' అంటూ అప్పు తీసుకున్న రైతులు, సన్న వ్యాపారులు చర్చించుకున్నారు. వాళ్లకు తెలీదు, పూలమొక్కేలేని ఎడారిలో సైతం తేనెతుట్టెలు వెతికి తేనె తీయగలవారు వసూలు ఏజెంట్లు. మంచి అనే మాటే తెలియని చోట మంచితనం వెతకడం లాంటిదే వాళ్ళ ఆశ.
'పల్లేరు ముల్లు ఊడబెరుక్కోలేనోడు పరిక్కంప ఊడ బెరుక్కునేనా?' జీతం కోసం పనిజేసే ఉద్యోగులతో వేగలేని రైతులు, సన్న వ్యాపారులు పర్సెంటేజి కోసమే పనిజేసే వసూలు ఏజంట్లను తట్టుకోగలరా? భూములు, ఇళ్ళు, బంగారు, అంగళ్లు 'యాడికొస్తే ఆడికి' వీళ్ళు అమ్ముకున్నారు. బ్యాంకు అసలు, వడ్డీ కట్టేశారు. అప్పువసూలుకు నియమించబడ్డ జ్ఞానేశ్వర ఏజెన్సీ దుర్మార్గాలకు యాభైమంది రైతులు, సన్న వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
'బిక్షకోసం గుడ్డోడు పాడితే కళ్ళున్నోడు బిక్ష స్వీకరించినట్లు,' రైతులు, సన్న వ్యాపారుల నుంచి జ్ఞానేశ్వర ఏజెన్సీస్‌ వసూలు చేసిన మొత్తం పరమేశ్వర వాడుకుంటున్నాడు. వసూలు చేసిన అప్పులు బ్యాంకులో జమచేయడానికి పక్షం రోజుల సమయముంటుంది. అలా వసూలు చేసిన డబ్బు చేతిలో మెదులుతుండటంతో బ్యాంకులో అప్పుకోసం అడుక్కోవలసిన పనిలేదు. అవసరాలు తీరిపోతున్నాయి. పరమేశ్వర నాలుగు బ్యాంకులకు శ్రాద్ధం పెట్టాడు. శ్రాద్ధపు కూటి ముద్దను పొడిచి పొడిచి తినే కాకిలా బ్యాంకులను దోచుక తింటూనే ఉన్నాడు, దేవుళ్ళకు మొక్కుతూనే ఉన్నాడు.