అప్రమత్తత, బాధ్యత కలగలిసిన దు:ఖం

సాంబమూర్తి లండ
96427 32008

చొక్కాపు ఎప్పుడూ నిద్రపోడు. ఆ మాటకొస్తే ఉత్తరాంధ్ర మట్టి మీద మొలిచిన ఏ అక్షరాల చెట్టూ నిద్రపోవడానికి లేదు. ఇక్కడ బతుకులు అంత త్వరితగతిన విధ్వంసమవుతుంటాయి. ప్రజలను మభ్య పెట్టి మెడలు నరికే కరవాలాలకు లెక్కే లేదు. ఇది దు:ఖగని. ఏ పిడికెడు మట్టిని తవ్వినా ఏదో శోకఖనిజం బయట పడుతుంది. నిరంతర మెలకువ చొక్కాపు శిల్పం. సామాజిక బాధ్యత లక్ష్మునాయుడి శైలి. వర్తమాన సకల అస్తవ్యస్త వ్యవస్థలూ జీవితాలూ అతడి కవితా వస్తువులు. ఉపాధ్యాయుడిగా సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల పట్ల అవగాహన మాత్రమే కాకుండా వాటి లోగుట్టు తెలిసినవాడు కాబట్టి కవిత్వమై అతడు కలవరించేదీ అవే వస్తువులు. అవే దృశ్యాలు. అవే ప్రతిబింబాలు.
'చొక్కాపు'ది ఉత్తమ కవిత్వం. తెలుగు నేలలో కవిత్వానికి ఇస్తున్న ప్రతి పురస్కారాన్నీ గెలుచుకున్నాడు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు తెలుగులో నిర్వహించే ప్రతి పోటీలోనూ గట్టి గింజ అని నిరూపించుకున్నాడు. ఇంత ప్రయాణం తర్వాత 'కుంకుమ పువ్వుల దు:ఖం'గా పుస్తక ప్రపంచంలోకి తొలి అడుగు వేసాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అతడి ఉత్తమ కవితల సంపుటి. సహజంగానే చొక్కాపు వాక్యాలకు సామాజిక అప్రమత్తత ఎక్కువ. ఆ దృష్టితో చూసినప్పుడు ప్రతి చోటా అతడికి దు:ఖమే కనిపించి వుంటుంది. అన్ని దు:ఖాల్లోనూ స్త్రీ దు:ఖమే ఎక్కువగా తారసపడి ఉంటుంది. కవి చూపు సున్నితమూ సునిశితమూ కాబట్టి స్త్రీల నెలసరి వేదనను 'కుంకుమ పువ్వుల దు:ఖం' అని రూపకీకరిస్తున్నాడు. కుంకుమ పువ్వులు అనగానే కశ్మీర్‌ లోయ గుర్తొస్తే మాత్రం అందులో ఈ కవి తప్పేం లేదు.
'ఉద్దానం' అనే పదం 'ఉద్యానవనం' అనే పదం నుంచి వచ్చి వుండవచ్చని అంటారు. శ్రీకాకుళంలో ఉద్దానం ఏడు మండలాల్లో విస్తరించిన తీర ప్రాంతం. ఒక వైపు కోనసీమను మరిపించే పచ్చని కొబ్బరి తోటలు. మరోవైపు అందమైన సముద్ర తీరం. కానీ ఉద్దానం ఇప్పుడొక శోక తీరం. కిడ్నీ వ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోతున్న విషాదం. ఈ విషాదమే కవి 'ఉద్దాన పర్వం'. 'ఇక్కడి మనుషుల్ని కదిలించకండి!/ ఇంటికో కథ/ గడప గడపకో కన్నీటి గాథ/.. వర్తమానం ఆర్తనాదమై రగులుతున్న చోట/ రేపటిని కోల్పోతున్న రంపపు కోత'. దాదాపు రెండు దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధుల భూతం విజృంభిస్తున్నా ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించకపోవడాన్ని తలచుకుని తీవ్ర అసహనానికి గురైన కవి.. ముగింపులో - 'ఇక్కడి మనుషుల్ని మభ్య పెట్టకండి/... ఇక ఉత్తరించేది పాగా కుచ్చుల్ని కాదు/ కుత్తుకల్నే.' అంటాడు. ఇది ధర్మాగ్రహమే తప్ప బ్యాలన్స్‌ తప్పడం కాదు.
ఒక కవితలో వస్తువు యొక్క అన్ని డైమెన్షన్స్‌ ఆవిష్కరించడం చొక్కాపు అలవాటు. 'పంట పువ్వు' కవితలో రైతు భారతాన్ని సంపూర్ణంగా చిత్రిస్తాడు. 'కమతం సిగలో మెరిసిన పంటపువ్వు/ కరువు రక్కసి కాళ్ళ కింద నలిగి/ రెక్కలు వీడి, వాడుతున్నప్పుడు/ అతని గుండెల్లో పదిలంగా నిద్రపోతున్న దేశపు శ్వాస/ ఓడిపోతున్న సంగతి అతనికి తెలుస్తుందో లేదో!' ఈకవితకు ప్రాణం ఈ చివరి వాక్యంలో ఉందనిపించింది. ఈ దేశంలో రైతు అనేకానేక విధాలుగా ఓడించబడుతున్నాడు. సేద్యం లాభసాటి కాదని నమ్మించడానికి అన్ని వర్గాలూ ఉమ్మడిగా ప్రయత్నిస్తున్న వాస్తవాన్ని కవి బాధాతప్త స్వరంలో ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు. రాజు అయ్యే అన్ని అర్హతలు ఉన్న వాడు రైతు. ఈ నిజాన్ని 'అతనెలా రాజవుతాడు?' అనే కవితలో కవి తనదైన అక్షరాల్లో ఇలా సమర్ధిస్తారు. తనకొక మట్టి సామ్రాజ్యముంది. చుట్టూ పాదులు కట్టిన పచ్చని సామ్యాజ్యముంది. అతని చేతిలో సర్వశ్రేష్ట హలాయుధముంది. తనకొక మంచె సింహాసనముంది. అయితే, రైతే రాజు అన్న ఆర్భాటం ఎంత సత్య దూరమో చెప్పడానికి - 'మట్టి పాదాలపై మేకులు దిగబడుతుంటే/ అప్పుకొండ కింద వెన్నెముక విరిగిపోతుంటే/ దళారీ తలారీలు తల తెగ్గోస్తుంటే/ అతనెలా రాజవుతాడు?' అని సూటిగా ప్రశ్నిస్తాడు.
శీర్షిక కవిత కవి సున్నితత్వానికి, పరిశీలనా శక్తికి, బాధిత వర్గం పట్ల సహానుభూతికి సాక్ష్యం. 'పాదాలకు పని సంకెళ్లు బిగుసుకుని/ పొత్తి కడుపులో కత్తులు దిగబడే క్షణాల్లో/ నీలి చూపుల నిప్పు కణికల్ని దాటి/చాటు దక్కే చోటుకోసమై చిట్లిపోతున్న చెమట చినుకులం' అంటూ స్త్రీ గొంతుతో సమస్యను సమాజం ముందుకు తీసుకువస్తాడు. స్త్రీ రుతుచక్రం వల్ల పడే కష్టాన్ని కుటుంబంతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారు అన్ని స్థాయిల వారు గుర్తించాలనే తపన ప్రతి వాక్యంలోనూ మనకు కనిపిస్తుంది.
పల్లెలు విధ్వంసం కావడం అందరి కంటే ఎక్కువగా కవిని కలవరపెడుతుంది. అందులోనూ 'పంటకు అమృతాన్ని పంచే అమ్మ' లాంటి చెరువులు చేపల పెంపక కేంద్రాలుగా మారిపోవడం అంతులేని వేదనను కలిగిస్తుంది. ఆ వేదనే 'కన్నీటి ముద్ర'. ''అమ్మ ఉండీ అనాధ అయ్యింది ఊరు/ పాలుండీ పరాయిదయ్యింది చెరువు/... ఒడ్డునపడి చేపలు/ ఒడ్డున పడలేక మనుషులు/... చెరువిప్పుడు కలలు లేని నిద్రలో వుంది/ కన్నీటి ముద్రలా కనబడుతోంది.' పర్యావరణ పరిరక్షణ అనే వస్తువు మీద నాలుగైదు వరకూ కవితలున్నాయి. పర్యావరణ వినాశనానికి గల ప్రధాన హేతువుల్లో మనిషికి గల అత్యాశ ఒకటి. దీనిని, చిన్నప్పుడు విన్న పులి - ఉంగరం కథతో ముడిపెట్టి 'విష లిపి' అనే కవితలో చెప్పే విధానం బాగుంటుంది. 'బతుకు జాతరలో/ పులి వేషంలో ప్రత్యక్షమైనప్పుడల్లా/ ఇంకా ఆ చేతిలో ధగధగా మెరుస్తూ/ చిన్నప్పుడు చదివిన పాఠంలోని/ దివ్యమైన బంగారు కడియం/ ఆశగా వెంపర్లాడే అమాయకపు ప్రాణులను/ ఊరిస్తూనే ఉంటుంది.'
కరోనా మింగేసిన జీవితాలు, ఛిద్రం చేసిన బతుకులు, వ్యవస్థలు అన్నీ ఇన్నీ కావు. కోవిడ్‌ భయానక విషాద సమయాలను కవులు కవిత్వం చేశారు. కరోనా బీభత్సం ఒక ఎత్తయితే ముందస్తు సంసిద్ధత లేని లాక్‌డౌన్‌ కారణంగా కొనసాగిన వలస నడక దేశ చరిత్ర పుటల్లో ఎప్పటికీ చెరగని నెత్తుటి చారిక. ఈ సంపుటిలోని 'నిషిద్ధ దారుల్లో', 'పరుగులెత్తింది చాలు' కవితలు ఈ నేపథ్యంలోంచే వచ్చాయి. 'నిషిద్ధ దారుల్లో' కవితలో వలస కూలీలను 'కుబుసం విడిచిన కాలనాగులా/ మెలికలు తిరిగిన మృత్యు మార్గంలో/ క్రిమి తాట్లాడిన త్రోవలో/ నేల నెత్తి మీద నడయాడుతున్న నెత్తుటి నెలవంకలు' అంటాడు కవి. కనీవినీ ఎరగని కష్టాన్ని పాఠకుడికి చూపెట్టేటప్పుడు ఈ కవి ఎంచుకునే ప్రతీకలు, భాష, దృష్టి కోణం కూడా స్పష్టంగా నిర్దిష్టంగా ధ్వనించడాన్ని గమనించవచ్చు. వస్తువు పట్ల కవిలో కలిగిన భావావేశం పాఠకుడిలోనూ కలుగుతుంది. రెండో చీకటి అల దేశాన్ని ఎలా కుదుపేసిందో తెలిసిందే. ఊహకు కూడా అందని మహా విషాదాన్ని 'దేశమిప్పుడు' అనే కవితలో కళ్ళముందుంచుతాడు. 'దేశమిప్పుడు../ దారితప్పి తోడేళ్ళ మందలో ఇరుక్కుని/ చప్పుడు చెయ్యని కుందేలు పిల్ల/ దేశమిప్పుడు ఖనన ప్రయోగశాల/.. ఆరడుగుల మట్టి మందసం' అంటాడు. 'పరుగులెత్తింది చాలు' కవితలో, కవి చెల్లా చెదురైన జీవితాలను, భయంతో ప్రకంపిస్తున్న సమూహాలను - 'బతుకు దారుల్లో పరుగులెత్తింది చాలు! కాస్త నిమ్మళించండి' అంటూ కర్తవ్యబోధ చేస్తాడు. రేపటి పట్ల ఆశను నింపే ప్రయత్నం చేస్తాడు.
కవి ప్రజల పక్షం. బాధితుల వర్గం. ప్రజల పక్షాన నిలబడి రాజ్యం చేసే ప్రతి కుట్రనూ బట్టబయలు చేస్తాడు. విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రను 'ఉక్కపోత' కవితలో ఎండగడతాడు. ఆంగ్ల మాధ్యమాన్ని నిర్బంధం చేస్తున్న సందర్భంలో ఆ 'దగ్ధస్ప ృహ' ఎద్దేవా చేస్తాడు. దళిత స్వరంతో 'అంటరాని ఋతువు'ను రాస్తాడు. లక్ష్మునాయుడు వస్తు విస్తృతి ఎక్కువున్న కవి. 68 కవితలున్న ఈ సంపుటిలో అతడు విభిన్న వస్తువులను కవిత్వం చేశాడు.
ఈ నాలుగు విషయాల్లో కవి కొంత ఆలోచన చేయాల్సి వుంది.
1. వస్తువును వర్ణిస్తూ పోవడం వల్ల కవిత నిడివి పెరుగుతుంది. (ఉదా: 'ఊడా'మణి కవిత) అందమైన దృశ్యాల మధ్య నడకే అయినా కొంత దూరం తర్వాత మనసు అలసిపోతుంది.
2. కవిత్వం గంభీరంగా ఉండాలనేం లేదు. కవి భాష కవిని సామాన్యుడి నుంచి దూరం చేయకూడదు. 'పచ్చని చెట్టుని పల్లె ఆడపడుచుని చేస్తుంది ఊరు' అన్నప్పుడు ఉండే ఉద్వేగం, దగ్గరితనం... 'శత సహస్ర వట పత్రపు సత్రమై' అన్నప్పుడు ఉండదు. అమ్మభాష అవసరాన్ని చెప్పే కవితకు 'ద్వారబంధం' అని సరళమైన పేరు పెట్టి, 'మాతృభాష - ఆయత్న సిద్ధ స్వాస్థ్యం' అనే వాక్యంతో మొదలు పెట్టడం సమంజసం కాదు. 'ఎవరి కోసం రాస్తున్నాం' అనే ప్రశ్న మనకు మనం వేసుకుంటూ ఉండాలి.
3. వాక్యానికీ వాక్యానికీ మధ్య ఖాళీలో పాఠకుడు వస్తువు గురించి ఆలోచిస్తాడు. సన్నివేశాన్ని కొంత ఊహించుకుంటాడు. తర్వాత కవి చూపించబోయే దృశ్యాలను లేదా పరిష్కారాలను పరికల్పన చేసుకుంటాడు. ఆ 'స్పేస్‌'ని కవి పాఠకుడికి ఇవ్వాలి. కొన్ని కవితల్లో స్టాంజా బ్రేక్‌ అనివార్యం అనిపించింది.
4. చొక్కాపు తనకు తానుగా నిర్మించుకున్న దారిలో వడివడిగా సుఖంగా ప్రయాణిస్తున్నాడు. అతడి వాక్యనిర్మాణం పాతదైనా కొత్తదైనా అది అతడి సొంత అధ్యయనం, సాధన, కృషి నుంచి పుట్టింది. కానీ కవిలో కొత్త వస్తువు కోసమో, తాజా పరిమళం కోసమో, నూతన నిర్మాణాల కోసమో వెతుకుతూ వుంటుంది ప్రపంచం. అందుకని కవి శోధనా సాధనా కొనసాగాలి.
'కుంకుమ పువ్వుల దు:ఖం' వర్తమానం యొక్క అన్ని పార్శ్వాలను దృశ్యీకరిస్తుంది. సమాజం ఎలా వుంటే బాగుంటుందో అన్న చిత్రాన్నీ, ఇప్పటి వివర్ణ దృశ్యాలనీ పక్కపక్కన పెట్టి చూపించి ఎంతగా శిథిలమైందో పోల్చుకో మంటాడు కవి. కవితా వస్తువును అత్యుత్తమ కవిత్వంతో జోడించి మనసు మీద గాఢమైన ముద్ర వేశాడు. ఇది ఎవరి వారు చదువుకొని ఆనందించి ఆలోచించి ఆచరణ వైపు కదిలేలా చేసే కవిత్వం. ముఖచిత్రం శీర్షికకు తగ్గట్టుగా ఉంది. ముఖచిత్రాన్ని కవే స్వయంగా గీయడం విశేషం. అభినందనీయం. ప్రతుల కోసం 95732 50528 నెంబర్‌లో కవిని సంప్రదించవచ్చు.